Share News

Shrimp Farming Crisis: చేపల సాగుపైనా ట్రంప్‌ ఎఫెక్ట్‌

ABN , Publish Date - Aug 24 , 2025 | 05:00 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాల భారం.. ఆక్వారంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో రైతులు చేపల సాగువైపు మళ్లుతున్నారు.

Shrimp Farming Crisis: చేపల సాగుపైనా ట్రంప్‌ ఎఫెక్ట్‌

  • రొయ్యలపై సుంకాల ప్రభావంతో చేపల సాగుకు మొగ్గిన రైతులు

  • ఇదే అదునుగా మేత ధర పైపైకి

  • 10 టన్నుల డీవోబీ ధర లక్ష నుంచి 1.79 లక్షలకు పెంచేసిన వ్యాపారులు

  • ప్రభుత్వం జోక్యానికి రైతుల విన్నపం

ఆకివీడు రూరల్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాల భారం.. ఆక్వారంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో రైతులు చేపల సాగువైపు మళ్లుతున్నారు. నిన్న మొన్నటి వరకు రొయ్యల సాగు చేపట్టిన వారు ఇప్పుడు చేపల పెంపకంపై దృష్టి పెట్టారు. అయితే, ఇప్పుడు చేపల పెంపకంపైనా ట్రంప్‌ ప్రభావం కనిపిస్తోంది. చేపలకు మేతగా వేసే డీవోబీ ధర ఒక్కసారిగా 79 శాతం మేరకు పెరిగిపోయింది. రెండు నెలుల కిందటి వరకు 10 టన్నుల డీవోబీ ధర రూ.లక్ష ఉండగా, ఇప్పుడు ఏకంగా 1.79 లక్షలకు చేరింది. ఇక, రెండు మాసాల కిందట ఒక చేప ధర రూ.118గా ఉండగా, ప్రస్తుతం మేత ధర పెరిగినా చేప ధర మాత్రం పెరగలేదు. దీంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. ట్రంప్‌ సుంకాల ప్రభావంతో రొయ్యల సాగుపై ఏర్పడ్డ ప్రతి కూల పరిస్థితుల నేపథ్యంలో చేపల సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికితోడు వర్షాకాలంలో రొయ్యల సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించవు. దీంతో రైతులు చేపలు సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఈ సాగు విస్తీర్ణం పెరిగింది. ఇదే అదనుగా భావించిన డీవోబీ వ్యాపారులు తమ ఇష్టానుసారం ధర పెంచేశారు. ప్రస్తుతం 10 టన్నుల డీవోబీ ధర రూ.లక్ష నుంచి రూ.1,79,000లకు పెరిగిపోయింది. దీంతో చేపల రైతులు లబోదిబోమంటున్నారు. చేపల సాగు సమయం 10 నుంచి 12 నెలలు. ప్రస్తుతం పెరిగిన డీవోబీ ధరలతో వ్యయం ఎక్కువ, లాభాలు తక్కువగా పరిస్థితి మారిపోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సహజంగా కట్లా, శీలావతి, గడ్డిచేప, మోసు వంటివి మాత్రమే సాగు చేస్తుంటారు. పేను, మెప్ప, శంఖు జలగ వంటి వ్యాధులు చేపల సాగులో అవరోఽధాలుగా ఉన్నాయి. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి చేపలసాగు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో చేపల మేత ధర పెరిగిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని డీవోబీ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.


డీవోబీ అంటే

డీవోబీ అంటే.. చమురు తీసిన తవుడు. దీనికి మరికొన్ని పోషకాలు జోడించి చేపలకు ఆహారంగా వినియోగిస్తారు. డీవోబీలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉండి.. చేపలు త్వరగా ఎదుగుతాయి.

లాభాలు తక్కువ..

చేపల సాగుకు పెట్టుబడి ఎక్కువ. లాభం అతితక్కువగా వస్తోంది. ఎప్పుడోగానీ లాభాలు వచ్చే పరిస్థితి లేదు. డీవోబీ రేటు పెరగడం మరింత భారంగా మారింది. చేపల రైతులు నష్టాలు బారిన పడుతున్నారు.

- చింతలపాటి ప్రవీణ్‌ వర్మ, చేపల రైతు, కోళ్లపర్రు

ప్రభుత్వం నియంత్రించాలి

ఇష్టానుసారం ధరలు పెంచుతున్న డీవోబీ వ్యాపారులపై ఝుళిపించాలి. ఇప్పటికే ఆక్వా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం కల్పించుకుని డీవోబీ ధరలు నియంత్రించాలి. చేపల ధర పెరిగేలా చర్యలు తీసుకోవాలి.

- కన్నబాబు, ఆక్వారైతు, కోళ్లపర్రు

Updated Date - Aug 24 , 2025 | 07:50 AM