Share News

Fake Ghee Supply Case: ప్రతి కేజీకీ 25 కమీషన్‌

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:53 AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం నిర్ణయం వెల్లడిస్తామని...

Fake Ghee Supply Case: ప్రతి కేజీకీ 25 కమీషన్‌

  • డెయిరీలకు సుబ్బారెడ్డి పీఏ డిమాండ్‌.. హవాలా మార్గంలో అందిన సొమ్ము

  • ఎవరి ప్రోద్బలంతో వసూలు చేశారో తేలాలి

  • విశాఖలో 14 ప్లాట్లు ఉన్నట్లు సిట్‌ గుర్తింపు

  • చిన్నఅప్పన్న బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయండి

  • హైకోర్టుకు సీబీఐ స్టాండింగ్‌ కౌన్సిల్‌

  • కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ముగిసిన వాదనలు.. ఎల్లుండి నిర్ణయం

అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ప్రకటించిం ది. శుక్రవారం జరిగిన విచారణలో ఇరువైపు ల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఈ మేరకు ప్రకటించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫ రా చేసిన భోలేబాబా, ఇతర డెయిరీల నుంచి చిన్నప్పన ప్రతి కేజీకి రూ.25 కమిషన్‌ డిమాండ్‌ చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణైందని సిట్‌ తరఫున సీబీఐ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పీఎ్‌సపీ సురేశ్‌కుమార్‌ హైకోర్టుకు వివరించారు. హవాలా మార్గంలో పిటిషనర్‌కు సొమ్ము అందిందన్నారు. చిన్నఅప్పన్న కమిషన్‌ ఇచ్చినట్టు నెయ్యి సరఫరా కంపెనీలకు చెందినవారు వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు. ఎవరి ప్రోద్బలంతో కమిషన్‌ వసూలు చేశారో దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. టీటీడీ అప్పటి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి పిటిషనర్‌ పీఏగా వ్యవహరించారని వివరించారు. ఆ సమయంలో వినియోగించిన ఫోన్లు ఇచ్చేందుకు పిటిషనర్‌ నిరాకరిస్తున్నారని తెలిపారు. పిటిషనర్‌కు విశాఖపట్నంలో 14 ప్లాట్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్టు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉన్న కేసులలో నిందితులకు బెయిల్‌ మంజూరుపై సుప్రీంకోర్టు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. చిన్నఅప్పన్న బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ... నకిలీ నెయ్యి సరఫరాలో పిటిషనర్‌కు ఎలాంటి పాత్ర లేదన్నారు. నెయ్యి సరఫరా కంపెనీల నుంచి కమిషన్‌ తీసుకోవడంతో పాటు టీటీడీ వ్యవహారాల్లో తలదూర్చారనేదే పిటిషనర్‌పై ఆరోపణ అని అన్నారు.


లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీల యజమానులు అందరూ బెయిల్‌ పొందారన్నారు. పిటిషనర్‌ పోలీస్‌ కస్టడీ ముగిసిందని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. వాదనలు ముగియడంతో సోమవారం నిర్ణయం వెలువరించనున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో తనకు బెయిల్‌ మంజూ రు చేయాలని కోరుతూ చిన్నఅప్పన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 13 , 2025 | 05:53 AM