సమస్యలతో సతమతం!
ABN , Publish Date - May 22 , 2025 | 12:44 AM
జిల్లా పరిషత సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జెడ్పీ కన్వెన్షన్ హాలులో గురువారం ఉదయం జరగనుంది. జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి, వాటి పరిష్కారాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా గృహ నిర్మాణంలో జాప్యం, ఇసుక రేవుల్లో అక్రమాలు, ఖరీఫ్‌కు సాగునీటి విడుదల తేదీ ప్రకటన, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. వివిధ అభివృద్ధి పనులు, పంట కాలువలు, డ్రెయినేజీల నిర్వహణ పనులు, నిధుల విడుదల తదితర అంశాలపై కూడా చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.
- నేడు జిల్లాపరిషత సర్వసభ్య సమావేశం
- అభివృద్ధికి నోచుకోని పంట కాలువలు
- నత్తనడకన సాగుతున్న గృహ నిర్మాణాలు
- జగనన్న కాలనీల్లో తిష్ట వేసిన సమస్యలు
- పాఠశాలలు, పీహెచ్‌సీ భవన నిర్మాణాల్లో జాప్యం
- సమస్యలపై నిలదీయనున్న సభ్యులు
జిల్లా పరిషత సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జెడ్పీ కన్వెన్షన్ హాలులో గురువారం ఉదయం జరగనుంది. జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి, వాటి పరిష్కారాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా గృహ నిర్మాణంలో జాప్యం, ఇసుక రేవుల్లో అక్రమాలు, ఖరీఫ్‌కు సాగునీటి విడుదల తేదీ ప్రకటన, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. వివిధ అభివృద్ధి పనులు, పంట కాలువలు, డ్రెయినేజీల నిర్వహణ పనులు, నిధుల విడుదల తదితర అంశాలపై కూడా చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
రబీలో దాళ్వా పంటకు సాగునీటిని విడుదల చేయలేదు. పంట కాలువలు, డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేసేందుకు అవకాశం ఉన్నా సకాలంలో పనులకు అనుమతులు ఇవ్వలేదు. గతేడాది జిల్లాలోని పంట కాలువల అభివృద్ధి, తూడు తొలగించే పనులకు రూ.26 కోట్లను విడుదల చేశారు. అయినా పనులు సక్రమంగా చేయలేదు. ఈ ఏడాది ఈ నిధుల్లో కోతపెట్టారు. నియోజకవర్గానికి కేవలం రూ.2 కోట్లే కేటాయించారు. గతంలో నియోజకవర్గానికి రూ.3 కోట్లు ఇస్తామని చెప్పినా.. ఈ నగదును ఇటీవల కాలంలో రూ.2 కోట్లకు కుదించారు. రూ.10 లక్షల వరకు వ్యయం అయ్యే పనులను చేసేందుకు సాగు నీటి సంఘాలకు నామినేషన్ పద్ధతిన కేటాయింపులు జరిపారు. కానీ పరిపాలనాపరమైన అనుమతులు ఇంతవరకు రాలేదు. ఈ అంశంపై చర్చించేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు.
కాలువలకు సాగునీటి విడుదలపై స్పష్టత వచ్చేనా?
జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఖరీఫపఫ్‌కు కాలువలకు సాగు నీటిని జూన్‌లో ఏ తేదీన విడుదల చేస్తారనే అంశంపై ఈ సమావేశంలో చర్చించి, తేదీని ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. పంట కాలువల్లో తూడు, గుర్రపుడెక్క తొలగించాల్సి ఉండటంతో కాలువలకు నీటిని విడుదల చేయడంలేదు. పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఈ నీటిని కృష్ణాడెల్టాలో పంటల సాగుకు ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై నేడు జరగనున్న జిల్లా పరిషత సమావేశంలో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కరువు
ఉమ్మడి జిల్లాలో 1400లకుపైగా జగనన్న కాలనీలు ఉన్నాయి. వాటిలో కనీస వసతులు కరువయ్యాయి. రోడ్లు, తాగునీటి పైప్‌లైన్లు, విద్యుత లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. కొంతకాలంగా గృహ నిర్మాణాల్లో అంతగా పురోగతి లేదు. పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాల్లో ఆలస్యం జరుగుతోంది. వీటిపై జెడ్పీ సమావేశాలు జరిగిన ప్రతిసారి సభ్యులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అధికారులు అనుమతులు వస్తాయి.. పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు.. కానీ పనులు మాత్రం జరగడం లేదు. ఈ సమావేశంలో వీటిపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం నిధులతో చేస్తున్న పనులు, వివిధ విభాగాల్లో పరిపాలనాపరంగా నెలకొన్న సమస్యలను ఎత్తిచూపుతామని సభ్యులు అంటున్నారు.
ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేనా?
కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విఽధానాన్ని ప్రవేశపెట్టింది. తోట్లవల్లూరు, ఘంటసాల, పెనమలూరు మండలాల పరిధిలో ఇసుక రవాణా మాఫియా చేతుల్లోనే ఉంది. రాత్రి సమయంలో అక్రమంగా వందలాది లారీల్లో ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్, మైనింగ్‌శాఖల అధికారులు ఆవైౖపునకు కన్నెత్తి చూడటంలేదు. ఇసుక రేవులకు అనుమతులు తెచ్చుకునే విషయంలోనూ మాఫియా తన చెప్పుచేతల్లోనే పెట్టుకుని తెరవెనుక వ్యవహారాలు నడుపుతోంది. ఇసుక రేవుల నుంచి ఇసుకను తరలిస్తున్న వ్యక్తులు వర్గాలుగా ఏర్పడి ఇటీవల కాలంలో దాడులు చేసుకుంటున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు కనీస చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్‌జిల్లా ఎమ్మెల్యేలు డుమ్మా!
జిల్లా పరిషత పాలన ఉమ్మడి జిల్లాస్థాయిలోనే కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన జిల్లా పరిషత సర్వసభ్య సమావేశాలకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శాసన సభ్యులు, కలెక్టర్, జేసీ హాజరు కావడంలేదు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాత్రమే హాజరవుతున్నారు. వీరు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లేదా జేసీ దృష్టికి తీసువెళతామని చెప్పి సరిపెట్టేస్తున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ స్థాయి సంఘాల సమావేశాలకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు.