Share News

TTD Ghee Scam: టీటీడీలో అక్రమార్కులు

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:30 AM

కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సిట్‌ దూకుడు పెంచింది. ఇప్పటికే 24 మంది నిందితులపై కేసు నమోదు చేయగా ఇప్పుడు మరో 12 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో...

TTD Ghee Scam: టీటీడీలో అక్రమార్కులు

  • ‘కల్తీ నెయ్యి’ నిందితుల్లో 12 మంది అధికారులు

  • ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్‌

  • వారిలో ఇప్పటికే అరెస్టయిన సుబ్రమణ్యం

  • ఈ జాబితాలో ఐదుగురు డెయిరీ నిపుణులు

  • ప్లాంట్లు తనిఖీ చేయకుండానే అనుకూల నివేదికలు

  • ఈ కేసులో ఫిర్యాదుదారే నిందితుడైన వైనం

  • కల్తీని దాచిన ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్యానల్‌ సభ్యుడు

  • క్రమశిక్షణ చర్యల సెక్షన్‌ ఉద్యోగే క్రమశిక్షణ తప్పారు

  • లంచంగా నగదు, వెండి నాణేలు, మొబైల్‌ ఫోన్లు

తిరుపతి/తిరుపతి(నేర విభాగం), నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సిట్‌ దూకుడు పెంచింది. ఇప్పటికే 24 మంది నిందితులపై కేసు నమోదు చేయగా ఇప్పుడు మరో 12 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ నెల 23న సిట్‌ మెమో దాఖలు చేయగా ఆ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొత్తగా చేర్చిన 12 మందిలో టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం పూర్వ జీఎం సుబ్రమణ్యం ఇప్పటికే అరెస్టయ్యారు. మిగిలిన 11 మందిలో ఆరుగురు టీటీడీ అధికారులు, ఉద్యోగులు.మిగతా ఐదుగురూ టీటీడీ నియమించిన డెయిరీ నిపుణులు. కాగా, ఈ 11 మందిలో నెయ్యి కల్తీపై ఫిర్యాదు చేసిన మునుపటి జీఎం మురళీకృష్ణ కూడా ఉన్నారు. దీంతో ఫిర్యాదుదారే నిందితుడుగా మారినట్టయింది. ఏసీబీ కోర్టులో సిట్‌ దాఖలు చేసిన మెమోలో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి.


కొత్తగా చేర్చిన నిందితులు వీరే..

కల్తీ నెయ్యి కేసులో ఏ25గా తిరుమల గోడౌన్‌ కీపర్‌గా విధులు నిర్వహించిన డిప్యూటీ ఈవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ పల్లి ఈశ్వర రెడ్డి(34), ఏ26గా గతంలో ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన ముద్దు వెంకట అనిల్‌ కుమార్‌(52), ఏ27గా తిరుపతి గోడౌన్‌ డిప్యూటీ ఈవోగా పనిచేసి రిటైరైన పోలేపల్లి వెంకట నటేశ్‌బాబు(62), ఏ28గా శనివారమే రిటైరైన మునుపటి ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం పేరూరు జగదీశ్వర రెడ్డి(62), ఏ30గా ఈ కేసు ఫిర్యాదుదారు, ప్రొక్యూర్‌మెంట్‌ మాజీ జీఎం ప్రళయకావేరి మురళీకృష్ణ (63), ఏ31గా టీటీడీ గోశాల మునుపటి డైరెక్టర్‌ డాక్టర్‌ కె.హరినాథరెడ్డి (57), ఏ32 నుంచి ఏ36 వరకూ గతంలో టీటీడీ టెక్నికల్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ సభ్యులుగా నియమించిన డెయిరీ నిపుణులు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మల్లం మహేందర్‌ (59), తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన డాక్టర్‌ వి.వెంకట సుబ్రమణియన్‌ (59), సికింద్రాబాద్‌కు చెందిన ఎం.విజయభాస్కర రెడ్డి (62), బెంగళూరుకు చెందిన డాక్టర్‌ బత్తుల సురేంద్రనాథ్‌ (67), డాక్టర్‌ కె.జయరాజారావు(62) ఉన్నారు.


ఎవరెవరి పాత్ర ఏమిటంటే...

  • పల్లి ఈశ్వర రెడ్డి తిరుమలలో గోదాములకు సంబంధించిన డిప్యూటీ ఈవో కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అక్కడ ఆయన నాలుగో నంబరు గోడౌన్‌ కీపర్‌గా ఉన్నారు. భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగా, ఏఆర్‌ డెయిరీల తరపు కీలక నిందితుడు పొమిల్‌ జైన్‌ నుంచి కమీషన్‌ ఏజెంట్‌ పి.పి. శ్రీనివాసన్‌ ద్వారా రూ.23,600 లంచం డిమాండ్‌ చేసి మరీ తీసుకున్నారు. దానికి ప్రతిగా ఆయా డెయిరీల ట్యాంకర్ల నెయ్యిని అన్‌లోడ్‌కు అనుమతించి, వారి బిల్లులు త్వరగా ప్రాసెస్‌ అయ్యేందుకు సహకరించారు. మైసూర్‌ ల్యాబ్‌ నివేదికను తొక్కిపెట్టి నెయ్యి వెజిటబుల్‌ ఆయిల్‌తో కల్తీ అయిందన్న సంగతి దాచిపెట్టారు.

  • ముద్దు వెంకట అనిల్‌ కుమార్‌ టీటీడీ పరిపాలనా భవనంలో క్రమశిక్షణ చర్యల సెక్షన్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనే నెయ్యి సరఫరా విషయంలో క్రమశిక్షణ తప్పారు. ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం కార్యాలయంలో అగ్‌మార్క్‌ స్పెషల్‌ గ్రేడ్‌ ఆవు నెయ్యి, బియ్యం, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ తదితరాల సరఫరాకు సంబంధించిన ఫైళ్లు చూసేవారు. 2022 జూన్‌ 6న టెక్నికల్‌ టీమ్‌ భోలే బాబా డెయిరీ ప్లాంట్‌ తనిఖీ చేసి నిబంధనల మేరకు నెయ్యి తయారు చేయడం లేదని తేల్చడంతో ఆ డెయిరీని టీటీడీ డిస్‌క్వాలిఫై చేసింది. అనిల్‌కుమార్‌ దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భోలే బాబా డెయిరీ తిరిగి టెండర్లలో పాల్గొనేందుకు సహకరించారు. దీనికిగాను పొమిల్‌ జైన్‌ నుంచి ఏజెంట్‌ శ్రీనివాసన్‌ ద్వారా అనిల్‌ రూ.59,600 లంచం తీసుకున్నారు.

  • గౌడౌన్‌ విభాగం డిప్యూటీ ఈవోగా పనిచేసి రిటైరయిన పోలేపల్లి వెంకట నటేశ్‌ బాబు తిరుపతి వేర్‌ హౌస్‌ డిప్యూటీ ఈవోగానూ పనిచేశారు. ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిళ్లు తీసి టీటీడీ ల్యాబ్‌కు పంపించే విషయంలో భోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్‌ డెయిరీలకు సహకరించారు. ఆ డెయిరీలు సరఫరా చేసిన టిన్నులు, ట్యాంకర్ల నుంచీ నెయ్యి శాంపిళ్లను మైసూరులోని సీఎ్‌ఫటీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టు రాకముందే ఆ నెయ్యిని అన్‌లోడ్‌ చేసి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించేందుకు కారకులయ్యారు. ల్యాబ్‌ నుంచి వచ్చిన రిపోర్టులో నెయ్యి కల్తీ అయిందని ఉన్నప్పటికీ ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. ఇలా సహకరించినందుకు గాను పొమిల్‌ జైన్‌ నుంచి ఏజెంట్‌ శ్రీనివాసన్‌ ద్వారా రూ.18,100నగదు, గూగుల్‌ పే ద్వారా రూ.2వేలు తీసుకున్నారు.


డెయిరీ నిపుణులతో పూర్వ జీఎంలు కుమ్మక్కు

టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగ జీఎంలుగా పనిచేసిన పేరూరు జగదీశ్వర రెడ్డి, ఆర్‌ఎస్ఎస్‌వీఆర్‌ సుబ్రమణ్యం, ప్రళయకావేరి మురళీకృష్ణ, డాక్టర్‌ కె.హరినాఽథరెడ్డి టీటీడీ బయటినుంచి నియమించిన ఐదుగురు డెయిరీ నిపుణులతో కుమ్మక్కై డెయిరీల నుంచి లంచాలు తీసుకుని కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించారు. వీరంతా ఆయా సమయాల్లో టెక్నికల్‌ టీమ్‌ సభ్యులుగా వ్యవహరించారు. భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగా, ఏఆర్‌ డెయిరీల ప్లాంట్లను తనిఖీలు చేయడానికి కమిటీ ఏర్పాటైంది. అయితే ప్లాంట్లను తనిఖీ చేయకుండానే ఈ కమిటీ సభ్యులు ఆయా డెయిరీలకు అనుకూల రిపోర్టులు ఇచ్చారు. దీంతో ఆ డెయిరీలకు అర్హత లేనప్పటికీ టీటీడీకి ఆవు నెయ్యి సరపరా టెండర్లలో పాల్గొన్నాయి. అలా సహకరించినందుకు జగదీశ్వర రెడ్డి, ప్రళయకావేరి మురళీకృష్ణ పొమిల్‌ జైన్‌ నుంచి రూ.5వేల విలువైన 50 గ్రాముల వెండి నాణేలు లంచంగా తీసుకున్నారు. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత విషయంలో నిజాయితీగా వ్యవహరించాల్సిన టీటీడీ అధికారులు, ఉద్యోగులు స్వల్ప ప్రయోజనాలకు కక్కుర్తి పడ్డారు. టీటీడీలో ప్రొక్యూర్‌మెంట్‌ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి జీఎం దాకా అన్ని స్థాయుల్లోనూ కల్తీ నెయ్యి సరఫరాకు యఽథాశక్తి సహకరించారు. సిట్‌ దర్యాప్తు పూర్తయితే గానీ తెర వెనుక కీలక వ్యక్తులు ఎవరో, వారి అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో పూర్తిగా తెలియదు.


డెయిరీ నిపుణులకు రూ.లక్షల్లో లంచాలు

టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డెయిరీలు, టెండర్లలో పాల్గొనే డెయిరీలకు నిజంగానే అర్హత, సామర్థ్యం ఉందా అన్నది తెలుసుకునేందుకు ఆయా డెయిరీల ప్లాంట్లను టెక్నికల్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌ తనిఖీ చేసి టీటీడీకి నివేదికలు ఇవ్వాలి. ఈ కమిటీలో సభ్యులైన విజయ్‌భాస్కర రెడ్డి, ప్రీమియర్‌ డెయిరీ ఎండీ జగ్‌మోహన్‌ గుప్తా నుంచి రూ.2.50 లక్షలు లంచంగా పుచ్చుకున్నారు. ఈ విధంగా ప్రతి ప్లాంట్‌ తనిఖీ సందర్భంలోనూ అనుకూల రిపోర్టు ఇవ్వడానికి లంచం అడిగి మరీ తీసుకున్నారు. ఇక భోలేబాబా డెయిరీ ప్లాంట్‌ తనిఖీ చేసినట్టు రిపోర్టు ఇవ్వడానికి పొమిల్‌ జైన్‌ నుంచి బి.సురేంద్రనాథ్‌, కె.జయరాజరావు రూ.50వేల విలువైన శామ్‌సంగ్‌ మొబైల్‌ ఫోన్లు చెరొకటి తీసుకున్నారు.

కల్తీని ప్రస్రావించకుండా కప్పదాటు

సురేంద్రనాథ్‌ బెంగళూరులో డెయిరీ కెమిస్ట్రీ డివిజన్‌కు హెడ్‌గా, ఫుడ్‌ సేఫ్టీకి సంబంఽధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్యానెల్‌ మెంబర్‌గానూ ఉన్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందని తెలిసి కూడా ఆ విషయం దాచిపెట్టారు. మైసూరులోని సీఎ్‌ఫటీఆర్‌ఐ ల్యాబ్‌ వెజిటబుల్‌ ఆయిల్స్‌తో నెయ్యి కల్తీ అయినట్టు గుర్తించి, ఆ రిపోర్టును టీటీడీకి పంపించింది. దాన్ని పరిశీలించి అభిప్రాయం తెలియజేయాలని కోరుతూ సురేంద్రనాథ్‌కు ఫార్వర్డ్‌ చేశారు. అయితే అన్ని పారామీటర్లు సక్రమంగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ బీటా సిటోస్టిరాల్‌ టెస్టు గురించి మాత్రం ప్రస్తావించలేదు. మైసూరు ల్యాబ్‌ నిర్వహించిన ఆ టెస్టులో పాజిటివ్‌ వచ్చింది. అంటే నెయ్యి వెజిటబుల్‌ ఆయిల్‌తో కల్తీ అయిందని స్పష్టమైంది. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా సురేంద్రనాథ్‌ కప్పదాటుగా వ్యవహరించారు.

Updated Date - Nov 30 , 2025 | 05:32 AM