National Highway 44: అనంతలో ట్రావెల్స్ బస్సు దగ్ధం
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:23 AM
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి జంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రయాణంలో ఉన్న ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది.
వెంటనే దిగి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు
గార్లదిన్నె, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి జంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రయాణంలో ఉన్న ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై చకచకా బస్సు దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. బస్సుతోపాటు ప్రయాణికులకు చెందిన విలువైన వస్తు సామగ్రి కాలి బూడిదయ్యింది. పోలీసులు, ప్రయాణికుల కథనం మేరకు.. గ్రీన్‌లైన్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు బెంగళూరులోని ఆనందరావు సర్కిల్ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు 29 మంది ప్రయాణికులతో కర్ణాటకలోని రాయచూరు సమీప దేవదుర్గకు బయల్దేరింది. అనంతపురంలోని తపోవనం సర్కిల్లో ఒక డ్రైవర్ దిగిపోవడంతో రమేష్ అనే మరో డ్రైవర్ బయల్దేరాడు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద వెనుక టైరు పగిలిపోవడంతో బస్సు నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును రహదారి పక్కనే నిలిపేశాడు. ప్రయాణికులు దిగిపోయారు. ఆ తర్వాత బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల సామగ్రితోపాటు, కొందరి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. కాగా, తలగాసిపల్లి జంక్షన్‌కు కిలోమీటరు ముందే బస్సు నుంచి కాలిన వాసన వస్తోందని డ్రైవర్‌కు చెప్పినా వినకుండా నడిపారని ప్రయాణికులు తెలిపారు. చెప్పిన వెంటనే బస్సు నిలిపి ఉండుంటే ప్రమాదం జరిగేది కాదని చెప్పారు.