Share News

వణికిస్తున్న దిత్వా!

ABN , Publish Date - Dec 01 , 2025 | 01:15 AM

దిత్వా తుఫాను అన్నదాతలను వణికిస్తుంది. ఆదివారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వరి పంటను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేసి, రోడ్లపై ఆరబెట్టిన వారు ఽధాన్యం నింపేందుకు గోనె సంచులు, రవాణా చేసేందుకు వాహనాలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 3వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఒకమోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

వణికిస్తున్న దిత్వా!

- తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు

- రహదారులపై గుట్టలుగా ధాన్యం రాశులు

- 3వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి వర్షం కురిసే అవకాశం

- గోనె సంచులు, వాహనాలు అందుబాటులో లేక రైతుల అవస్థలు

దిత్వా తుఫాను అన్నదాతలను వణికిస్తుంది. ఆదివారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వరి పంటను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేసి, రోడ్లపై ఆరబెట్టిన వారు ఽధాన్యం నింపేందుకు గోనె సంచులు, రవాణా చేసేందుకు వాహనాలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 3వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఒకమోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :

జిల్లాలో దిత్వా తుఫాను ప్రభావంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే అక్కడక్కడ చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. దీంతో అన్నదాతలు ధాన్యం ఎక్కడ తడిచిపోతుందోననే భయంతో వణికిపోయారు. జిల్లాలో 1.61 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇప్పటివరకు 55 వేల హెక్టార్లలో వరికోతలను రైతులు పూర్తిచేశారు. మరో 1.06 లక్షల హెక్టార్లలో వరి కోయాల్సి ఉంది. జిల్లాలో ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తూనే ఉండటంతో ఇప్పటికే కోతలు పూర్తిచేసి రహదారులపై గుట్టలుగా పోసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ధాన్యం రాశులపై పరదాలు కప్పి ఉంచారు. భారీ వర్షం కురవకపోవడంతో రైతులు కొంతమేర ఊపిరిపీల్చుకున్నారు. కానీ వర్షం కారణంగా గాలిలో తేమశాతం పెరిగి, ఆరిన ధాన్యంలోనూ తేమ అధికమవుతుందని, దీంతో పాటు ధాన్యం రాశులపై రోజుల తరబడి పరదాలు కప్పిఉంచితే తేమశాతం పెరిగి ధాన్యం రంగుమారిపోతుందని ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజుల పాటు వాతావరణం ఇలానే ఉంటే ధాన్యం ఆరబెట్టేందుకు అవకాశం ఉండదని, ధాన్యం రాశుల కిందకు నీరుచేరి అడుగున ఉన్న ధాన్యం మొలకెత్తే ప్రమాదం లేకపోలేదని రైతులు అంటున్నారు.

టెక్నికల్‌ సిబ్బంది, దళారుల మాయాజాలం!

కంకిపాడు, ఉయ్యూరు, మచిలీపట్నం, గూడూరు, చల్లపల్లి, ఘంటసాల, పెడన, బంటుమిల్లి, తోట్లవల్లూరు, మోపిదేవి, మొవ్వ తదితర మండలాల్లో ఇటీవల కాలంలో వరి కోతలు ఊపందుకున్నాయి. యంత్రాల ద్వారా రైతులు కోతలు పూర్తిచేస్తున్నారు. కోసిన అనంతరం ధాన్యాన్ని ట్రాక్టర్‌ల ద్వారా పొలాల సమీపంలోని రహదారులపైకి చేరుస్తున్నారు. రైతు సేవా కేంద్రాలకు ధాన్యం విక్రయించేందుకు రైతులు శాంపిల్స్‌ తీసుకు వెెళితే సంచులు అందుబాటులో లేవని, వాహనాలు ఇప్పట్లో రావని అక్కడి టెక్నికల్‌ సిబ్బంది చెబుతున్నారు. దీంతో పాటు, ధాన్యం కొనుగోలు చేసే దళారులతో కుమ్మక్కయిన టెక్నికల్‌ సిబ్బంది ధాన్యం నాణ్యతగా లేదని, తదితర కారణాలు చూపి ఽ75కిలోల బస్తా ధాన్యం రూ.1,450 మించి ధర పలకదని వారే చెప్పేస్తున్నారని తెలిసింది. అదే ధాన్యం శాంపిల్స్‌ను రైతులు మిల్లుల వద్దకు తీసుకువెళితే బస్తాకు రూ.1500 ఇస్తామని అంటున్నారని రైతులు చెబుతున్నారు. ఇదేమని రైతు సేవా కేంద్రాల్లోని టెక్నికల్‌ సిబ్బందిని ప్రశ్నిస్తే, నిబంధనలు అలానే ఉన్నాయని, అయినా సంచులు, వాహనాలు అందుబాటులో లేవని చెప్పి రైతులను వెనక్కు పంపేస్తున్నారని సమాచారం. జిల్లాస్థాయి అధికారులు, తహసీల్దార్‌లు, వ్యవసాయశాఖ అధికారుల ఆదేశాలను కూడా ఏమాత్రం పాటించకుండా దళారులు, ఆర్‌ఎస్‌కేలలో పనిచేసే సిబ్బంది ధాన్యం కొనుగోలును తమ చెప్పుచేతల్లోకి తీసుకుని రైతులను తీవ్ర ఇబ్బందులపాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నెలరోజల వ్యవధిలో రెండో తుఫాను!

గత నెల చివరిలో మొంథా తుఫాను కారణంగా బలమైన గాలులు వీయడంతో ఈత దశలో ఉన్న వరి నేలవాలింది. బలమైన గాలుల కారణంగా గింజలు పగిలిపోయి పాలుపోసుకోలేదు, ఉన్న పంటను కాపాడుకున్న రైతులకు తాజాగా దిత్వా తుఫాను రూపంలో వచ్చిన విపత్తు నిద్రలేకుండా చేస్తోంది. జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో వరి కోతకు సిద్ధమైంది. ఈ తరుణంలో దిత్వా తుఫాను ప్రభావంతో కురుస్తున్న తేలిక పాటి వర్షం వరిపంటకు మరింత కీడు చేస్తుందని రైతులు చెబుతున్నారు. గంట, రెండు గంటలపాటు వర్షం కురిసి, ఆ తర్వాత ఎండకాస్తే ప్రమాదం ఉండదని, రోజంతా తేలికపాటి వర్షం కురిస్తే కంకులు తడిచి ధాన్యం మెత్తబడిపోతుందని అంటున్నారు.

జాడలేని వాహనాలు!

జిల్లాలో ధాన్య రవాణా చేసేందుకు మూడు వేలకుపైగా వాహనాలను అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. ఈ వాహనాలు ఎక్కడా ఉన్నాయో తెలియని పరిస్థితి. రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ బాలాజీ చొరవ తీసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వ్యాగన్లను జిల్లాకు రప్పించి వాటి ద్వారా సామర్లకోటలోని మిల్లులకు 15 వేల టన్నుల ధాన్యం పంపారు. మరో రెండు రోజుల వ్యవధిలో ఇంకో రెండు వ్యాగన్ల ద్వారా ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతా చేస్తున్నా గ్రామస్థాయిలో దళారులు, ఆర్‌ఎస్‌కేలలో పనిచేసే సిబ్బంది కుమ్మక్కై విపత్కర పరిస్థితిలో ధాన్యం రవాణా చేసేందుకు వాహనాలు అందుబాటులో లేవని చెప్పి రైతులను ఒత్తిడికి గురిచేసి, తక్కువ ధరకు ధాన్యం విక్ర యించేలా తెరవె నుక కథ నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Dec 01 , 2025 | 01:15 AM