Share News

Deputy CM Pawan: జన సైనికుల కోసం త్రిశూల్‌

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:19 AM

క్రియాశీల కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు రోడ్‌ మ్యాప్‌ రూపొందించానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. దసరా తర్వాత త్రిశూల్‌ పేరిట శిక్షణ ఇస్తామని తెలిపారు.

Deputy CM Pawan: జన సైనికుల కోసం త్రిశూల్‌

  • గుర్తింపు-నాయకత్వం-భద్రత

  • దసరా తర్వాత నాయకులకు శిక్షణ

  • పనిచేసేవారినే బాధ్యులుగా తీసుకుంటాం

  • పదేళ్ల సమయం ఇవ్వండి నాకు..దేశ పునర్నిర్మాణ నేతలుగా మారుస్తా

  • మండల స్థాయి నుంచి పార్టీని పర్యవేక్షిస్తా

  • ప్రతి రోజూ నాలుగు గంటలు కేటాయిస్తా

  • సినిమాల్లో హీరోనే అయినా‘లోపల రగిలే అగ్నిగుండం’ ఉంది

  • కూటమిలో కోపతాపాలు వద్దు

  • మేమొచ్చాక చాలానే చేశాం

  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాం

  • పోలవరానికి వేల కోట్లు తెచ్చాం

  • 67 లక్షల మంది తల్లులకు ఆర్థిక సాయం

  • దీపం-2 కింద ఉచితంగా కోటి సిలిండర్లు

  • బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

  • పంచాయతీల్లో 4 వేల కి.మీ. సీసీ రోడ్లు

  • 1.2 కోట్ల మందికి తాగునీరు అందించాం

  • ‘సేనతో సేనాని’ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌

గత పదేళ్లలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను.. అవమానాలు భరించాను.. ఇష్టమైన సినిమాలనూ వదులుకున్నాను.. కుటుంబాన్ని విస్మరించాను.. పిల్లల ఎదుగుదలను కూడా గమనించలేకపోయాను. అయితే పార్టీని మాత్రం వదల్లేదు.

- జన సేనాని పవన్‌ కల్యాణ్‌

కుల పోరాటాలు, మత విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు ఎప్పుడూ ఉంటాయి. నిత్యం వాటి కోసం పనిచేస్తే.. ప్రజలకు కూడు, గూడు, ఉపాధి ఎవరు ఇస్తారు?

- డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): క్రియాశీల కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు రోడ్‌ మ్యాప్‌ రూపొందించానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. దసరా తర్వాత ‘త్రిశూల్‌’ పేరిట శిక్షణ ఇస్తామని తెలిపారు. త్రిశూల్‌ అంటే ‘గుర్తింపు-నాయకత్వం-భద్రత’గా పేర్కొన్నారు. ‘పదేళ్ల సమయం నాకు ఇవ్వండి.. దేశ పునర్మిర్మాణం చేసే నాయకులుగా మారుస్తా.. దేనినైనా తట్టుకుని నిలబడగలమని నమ్మకం ఉంటే ముందుకురండి.. మీ విజయం వెనుక నేనుంటా’.. అని జనసైనికులకు భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం సాయంత్రం ‘సేనతో సేనాని’ పేరిట క్రియాశీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి 15 వేల మందిని ఆహ్వానించారు.


ఒడిసా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వారినుద్దేశించి గంటసేపు ఆయన ప్రసంగించారు. జనసేన ఆవిర్భావం నుంచి కూటమి ప్రభుత్వ భాగస్వామిగా ఎదగడం వరకు పుష్కర కాలంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను వివరించారు. భవిష్యత్‌లో పార్టీ ఎలా ఉంటుందో విశదీకరించారు. అన్నీ తట్టుకుని నిలబడినందునే ఇప్పుడు భారతదేశంలో 100 శాతం స్ట్రయిక్‌ రేట్‌ సాధించిన పార్టీగా గుర్తింపు వచ్చిందని చెప్పారు. ‘మెంబర్‌షిప్‌ టు లీడర్‌షిప్‌’ పేరుతో చేపట్టే ‘త్రిశూల్‌’ కార్యక్రమంలో కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇచ్చి.. సెంట్రల్‌ ఆఫీసు నుంచి, పార్టీ నాయకులతో, పనిచేసే వ్యవస్థతో అనుసంధానం చేస్తామని చెప్పారు. దీనికి బాధ్యులుగా పనిచేసే వారినే తీసుకుంటామని, గాలికి తిరిగే వారు అర్హులు కాదని స్పష్టంచేశారు. మానసిక స్థైర్యం ఉంటే జనసేన జాతీయ పార్టీగా మారుతుందని వ్యాఖ్యానించారు. కులం కోసం తాను రాలేదని, మానవాళి సంక్షేమం కోసం వచ్చానన్నారు. అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. డిప్యూటీ సీఎం ఇంకా ఏమన్నారంటే..


ఆంధ్రాలో పోరాట పటిమ ఉంది

ఆంధ్రప్రదేశ్‌లో పోరాట పటిమ లేదని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇక్కడ ఆ పటిమ ఉంది. అందుకే కూటమికి 164 సీట్లు, జనసేనకు అందులో 21 ఇచ్చారు. నాయకత్వం పదవి కాదు.. బాధ్యత. ప్రజాసమస్యల పట్ల అంకిత భావంతో పనిచేసే వారు నిలబడతారు. పార్టీలో సభ్యుడిగా చేరితే క్రియాశీల కార్యకర్తగా.. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులుగా జనసేన నడిపిస్తుంది. దీనికోసం శిక్షణ, వర్క్‌షాపులు వంటివి నిర్వహిస్తాం. త్వరలో కర్షక, కార్మిక విభాగాలు కూడా ప్రారంభిస్తాం. పోరాడి నిలబడడానికి నాకు పుష్కర కాలం పట్టింది. మీరు కూడా మీ ప్రాంతాల్లో గట్టిగా నిలబడితే పోరాటానికి అవసరమైన వనరులను నేనందిస్తా. ఇకపై పార్టీని మండల స్థాయి నుంచి నేనే పర్యవేక్షిస్తా. రోజుకు నాలుగు గంటలు పార్టీకి కేటాయిస్తా. పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించాం.


కూటమి బలంగా ఉండాలి.. లేదంటే రాష్ట్రానికే నష్టం

కూటమి బలంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీతో ఏమైనా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి. వాటిని సరిచేస్తాం. కోపతాపాలకు పోయి కూటమి విడిపోయేలా చేయొద్దు. అలా చేస్తే ప్రజలకు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. మళ్లీ అరాచక పాలకులు వస్తారు.

కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానన్నారు..

2019-24 మధ్య ఐదేళ్లు అన్ని విధాలుగా నాటి అధికార పార్టీ నలిపేసింది. కులాలను కలిపే ఆలోచన చేశా.. పర్యావరణం గురించి మాట్లాడా.. అవినీతి రహిత సమాజం కావాలన్నా.. రోజుకొక మాట చెబుతాడు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడని చాలామంది అన్నారు. కానీ కార్యకర్తలైన మీరంతా నమ్మారు.. మీరు నాలో భవిష్యత్‌ చూశారు. ఆ ఫలితమే 21 మంది జనసేన నుంచి గెలుపొందారు. జనసేన 150 మందితో మొదలై నేడు 15 వేల మంది క్రియాశీల కార్యకర్తలు, 12 లక్షల మంది సభ్యత్వం కలిగిన పార్టీగా ఎదిగింది. ఉద్దానంలో కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించింది. గిరిజన గ్రామాలకు డోలీ మోతలు తప్పించి రహదారులు వేయగలిగింది. 2019లో పార్టీ ఓడిపోగానే చాలామంది పారిపోయారు. నత్తగుల్లలు వెళ్లిపోయాయి. రక్తనాళాలు మిగిలాయని భావించా. నిస్వార్థంగా పనిచేయడం వల్లే ఫలితాలు వచ్చాయి. అధికారంలో భాగస్వాములు కాగలిగాం.


మీరంతా అన్‌సంగ్‌ హీరోస్‌..

పార్టీ కోసం అనేక కష్టనష్టాలు ఓర్చి పనిచేస్తున్న జన సైనికులు, వీర మహిళలు ‘అన్‌సంగ్‌ హీరోస్‌’. కష్టమైనా వెరవకుండా అండగా నిలబడ్డారు ఇక నుంచి ప్రతి ఒక్కరూ వేదికపై నుంచి మాట్లాడి తమ అభిప్రాయాలు చెప్పాలి. గడచిన పదేళ్లలో తగిలిన ప్రతి దెబ్బతో రాటుదేలుతూ ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ ముందుకెళ్తూ.. మరింత ధైర్యంతో పనిచేస్తున్నాను. ఈ ప్రయాణంలో ఏ పదవి, హోదా ఆశించకుండా పనిచేసే వీరమహిళలు, జన సైనికులు నిజంగా అన్‌సంగ్‌ హీరోస్‌. మీరంతా నిజమైన యుద్ధవీరులే. సినిమాల్లో హీరోనే అయినా ‘లోపల రగిలే అగ్నిగుండం’ ఉంది. అది బయటవారికి తెలియదు. జనవాణి కోసం నేను విశాఖ వస్తే నోవాటెల్‌ హోటల్‌లో బంధించారు. భీమిలి జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టారు. అయినా ఏ రోజూ భయపడలేదు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా తెలుసు. అయినా ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా చేయలేదు. ఇది నా నేల.. నేనే తేల్చుకుంటానని పోరాడా. జనసేన వీర మహిళలు వీధిలో పేరంటాలకు వెళ్లాలి.. ఊళ్లో పోరాటాలు కూడా చేయాలి. మహిళలకు 33ు రిజర్వేషన్‌ తప్పనిసరిగా అమలు చేస్తాం. అయితే అవి భర్తల అజమాయిషీలో పనిచేసేవారికి కాదు. స్వతంత్రంగా పనిచేసేవారికే ఇస్తాం.


ఇవన్నీ మనమే చేశాం

అధికారంలోకి వచ్చాక ఏంచేశారని చాలామంది ప్రశ్నిస్తున్నారు.. చాలానే చేశాం. విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపాం. రెండు విడతలుగా రూ.8,625 కోట్లు, రూ.3,295 కోట్లు ఆర్థిక సాయం ఇప్పించాం. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,157 కోట్లు, రెండోసారి 5,936 కోట్లు మం జూరు చేయించాం. తల్లికి వందనంలో 67.27 లక్షల మంది తల్లులకు ఆర్థిక సాయం చేశాం. దీపం-2 పథకం కింద కోటి గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం. మూడుసార్లు ఉచిత గ్యాస్‌కు రూ.13,425 కోట్లు కేటాయించాం. స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచి త ప్రయాణం కల్పిస్తున్నాం. దీనికి రూ.2 వేల కోట్లు కేటాయించాం. పంచాయతీల్లో 4 వేల కి.మీ.ల సీసీ రోడ్లు వేయించాం. జల జీవన్‌ మిషన్‌ కింద రూ.1.2 కోట్ల మందికి రూ.7,910 కోట్లతో తాగునీరు అందించే ఏర్పాట్లు చేశాం.

గురజాడ ఇల్లు నిలబెడతాం

విజయనగరంలో గురజాడ అప్పారావు ఇల్లు పాడైందని, దానిని కాపాడాలని ఆయన మనవళ్లు పోస్టుకార్డు ఉద్యమం చేశారు. ఆయన ఇంటిని ఆధునికీకరించి, రచనలన్నీ డిజిటలైజేషన్‌ చేయిస్తామని హామీ ఇస్తున్నా.

Updated Date - Aug 31 , 2025 | 04:21 AM