TTD Board Decisions: టీటీడీ కొనుగోళ్లలో అవకతవకలపై ఏసీబీ విచారణ
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:25 AM
టీటీడీ కొనుగోళ్లలో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై ఏసీబీతో సమగ్ర విచారణ చేపట్టాలని బోర్డు నిర్ణయం తీసుకుంది అని చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు
రూ.400 విలువైన శాలువా రూ.1,334కి కొనుగోలు
వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజులు కొనసాగిస్తాం
విధి విధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు
బోర్డు నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ‘టీటీడీ కొనుగోళ్లలో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై ఏసీబీతో సమగ్ర విచారణ చేపట్టాలని బోర్డు నిర్ణయం తీసుకుంది’ అని చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం దాదాపు ఏడు గంటల పాటు ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సభ్యులతో కలిసి బీఆర్ నాయుడు మీడియాకు బోర్డు నిర్ణయాలు వెల్లడించారు. ‘కొనుగోళ్ల విషయంలో సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. మార్కెట్‌లో రూ.350 నుంచి రూ.400 ధర ఉండే శాలువాను రూ.1,334కి కొంటున్నారు. నాకు తెలిసి నాలుగైదేళ్లలో రూ.50 కోట్ల విలువైన మెటీరియల్ కొన్నారు. అక్కడే సందేహం వచ్చి విచారిస్తే కొనుగోళ్లలో చాలా అవినీతి జరిగినట్టు గుర్తించాం. ఇక ఈ విషయాన్ని ఏసీబీ చూసుకుంటుంది’ అని అన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలను యథావిధిగా పదిరోజులు కొనసాగిస్తామని, దీనిపై ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని అటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్ని టికెట్లు, ఎక్కడ ఇవ్వాలి, పారదర్శక కేటాయింపు, భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలా జారీ చేయాలనే అంశాలపై కమిటీ అధ్యయనం చేసి వారం పదిరోజుల్లో విధివిధానాలను రూపొందిస్తుందన్నారు. టీటీడీ గోశాల నిర్వహణ సరిగా లేదని బోర్డు దృష్టికి వచ్చిందని.. గోశాలను టీటీడీనే నిర్వహించాలా లేదా ఇతర వలంటరీ ఆర్గనైజేషన్లకు కేటాయించాలా అనేది పరిశీలించేందుకు నిపుణుల కమిటీ నియమించామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
బోర్డు సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు
సీఎం ఆదేశాలతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 5 వేల ఆలయాలు, భజన మందిరాల నిర్మాణం
దేశంలో టీటీడీ నిర్వహిస్తున్న ఆలయాల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణకు తీర్మానం
కడపజిల్లా ఒంటిమిట్టలో వంద గదుల నిర్మాణం కోసం రూ.37 కోట్లు, 1.35 ఎకరాల్లో పవిత్ర వనం కోసం రూ.2.96 కోట్లు కేటాయింపు
తిరుమలలోని గదుల అద్దెలో వ్యత్యాసాల పరిశీలనకు కమిటీ నియామకం. కమిటీ నివేదిక ఆధారంగా అద్దెల్లో మార్పులు
కరీంనగర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రూ.20 కోట్లు, ఇతర వసతుల కోసం రూ.10 కోట్లు. ఇందులో రూ.10 కోట్లు దాతల ద్వారా విరాళాలు సేకరణ
వేద విశ్వవిద్యాలయం వీసీ సదాశివమూర్తి తొలగింపు
భక్తులకు సౌకర్యాల కల్పన కోసం చెన్నై టీ నగర్‌లోని శ్రీవారి ఆలయ పరిధిలోని 6,227 చ.అ స్థలాన్ని దాతల సహకారంతో రూ.14 కోట్లతో కొనుగోలు