TTD Faces Controversy: టీటీడీలో అవే తప్పులు!
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:41 AM
టీటీడీని కల్తీ నెయ్యి వ్యవహారం కుదిపేస్తోంది. సరఫరా చేసిన సంస్థలతో పాటు అనుమతించినవారు బాధ్యులుగా మారుతున్నారు. అయినా టీటీడీ అధికారులు మాత్రం గత తప్పుల నుంచి పాఠాలు ....
జీడిపప్పు టెండర్లలో నకిలీ వే బిల్లులు.. చెన్నై కంపెనీల నిర్వాకం
(తిరుపతి- ఆంధ్రజ్యోతి)
టీటీడీని కల్తీ నెయ్యి వ్యవహారం కుదిపేస్తోంది. సరఫరా చేసిన సంస్థలతో పాటు అనుమతించినవారు బాధ్యులుగా మారుతున్నారు. అయినా టీటీడీ అధికారులు మాత్రం గత తప్పుల నుంచి పాఠాలు నేర్వక పోగా మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చెన్నైకి చెందిన రెండు కంపెనీలు నకిలీ వే బిల్లులు సమర్పించి జీడిపప్పు టెండర్లలో పాల్గొనడం కలకలం రేపుతోంది. 1.20 లక్షల కిలోల జీడిపప్పు సరఫరా కోసం సెప్టెంబరు 3న టీటీడీ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. చెన్నైకి చెందిన క్రిస్టీ క్వాలిటీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫంక్షనల్ అండ్ ఇన్నోవేటివ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు పలు కంపెనీలు బిడ్‌లో పాల్గొన్నాయి. దీనికోసం ఒక్కోటీ రూ.28 లక్షలు చొప్పున ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఎంఈడీ) చెల్లించాయి. ఇందులో పాల్గొనే సంస్థకు 75 వేల కేజీల జీడిపప్పు సరఫరా చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని నిబంధన విధించారు. అయితే చెన్నైకి చెందిన పై రెండు సంస్థలూ సమర్పించిన వేబిల్లులను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా నకిలీవని తేలడంతో వాటిని డిస్‌క్వాలిఫై చేసి వదిలేశారు. తప్పుడు పత్రాలతో టెండర్‌లో పాల్గొనేవారి ఈఎండీ మొత్తాన్ని నిబంధనల ప్రకారం వెనక్కి ఇవ్వకూడదు. అలాగే వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. విజిలెన్స్ శాఖకు సమాచారం అందించి, కేసులు నమోదు చేయించాలి. అయితే టీటీడీ అధికారులు మాత్రం నిబంధనలు పక్కనపెట్టి ఆ సంస్థల పట్ల ఉదారంగా వ్యవహరించారు. వారు కట్టిన రూ56 లక్షల మొత్తాన్ని వెనక్కి ఇచ్చేశారు. కనీసం వాటిని బ్లాక్ లిస్టులో కూడా పెట్టలేదు. సెల్ఫ్ డిక్లరేషన్‌నూ అధికారులు పట్టించుకోలేదు. పైగా భవిష్యత్తులో జరిగే టీటీడీ మార్కెటింగ్ టెండర్లలో పాల్గొనేందుకు వారికి అనుమతి ఇచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా పిలిచిన యాలకుల టెండర్లో సైతం ఈ సంస్థలు పాల్గొన్నట్టు సమాచారం. ఈ టెండర్లను త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది.