TTD Former Chairman Bhumana Karunakar: గోవుల మృతిపై ఆధారాలు మీడియాకు అప్పుడే ఇచ్చాను
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:52 AM
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో వంద గోవులు మృతి చెందాయని చేసిన ఆరోపణలకు తన వద్ద ఆధారాలున్నాయని టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు.
మీకు ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు
పోలీసులకు భూమన జవాబు..?
2 గంటలకు పైగా విచారించిన డీఎస్పీ
తిరుపతి (నేరవిభాగం), అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ గోశాలలో వంద గోవులు మృతి చెందాయని చేసిన ఆరోపణలకు తన వద్ద ఆధారాలున్నాయని టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. అయితే ఆ ఆధారాలను ఆనాడే మీడియాకు అందజేశానని.. ఇప్పుడు పోలీసులకు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేసినట్లు తెలిసింది. గోశాలలో గోవులు భారీ సంఖ్యలో చనిపోయాయని గతంలో ఆయన ఆరోపించడం.. ఇవి అసత్య ఆరోపణలంటూ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేయడం.. దీనిపై కేసు నమోదు చేసిన యూనివర్సిటీ పోలీసు స్టేషన్ సీఐ రామయ్య.. ఆధారాలతో గురువారం తమ ముందు విచారణకు హాజరుకావాలని వాట్సాప్ ద్వారా భూమనకు నోటీసులు పంపడం తెలిసిందే. ఉదయం 10.50 గంటలకు తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష, న్యాయవాదులు, వైసీపీ శ్రేణులతో కలిసి భూమన స్టేషన్‌కు వచ్చారు. ఆయనతోపాటు న్యాయవాదులు మాత్రమే లోపలకు వెళ్లారు. డీఎస్పీ భక్తవత్సలం, పోలీసు అధికారులు భూమనను 20ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం.. గోశాలలో 3 నెలల వ్యవధిలో దాదాపు 100 గోవులు చనిపోయాయన్న తన ఆరోపణలకు ఆధారాలున్నాయని భూమన పునరుద్ఘాటించారు. టీటీడీలోని కీలక శాఖల్లో పనిచేస్తున్న వారిలో చాలా మందితో ఇప్పటికీ తనకు సంబంధాలున్నాయని, వారి ద్వారా ఆధారాలు తెప్పించుకుని మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఎప్పుడెప్పుడు ఎన్ని గోవులు చనిపోయాయో తన వద్ద లెక్కలున్నాయని ఆయన సమాధానమిచ్చారు. దాదాపు 2.20 గంటలపాటు విచారణ సాగింది. భూమన జవాబులను క్రోడీకరించి నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.