Y.V. Subba Reddy PA Appanna: నెయ్యిలోనూ కమీషన్ల దందా
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:31 AM
కమీషన్లు కొడితేనే ఆర్డర్లు తాగి ఊగే మద్యంకైనా ఇదే విధానం! తిరుమల లడ్డూకు వాడే నెయ్యికైనా ఇదే పాలసీ! జగన్ హయాంలో జరిగిందిదే...
కాంట్రాక్టర్లకు వైవీ పీఏ అప్పన్న బెదిరింపులు!
భోలేబాబా, ప్రీమియం డెయిరీలపై ఒత్తిళ్లు.. కమీషన్లు
ఇవ్వకుంటే కాంట్రాక్టుల రద్దు.. నేరుగా, ఫోన్లో హెచ్చరికలు
అప్పన్న నిరుపేద.. అయినా ఢిల్లీ బ్యాంకుల్లో 4.5 కోట్లు
విశాఖలో 13 ఖరీదైన స్థలాలు, ఫ్లాట్లు
ఎవరి బినామీయో తేల్చేందుకు సిట్ సమాయత్తం
తిరుపతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కమీషన్లు కొడితేనే ఆర్డర్లు! తాగి ఊగే మద్యంకైనా ఇదే విధానం! తిరుమల లడ్డూకు వాడే నెయ్యికైనా ఇదే పాలసీ! జగన్ హయాంలో జరిగిందిదే! కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో బుధవారం అరెస్టయిన టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్న పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా దర్యాప్తు చేస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీల నుంచి కమీషన్లు దండుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో వైవీ వ్యవహారాలు చక్కబెట్టే క్రమంలో చిన్న అప్పన్న 2022 నుంచి 2024 ఎన్నికల దాకా నెయ్యి సరఫరా కాంట్రాక్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. 2022లో టీటీడీ మార్కెటింగ్ విభాగం కీలక అధికారి నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న డెయిరీల జాబితా, ధరల వివరాల వంటివి అతడు సేకరించినట్లు నిర్ధారించింది. భోలేబాబా డెయిరీ, ప్రీమియం డెయిరీ దాకా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అన్ని డెయిరీల ప్రతినిధులతో చర్చించినట్లు పసిగట్టింది. వారితో ఫోన్లో, నేరుగా పలు దఫాలుగా మాట్లాడి కమీషన్ల కోసం ఒత్తిడి చేశాడని, మాట వినకుంటే కాంట్రాక్టులు రద్దు చేయిస్తానంటూ బెదిరించాడని విశ్వసనీయంగా తెలిసింది.
ఆయా డెయిరీల నుంచీ హవాలా మార్గంలో కమీషన్లను అందుకున్నట్టు తెలిసింది. వీటన్నింటినీ నిర్ధారించుకున్న తర్వాతే సిట్ అధికారులు చిన్న అప్పన్నకు నోటీసులు జారీచేసి గత జూన్‌లోనే తొలి విడత విచారించారు. అతడి అరెస్టును అడ్డుకునేందుకు వైవీ హైకోర్టును ఆశ్రయించడం, సిట్‌లో లేని అధికారి దర్యాప్తు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆరోపించడం.. ఆయన నోటీసులు చెల్లవని హైకోర్టు తీర్పు ఇవ్వడం.. సుప్రీంకోర్టు ఆ తీర్పును పక్కనపెట్టడం వంటి పరిణామాలతో దర్యాప్తు ప్రక్రియ మూడున్నర నెలలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. లేదంటే గత జూన్‌లోనే చిన్న అప్పన్నను అరెస్టు చేసి ఉండేవారమని సిట్‌వర్గాలు తెలిపాయి. సుప్రీంఆదేశాలతో దర్యాప్తు పునఃప్రారంభమైన వెంటనే చిన్న అప్పన్నను అరెస్టు చేయడం గమనార్హం.
రూ.కోట్ల ఆస్తులున్న ‘నిరుపేద’
చిన్న అప్పన్నను అరెస్టుచేసిన సిట్ అధికారులు బుధవారం రాత్రి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతడికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. వారు ఇప్పటి వరకూ సేకరించిన ఆధారాల ప్రకారం సుబ్బారెడ్డి సన్నిహిత అనుచరుడైన చిన్న అప్పన్న నిరుపేద. తల్లిదండ్రులు జీవించి లేరు. స్వగ్రామంలో పూరిల్లు తప్ప మరే ఆస్తులూ లేవు. పెద్దగా చదువు కూడా లేదు. అవివాహితుడు. అయితే ఢిల్లీలో ఇతడి పేరిట నాలుగైదు బ్యాంకు ఖాతాలున్నాయని, వాటిలో రూ. 4.50 కోట్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది. విశాఖ నగరంతో పాటు పరిసరాల్లో ఖరీదైన 13 స్థలాలు, మరో నాలుగైదు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు ఇతడి పేరిట ఉన్నట్లు గుర్తించింది. చిన్న అప్పన్న కుటుంబ నేపథ్యం, సాగించిన వ్యవహారాలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో.. గతప్రభుత్వంలో వైసీపీ కీలక నేతలను అడ్డుపెట్టుకుని సొంతంగా దందా సాగించాడా.. లేక వైసీపీ కీలక నేతలకు బినామీగా పనిచేశాడో తేల్చుకునేందుకు సిట్ సిద్ధమైంది. అతడిని వారం పాటు తమ కస్టడీకి అనుమతించాలని కోరుతూ నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీకి తీసుకుని విచారిస్తే అతడి పాత్రపై మరింత స్పష్టత వస్తుందని భావిస్తోంది. ఎలాంటి ఆస్తిపాస్తులూ లేని వ్యక్తి బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్ల నగదు ఎలా జమయింది.. ఎవరు.. ఎందుకు వేశారు.. విలువైన స్థలాలు, ఫ్లాట్లు ఎలా కొనుగోలు చేశారు? అంత భారీ మొత్తాలు ఎలా వచ్చాయన్న అంశాలపై దృష్టి సారించనుంది. ఈ అంశాలపై స్పష్టత వస్తే చిన్న అప్పన్న సొంతంగా దందా నడిపాడో, కీలక వ్యక్తులకు బినామీగా ఉన్నాడో తేలిపోతుంది. ఇప్పటికే రెండు విడతలుగా చిన్న అప్పన్నను ప్రశ్నించిన సిట్ అధికారులు ఆ సందర్భంగా అతడు చెప్పిన ప్రతి అంశాన్నీ వీడియో, ఆడియో రికార్డింగ్ చేసినట్లు సమాచారం. కోర్టు కస్టడీకి అనుమతిస్తే మరోసారి విచారించనుంది. ఆ సందర్భంగా వెల్లడించే వివరాలను బట్టి అవసరమైతే వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసి చిన్న అప్పన్న సమక్షంలోనే ఆయన్ను విచారించే అవకాశముందని తెలిసింది.
ఢిల్లీ ఏపీ భవన్‌లో ఉద్యోగం.. టీటీడీ నుంచి జీత భత్యాలు?
వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉండగా.. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఓఎ్‌సడీగా నియమితుడైన చిన్న అప్పన్నకు జీత భత్యాలు మాత్రం టీటీడీ నుంచీ అందినట్లు సమాచారం. జీత భత్యాలతో పాటు కారు, ఇంటి అద్దె అలవెన్సు తదితరాలకు నెలకు రూ.1.30 లక్షల వరకూ టీటీడీ నిధులు చెల్లించినట్లు తెలిసింది. ఇదెలా జరిగిందో సిట్ ఆరా తీస్తోంది.
2022లోనే నెయ్యి కల్తీ నిర్ధారణ?
టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీలను కమీషన్ల కోసం బెదిరించే క్రమంలో 2022లోనే కల్తీ వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. అప్పట్లో మాట వినని డెయిరీలను దారిలోకి తెచ్చుకునేందుకు మూడు డెయిరీలకు సంబంధించిన నాలుగు శాంపిళ్లను మైసూరులోని ల్యాబ్‌కు పంపగా, వెజిటబుల్ ఆయిల్స్ తదితరాలతో నెయ్యి కల్తీచేసినట్లు రిపోర్టు వచ్చిందని, అప్పటి కీలక వ్యక్తుల ఒత్తిడితో టీటీడీ ఆ నివేదికను తొక్కిపెట్టిందని సిట్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. కమీషన్ చెల్లించేందుకు అంగీకరించకపోవడంతో అప్పటిదాకా నెయ్యి సరఫరా చేస్తున్న డెయిరీని పక్కకు తప్పించినట్లు తెలిసింది. మరో డెయిరీ చిన్న అప్పన్నకు కమీషన్ ఇస్తామనడంతో మునుపటి డెయిరీ కంటే ఏకంగా రూ.130 దాకా ధర పెంచి కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకున్నట్లు సమాచారం.