Share News

ఏటీఎస్‌తో ఇక్కట్లు

ABN , Publish Date - Oct 13 , 2025 | 01:16 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సెంటర్‌ (ఏటీఎస్‌)లో వాహన యజమానులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఏజెంట్‌ ఉంటేనే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ పాస్‌ అవుతుంది. లేకపోతే ఫెయిల్‌ అవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆర్టీవో కార్యాలయాల్లో బ్రేక్‌ చేసుకునేవారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలంటే సులువుగా ఉండేది. ఇప్పుడు డబ్బుతో పాటు సమయం వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఏటీఎస్‌తో ఇక్కట్లు

- ఏజెంట్‌ ఉంటే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ పాస్‌

- లేకుంటే ఫెయిల్‌ అవుతున్న టెస్ట్‌లు

- ఇబ్బందుల్లో వాహన యజమానులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సెంటర్‌ (ఏటీఎస్‌)లో వాహన యజమానులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఏజెంట్‌ ఉంటేనే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ పాస్‌ అవుతుంది. లేకపోతే ఫెయిల్‌ అవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆర్టీవో కార్యాలయాల్లో బ్రేక్‌ చేసుకునేవారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలంటే సులువుగా ఉండేది. ఇప్పుడు డబ్బుతో పాటు సమయం వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

గుడివాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వాహనాల ఫిట్‌నెస్‌ నిమిత్తం ఏటీఎస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా వాహన దారులు తమ వాహనాలకు ఫిట్‌నెస్‌ చేయించుకోవాలంటే మచిలీపట్నంలోని ఈ కేంద్రానికి వెళ్లాల్సిందే. దీంతో డబ్బుతో పాటు సమయం వృథా అవుతుందని వాహనదారులు పేర్కొంటున్నారు. ఈ నెల 8వ తేదీన గుడివాడ నుంచి వాహనదారుడు ఖాసిం ఆన్‌లైన్‌లో ఽరూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్నాడు. తన ట్రక్‌ ఆటోను బ్రేక్‌ కోసం ఏటీఎస్‌ కేంద్రానికి వెళితే స్మోక్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ చేశారు. అదే వాహనదారుడు తిరిగి ఆన్‌లైన్‌లో రూ.1,700 చెల్లించి దరఖాస్తు చేసుకుని 10వ తేదీన ఏజెంట్‌ ద్వారా ఫిట్‌నెస్‌కు వెళ్లగా బ్రేక్‌ టెస్ట్‌ పాస్‌ అయ్యింది. దీంతో వాహనదారుడు ఆశ్చర్యపోయాడు. బ్రేక్‌తో పాటు ఆల్గో అడ్వైజరీ పేరుతో అదనంగా రూ.144 తమ నుంచి వసూలు చేశారని సదరు వాహన యజమాని ఆరోపించారు. నేరుగా వెళితే అవ్వని బ్రేక్‌, ఏజెంట్‌ ద్వారా వెళితే అవ్వడం ఏటీఎస్‌ కేంద్రం పనితీరును స్పష్టం చేస్తుంది.

వెళ్లాలంటే ఇబ్బందులే..

జిల్లా వ్యాప్తంగా వాహనదారులు మచిలీపట్నంలోని ఏటీఎస్‌ కేంద్రానికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం మండలం శివారు ప్రాంతానికి చెందిన వాహనదారులు మచిలీపట్నం వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. వెళ్లిన అదే రోజున ఫిట్‌నెస్‌ పూర్తవుతుందనే నమ్మకం లేదు. అదే రోజున బ్రేక్‌ కాని పక్షంలో తిరిగి రెండో రోజు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి వెళ్లాల్సిందే. వాహనదారులకు డబ్బుతో పాటు సమయం వృథా అవుతుంది.

పాత విధానాన్నే కొనసాగించాలి

జిల్లా కేంద్రంలో ఏటీఎస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. వాహన యజమానులు రోజంతా ఏటీఎస్‌ కేంద్రంలో ఉండాల్సి వస్తోంది. దీంతో సమయంతో పాటు డబ్బు వృథా అవుతుంది. గతంలో ఉన్న విధంగా స్థానిక ఆర్టీవో కార్యాలయాల్లో వాహనాలు బ్రేక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

- అడుసుమిల్లి శ్రీనివాస్‌, ది గుడివాడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Updated Date - Oct 13 , 2025 | 01:16 AM