Share News

Tribal Welfare Officer Caught: ఉద్యోగులనూ పిండేసిన సబ్బవరపు!

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:41 AM

సబ్బవరపు శ్రీనివాస్‌.. రాష్ట్రంలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరిది. ఏసీబీ చరిత్రలో ఈ పేరుకు ఒక రికార్డు ఉంది..

Tribal Welfare Officer Caught: ఉద్యోగులనూ పిండేసిన సబ్బవరపు!

  • పదోన్నతుల పేరిట రూ.లక్షల వసూళ్లు

  • కాంట్రాక్టర్లకే కాదు ఉద్యోగులకూ టార్గెట్లు

  • పదోన్నతి కోసం రూ.25 లక్షల వసూలు

  • డబ్బులు ఇవ్వని వారికి చుక్కలు చూపిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ శ్రీనివాస్‌

విజయవాడ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): సబ్బవరపు శ్రీనివాస్‌.. రాష్ట్రంలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరిది. ఏసీబీ చరిత్రలో ఈ పేరుకు ఒక ‘రికార్డు’ ఉంది. కాంట్రాక్టర్‌ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ సబ్బవరపు శ్రీనివాస్‌ గతాన్ని తవ్వుతున్న ఏసీబీ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. కమీషన్ల కోసం, లంచాల కోసం సబ్బవరపు తొక్కని అడ్డదారులు లేవని గుర్తించారు. బిల్లులను ఆమోదించడానికి పర్సంటేజీలు తీసుకున్నారని అధికారులు తెలుసుకున్నారు. సబ్బవరపు బాధితులు కేవలం కాంట్రాక్టర్లే కాదని, గిరిజన సంక్షేమ శాఖలోని ఉద్యోగులు కూడా బాధితులేనని గుర్తించింది. తన కింద జిల్లాల్లో పనిచేసే ఇంజనీరింగ్‌ అధికారులకు పదోన్నతులు ఇప్పిస్తానని, ఆ ఫైళ్లకు వెంటనే ఆమోదముద్ర వేయిస్తానని నమ్మించి రూ.లక్షలు వసూలు చేసినట్టు అధికారులు తెలుసుకున్నారు. శ్రీనివాస్‌ కింద జిల్లాస్థాయిలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, డివిజనల్‌ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌లు ఉంటారు. వారికి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతులు వస్తుంటాయి. ఈ జాబితాతో సంబంధం లేకుండా పదోన్నతులు ఇప్పిస్తానని జిల్లాస్థాయిలో పనిచేసే ఉద్యోగులను నమ్మించి వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పెండింగ్‌ బిల్లులను మంజూరు చేసే సమయంలో తాను అడిగినంత ఇవ్వకుండా జాప్యం చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించిన ‘ఎంబుక్స్‌’లో రికార్డులను శ్రీనివాస్‌ తారుమారు చేయించారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని విజయవాడకు పిలిపించి తన కార్యాలయంలో ఈ తప్పులు చేయించారు. ఈ విషయం గ్రహించిన ఏసీబీ అధికారులు వారందరినీ విజయవాడకు రప్పించి కొద్దిరోజుల క్రితం విచారించారు. ఈ సమయంలోనే పదోన్నతుల ముసుగులో సబ్బవరపు శ్రీనివాస్‌ వసూళ్ల వ్యవహారాలు బయటకు వచ్చాయి. విశాఖపట్నానికి చెందిన ఒక అసిస్టెంట్‌ ఇంజనీర్‌కు పదోన్నతి ఇప్పిస్తానని చెప్పి రూ.25 లక్షలు తీసుకున్నారు. సరిగ్గా ఏసీబీ అధికారులకు చిక్కడానికి ముందు ఈ డబ్బులు వసూలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పదోన్నతుల జాబితాలో మధ్యలో ఎక్కడో ఉన్న ఆయన పేరును పైకి తీసుకొస్తానని చెప్పి ఈ డబ్బులు వసూలు చేశారని తెలిసింది. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు సబ్బవరపు చేసిన అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.


వేధిస్తున్నారని చెప్పినా..

ఈఎన్‌సీ శ్రీనివాస్‌ వేధింపులు భరించలేక కొంతమంది కాంట్రాక్టర్లు సచివాలయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు మాత్రం ఈ కాంట్రాక్టర్లను తిరిగి ఈఎన్‌సీ వద్దకే పంపేవారు. బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో శ్రీనివాసరావు ఎలా వేధిస్తున్నారో కాంట్రాక్టర్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేవారు. ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి విచారణ చేయకపోగా... శ్రీనివా్‌సతోనే మాట్లాడి సెటిల్‌ చేసుకోవాలని పంపించినట్టు తెలిసింది. ఆయా విషయాలపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు సబ్బవరపు శ్రీనివా్‌సతో సన్నిహిత సంబంధాలు నడిపిన ఉన్నతాధికారులపై దృష్టిపెట్టారు. ఇదిలావుంటే, సబ్బవరపు అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కాంట్రాక్టర్లు కొద్దిరోజుల కిందట ప్రభుత్వానికి విన్నవించారు.

Updated Date - Sep 14 , 2025 | 03:41 AM