Gummadi Sandhya Rani: గిరిజన బతుకుల్ని ప్రపంచానికి చాటారు
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:49 AM
చిన్నారులు తమ సృజనతో గిరిజన పల్లె బతుకుల్ని ఉద్భవ్-2025 ద్వారా ప్రపంచానికి చాటారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
ఉద్భవ్‌లో విద్యార్థుల ప్రదర్శనలు భేష్
22 రాష్ట్రాల విద్యార్థులు హాజరుకావడం జాతీయ సమగ్రతకు నిదర్శనం
మంత్రులు సంధ్యారాణి, డోలా, దుర్గేశ్
తాడేపల్లి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): చిన్నారులు తమ సృజనతో గిరిజన పల్లె బతుకుల్ని ఉద్భవ్-2025 ద్వారా ప్రపంచానికి చాటారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మూడు రోజులు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌యూలో జరిగిన ఉద్భవ్-2025 శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ ఉత్సవంలో 22 రాష్ట్రాల్లోని 405 ఈఎంఆర్‌ఎస్ స్కూళ్లకు చెందిన 1800 మంది విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు ఉన్నా మనమంతా ఒక్కటేనని, ఆదివాసీలు ఎవరికీ తక్కువ కాదని విద్యార్థులు తమ ప్రదర్శనలతో నిరూపించారని ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో పెద్దపీట వేస్తామన్నారు. యోగాలో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ సాధించింది ఆదివాసీలేనని అన్నారు. మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ... ఈ వేడుకలు జాతీయ సమగ్రతకు, ఐక్యతకు నిదర్శనమన్నారు. మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దిశానిర్దేశంతో ఇలాంటి గొప్ప వేడుక జరుపుకోవడం గర్వించదగ్గ అంశమన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సొసైటి కార్యదర్శి గౌతమి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల సంస్కృతులను, కళారూపాలతో విద్యార్థులు ఇండియా హెరిటేజ్‌ను ఆవిష్కరించారన్నారు.
కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లికార్జుననాయక్, నెస్ట్ సహాయ కార్యదర్శి బిపిన్ రాటూరి, కేఎల్‌యూ ప్రో-వీసీ వెంకటరామ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. కేరళ కళారూపం ఎన్నవనట్, బిహార్ నృత్యం జుమ్మర్ ఆకట్టుకున్నాయి. తెలంగాణ, ఒడిశా, త్రిపురలు అత్యధిక బహుమతులు సాధించాయి. 49 విభాగాలలో విజేతలకు బహుమతులు అందించారు.