TTD Chairman BR Naidu: భూమన గజదొంగ
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:02 AM
శ్రీవేంకటేశ్వరుడి సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్న తమపై జగన్ మీడియా గజదొంగలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
దర్శనం టికెట్లు అమ్ముకుని.. నాపై ఆరోపణలు చేస్తున్నారు.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫైర్
పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోం
జగన్ మీడియాపై రూ.10 కోట్లకుపరువునష్టం దావా వేస్తున్నా
జగన్, భారతీరెడ్డి తిరుమలకు వచ్చితలనీలాలిచ్చి ప్రసాదాలు తింటారా?
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వరుడి సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్న తమపై జగన్ మీడియా గజదొంగలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమలేశుడి దర్శనం టికెట్లు అమ్ముకున్న గజదొంగ భూమన కరుణాకర్‌రెడ్డి.. తాను టికెట్లు అమ్ముకుంటున్నట్లు చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు. చైర్మన్‌గా తన కోటా వంద టికెట్లలో ఏ రోజునా 50 కూడా వాడలేదని స్పష్టంచేశారు. నాయుడు బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘మీరు ఎవరితోనైనా పెట్టుకోండి.. బీఆర్ నాయుడితో మాత్రం కాదు. తప్పు చేస్తే చొక్కా పట్టుకుని అడగొచ్చు. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. నాపై రాసిన వార్తలకు జగన్ మీడియాపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నా’ అని ప్రకటించారు. జగన్, భారతీరెడ్డి, భూమన దేవాలయాలపై దాడులు చేస్తున్నారని.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, తప్పుడు ఆరోపణలతో బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే జగన్, భారతిరెడ్డి తిరుమలకు వచ్చి తలనీలాలిచ్చి.. కోనేరులో స్నానం చేసి.. నామాలు పెట్టుకుని శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాలు తినాలని బహిరంగ సవాల్ విసిరారు. వీళ్లు రారని, కన్వర్టెడ్ క్రిస్టియన్లు అని గుర్తుచేశారు. ‘భూమన దోపిడీదొంగ. అవినీతి గురించి ఆయన మాట్లాడడమా? ఆయన, ఆయన కొడుకు చేయని దందాలే లేవు. గోవులను చంపించింది భూమన మేనమామ హరినాథ్‌రెడ్డి. ఆనాడు తొక్కిసలాటకు వీరే కారణం. భూమన రెండోసారి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు రూ.1,600 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పి కమీషన్లు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుని దేవుడి సొమ్ముతో రోడ్లు వేసుకున్నారు. ఎన్నో దందాలు చేసిన ఆయన త్వరలో జైలుకు వెళ్లక తప్పదు’ అని చెప్పారు. టీటీడీలో 280 మంది అన్యమతస్థులు పనిచేస్తున్నట్లు గుర్తించామని, వారంతట వారే వెళ్లిపోవడానికి అవకాశం కల్పిస్తున్నామని, ఇంకా 40, 50 మంది వెళ్లాల్సి ఉందని చెప్పారు.