TTD Ex-GM Subramanyam: చైర్మనే బాస్
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:57 AM
‘కల్తీ నెయ్యి సరఫరాతో నాకు ఎటువంటి సంబం ధం లేదు. చైర్మన్ చెప్పింది చేయాలి కదా. చైర్మనే బాస్’ అని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ మాజీ జీఎం ఆర్‌ఎస్ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం...
ఆయన చెప్పింది చేయాలి కదా.. చేయకపోతే ఉద్యోగాలు ఉంటాయా?
సిట్ విచారణలో మాజీ జీఎం సుబ్రహ్మణ్యం
కల్తీ నెయ్యి కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
తిరుపతి/తిరుపతి (నేర విభాగం), డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘కల్తీ నెయ్యి సరఫరాతో నాకు ఎటువంటి సంబం ధం లేదు. చైర్మన్ చెప్పింది చేయాలి కదా. చైర్మనే బాస్’ అని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ మాజీ జీఎం ఆర్‌ఎస్ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం సిట్ విచారణలో చెప్పినట్లు తెలిసింది. చైర్మన్ చెప్పింది చేయకపోతే తమ ఉద్యోగాలు ఉంటాయా? అని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ నెల 9 నుంచి 4 రోజుల పాటు నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతితో ఏ16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ29 సుబ్రహ్మణ్యంను సిట్ అధికారులు తమ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. కస్టడీ చివరి రోజైన శుక్రవారం రెండున్నర గంటలపాటు విచారించారు. సీబీఐ విశాఖపట్నం డీఐజీ మురళీ రాంబా ఏ29 సుబ్రహ్మణ్యంను.. అదనపు ఎస్పీ, డీఎస్పీలు ఏ16 సుగంధ్‌ను ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం చాలా ప్రశ్నలకు తనకేమీ తెలియదని చెప్పినట్టు తెలిసింది. ఈ వ్యవహారం లో ఆయన ప్రమేయాన్ని సిట్ ఆధారాలతో చూపి ప్రశ్నించగా.. టీటీడీ మొత్తానికి చైర్మనే బాస్ అని, ఆయన చెప్పింది చేయాలి కదా అని అన్నట్టు తెలిసింది. తానో చిన్న అధికారినని, తనపై చాలామంది అధికారులున్నారని చెప్పినట్టు సమాచారం. ‘కేసులో టీటీడీకి సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు కదా.. వారిని కూడా విచారించి చూడండి.. ఎవరూ నా పేరు చెప్పరు’ అని అన్నట్టు తెలిసింది. ఇక ఏ16 అజయ్‌కుమార్ సుగంధ్ కస్టడీ చివరి రోజు కూడా విచారణకు సహకరించలేదని తెలిసింది. టీటీడీకీ తనకూ ఏమిటి సంబంధమని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ తర్వాత రుయా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. 3.30 గంటల సమయంలో నెల్లూరులోని సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించారు.