TTD Chairman BR Naidu: టోకెన్లు తొలి మూడు రోజులకే..2 నుంచి 8వరకు టోకెన్లు లేకపోయినా తిరుమలకు రావచ్చు
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:30 AM
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు టోకెన్లు లేనివారిని రానివ్వరంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు...
సోషల్ మీడియాలో తప్పుడుప్రచారాలను నమ్మవద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ స్పష్టీకరణ
తిరుమల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు టోకెన్లు లేనివారిని రానివ్వరంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నో టికెట్, నో ఎంట్రీ’ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటిని నమ్మవద్దని కోరారు. కొండపైకి రావద్దు అనడానికి ఎవరికీ అధికారం లేదు. ఉండదు కూడా అని స్పష్టం చేశారు. గత అనుభావాల నేపథ్యంలో తొలి మూడురోజులు మాత్రమే...టోకెన్లు ఉన్నవారికే దర్శనం ఉంటుందని ఇప్పటివరకు ప్రకటిస్తూ వస్తున్నామన్నారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకపోయినప్పటికీ తిరుమలకు వచ్చి సర్వదర్శనాలు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో భక్తులపై ఆంక్షలు లేవన్నారు. రెండు మూడు నెలలుగా టీటీడీ అధికార యంత్రాంగం విశేషంగా కృషి చేసి ప్రణాళికలు సిద్ధం చేసిందని, తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి వైకుంఠద్వార దర్శనాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోందని వివరించారు. కాగా గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు దొంగతనం జరిగిందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ‘అది నాకు తెలీదు’ అని బీఆర్ నాయుడు బదులిచ్చారు.
రెండు గంటల్లోనే దర్శనం: ఈవో
వైకుంఠద్వార దర్శనాల సమయంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, అన్నప్రసాదాలు, వసతి, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాకు తెలిపారు. తొలి మూడురోజుల్లో టోకెన్లు పొందిన భక్తులు కేటాయించిన సమయానికే దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే దర్శనభాగ్యం కలుగుతుందన్నారు. 3,500 మంది పోలీసులు, 1,150 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.