TTD General Manager R S C Subramanyam: కల్తీ నెయ్యిలో సుబ్రమణ్యం కుట్రదారు
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:16 AM
తిరుమల శ్రీవారి ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ మాజీ జనరల్ మేనేజర్ ఆర్‌ఎ్‌సఎ్‌సవీఆర్ సుబ్రమణ్యం ప్రొక్యూర్మెంట్ కుట్రదారు అని కోర్టుకు...
టీటీడీ జనరల్ మేనేజర్ హోదాలో బీజం
సుబ్బారెడ్డి పీఏ సహకారంతో దందా
మూడు డెయిరీలతో కలిసి అక్రమాలు
వాటికి లబ్ధి చేకూర్చి.. టీటీడీకి నష్టం
ప్రతిఫలంగా కమీషన్లు, కానుకలు
‘భోలేబాబా’ నుంచి వెండి కంచం
లక్షల్లో నగదు, ఫోన్, వెండి కాయిన్లూ
కల్తీ జరిగినట్టు మైసూర్ ల్యాబ్ నివేదిక ఇచ్చినా భోలేబాబాకు పెద్దఎత్తున ఆర్డర్లు
భక్తుల మనోభావాలు దెబ్బతీశారు: సిట్
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ మాజీ జనరల్ మేనేజర్ ఆర్‌ఎ్‌సఎ్‌సవీఆర్ సుబ్రమణ్యం(ప్రొక్యూర్మెంట్) కుట్రదారు అని కోర్టుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమగ్ర దర్యాప్తు చేస్తున్న సిట్ సుబ్రమణ్యం(ఏ-29)ను అరెస్టు చేసి జైలుకు పంపింది. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. కల్తీ నెయ్యికి స్వచ్ఛమైన ఆవునెయ్యిగా ముద్ర వేయడం.. చుక్క పాలు కూడా కొనుగోలు చేయని డెయిరీలకు అనుకూలంగా సిఫారసు చేయడం.. కల్తీ నెయ్యితో వచ్చే ట్యాంకర్ల ప్రవేశానికి రాచబాట వేయడం.. టీటీడీకి ఆర్థికంగా నష్టం కలిగించడం.. అర్హతలేని డెయిరీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చడం.. అన్నింటికన్నా ముఖ్యంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను కాలరాయడంలో సుబ్రమణ్యం పాత్ర కీలకమని పేర్కొంది. లంచాల రూపంలో లక్షలాది రూపాయలతో పాటు బోలేబాబా డెయిరీ నుంచి వెండి కంచం కూడా తీసుకున్నట్టు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేగాక తనిఖీలకు వెళ్లిన ప్రతిసారి సెల్ ఫోన్, వెండి కాయిన్ ఇలా ఏదో ఒకటి తీసుకున్నట్లు గుర్తించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహకారంతో కల్తీ దందా కొనసాగించాడని నిగ్గు తేల్చింది.
వెండి కంచంతో మొదలు...
టీటీడీ చైర్మన్‌గా సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ విభాగానికి జీఎంగా వ్యవహరించిన సుబ్రమణ్యం అవినీతి వెండి కంచంతో మొదలైనట్లు కోర్టుకు తెలిపింది. నాణ్యత నిర్ధారించే టెక్నికల్ కమిటీలోనూ సభ్యుడైన సుబ్రమణ్యం చేతిలో వైష్ణవి డెయిరీ ప్రతినిధి అపూర్వ చద్దా పంపిన వెండి కంచం పెట్టగానే నెయ్యి సరఫరాకు అర్హత లభించింది. వైష్ణవి డెయిరీతో ఒప్పందం చేసుకున్న బోలేబాబా డెయిరీ ప్లాంటు సందర్శనకు ఆయన వెళ్లినప్పుడు ఖరీదైన సెల్‌ఫోన్‌తో పాటు రూ.3.5లక్షల నగదు ఇచ్చారు. దీంతో అక్కడ ఆవు పాలు సేకరణే లేకున్నా అంతా సవ్యంగా ఉందని ఆమోద ముద్ర వేశాడు. 50 గ్రాముల వెండి కాయిన్ బహుమతిగా ఇచ్చినా లొంగిపోయే సుబ్రమణ్యం బోలేబాబా, వైష్ణవి, మల్ గంగా డెయిరీలతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించాడు. కోట్ల లీటర్ల నెయ్యి సరఫరాకు టెండర్లు వేసిన డెయిరీలు సమర్పించిన అర్హత సర్టిఫికెట్లు నకిలీవా, నిజమైనవా అన్నది కూడా పరిశీలించలేదు.
సుబ్బారెడ్డి పీఏ అప్పన్నతో ఫోన్ కాల్స్
తన దగ్గర 2018లో చిన్న అప్పన్న(ఏ-24) పని మానేశాడని టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని సిట్ తేల్చింది. నెయ్యి సరఫరాదారులు ఎవరు తనతో మాట్లాడినా.. ‘మీరు చైర్మన్ పీఏ చిన్నఅప్పన్నతో మాట్లాడుకోండి’ అని సుబ్రమణ్యం సూచించేవాడు. చిన్నఅప్పన్న నుంచి ఫోన్ రాగానే నెయ్యి సరఫరాదారులకు సహకారం అందించేవాడు. ఇందుకు ఆధారంగా ఫోన్ కాల్స్ డేటాను సిట్ సేకరించింది. 2022 మే 10న బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేయాలన్న టీటీడీ సూచనతో జూన్ 6న తనిఖీ కోసం సుబ్రమణ్యం వెళ్లాడు. బయటి ల్యాబ్‌కు ఆ నెయ్యిని పరీక్షలకు పంపించాలని మెమో జారీ చేశాడు. మైసూరులోని సీఎ్‌ఫటీఆర్‌ఐ ల్యాబ్‌కు నమూనాలు పంపారు. అందులో బెటా సిసోస్టెరాల్, ఇతర వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. సుబ్రమణ్యం మెయిల్‌కు ఆగస్టు 15న ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చినా ఎవ్వరికీ చెప్పకుండా దాచాడు. బోలేబాబాకు 9,450 కిలోలు, 1,07,625 కిలోల చొప్పున వెంటవెంటనే నెయ్యి సరఫరా ఆర్డర్లు జారీ చేశాడు. ఆ తర్వాత కూడా అక్టోబరు 2022 వరకూ ఆర్డర్లు కొనసాగించాడు. మైసూరు ల్యాబ్ నివేదిక తర్వాత నెయ్యి సరఫరాకు మళ్లీ టెండర్లు పిలిచారు. అందులో ఎఫ్‌ఎ్‌సఎస్‌ఆర్ ప్రమాణాలను తప్పనిసరి చేయాలని డెయురీ నిపుణుడు సురేంద్ర నాథ్ సిఫారసు చేశారు. టీటీడీ ఈవో ఆమోదం తీసుకుని టెండర్లు పిలిచారు. ఆల్ఫా డెయిరీ, ప్రీమియర్ డెయిరీలను మినహాయించాలంటూ మరో నోట్ పెట్టి సుబ్రమణ్యం వారికి లబ్ధి చేకూర్చాడు. ఇలా ప్రతిదాంట్లోనూ సుబ్రమణ్యం పాత్ర కీలకమైందని సిట్ వివరించింది.