Share News

Jungle Delivery: కారడవిలో అర్ధరాత్రి ప్రసవం

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:55 AM

అంబులెన్స్‌ గ్రామంలోకి రాలేని పరిస్థితి.. ఇలాంటి తరుణంలో గర్భిణిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె అర్ధరాత్రి వేళ కారడవిలోనే ప్రసవించింది.

Jungle Delivery: కారడవిలో అర్ధరాత్రి ప్రసవం

డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో డెలివరీ

తల్లీబిడ్డ క్షేమం... జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలింపు

పెదబయలు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామం.. రాత్రి సమయంలో మొదలైన పురిటి నొప్పులు.. అంబులెన్స్‌ గ్రామంలోకి రాలేని పరిస్థితి.. ఇలాంటి తరుణంలో గర్భిణిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె అర్ధరాత్రి వేళ కారడవిలోనే ప్రసవించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం బొంగరం పంచాయతీ కుంబుర్ల గ్రామం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. కుంబుర్ల గ్రామానికి చెందిన అరడ చిన్నమ్మికి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో నొప్పులు మొదలయ్యాయి. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా రహదారి లేకపోవడంతో ఆ వాహనం రాలేదు. దీంతో నాలుగు కిలోమీటర్ల దూరంలోని డి.కొత్తూరు వరకూ చిన్నమ్మిని డోలీలో తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులు భావించారు. చీకట్లో సెల్‌ఫోన్ల లైట్ల వెలుతురులో కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళుతుండగా మధ్యలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆశ కార్యకర్త కాసులమ్మ అడవిలోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను డి.కొత్తూరుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి అంబులెన్స్‌లో జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు.

Updated Date - Jun 05 , 2025 | 05:57 AM