Share News

TTD EO Anil Kumar: రాజీ చేసుకునే అర్హత ఆయనకు లేదు

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:30 AM

టీటీడీ బోర్డు అనుమతి లేకుండా, అప్పటికి తాను పరకామణి అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి(ఏవీఎస్‌వో) కాకపోయినప్పటికీ వై.సతీశ్‌కుమార్‌..

TTD EO Anil Kumar: రాజీ చేసుకునే అర్హత ఆయనకు లేదు

  • టీటీడీ బోర్డు అనుమతి లేకుండా ఆ పనిచేశారు

  • నాటికి సతీశ్‌కుమార్‌ పరకామణి ఏవీఎస్‌వోగా లేరు

  • 28న జరిగే బోర్డు భేటీలో ఈ అంశాలు నివేదిస్తాం

  • హైకోర్టులో టీటీడీ ఈవో సింఘాల్‌ కౌంటర్‌

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): టీటీడీ బోర్డు అనుమతి లేకుండా, అప్పటికి తాను పరకామణి అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి(ఏవీఎస్‌వో) కాకపోయినప్పటికీ వై.సతీశ్‌కుమార్‌.. నిందితుడు రవికుమార్‌తో లోక్‌అదాలత్‌ వద్ద కేసును రాజీ చేసుకున్నారని టీటీడీ ఈవో అనీల్‌కుమార్‌ సింఘాల్‌ హైకోర్టుకు నివేదించారు. 2023 సెప్టెంబరు 9న ఈ రాజీ కుదిరిందన్నారు. ఎలాంటి అర్హత లేకపోయినా కేసును రాజీ చేసుకున్నందున సతీశ్‌కుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్‌వో) ఈ నెల 17న డీజీపీని కోరారని తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, రిట్‌ పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను ఈ నెల 28న జరగనున్న టీటీడీ బోర్డు సమావేశంలో ఉంచుతామని, పిటిషనర్‌ శ్రీనివాసులు అభ్యర్థనపై బోర్డు నిర్ణయం తీసుకుంటుందని నివేదించారు. అదనపు వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలుకు అనుమతించాలని కోరారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలన్న వినతిని టీటీడీ ఈవో పరిగణనలోకి తీసుకోకపోవడంతో జర్నలిస్ట్‌ ఎం.శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. పరకామణిలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి సీవీ రవికుమార్‌ డాలర్ల రూపంలో పెద్దఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ఈవ్యవహారంతో ముడిపడిన అన్ని రికార్డులను సీఐడీతో సీజ్‌ చేయించింది. పిటిషనర్‌ ఇచ్చిన వినతిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన కౌంటర్‌ వేశారు.

Updated Date - Oct 25 , 2025 | 05:36 AM