Share News

School Education Dept: బడి దూరం.. భారం కాకుండా..విద్యార్థులకు రవాణా భత్యం

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:02 AM

పాఠశాల దూరంగా ఉందనే కారణంతో ఎవరూ చదువు మానేయకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ట్రావెలింగ్‌ అలవెన్స్‌ (టీఏ) ఇచ్చే కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ అమలు చేయనుంది.

School Education Dept: బడి దూరం.. భారం కాకుండా..విద్యార్థులకు రవాణా భత్యం

  • రాష్ట్రంలో 79,860 మంది అర్హుల గుర్తింపు

  • నెలకు 600 చొప్పున మూడు నెలలకోసారి 1,800

  • నేరుగా తల్లుల ఖాతాల్లోకి టీఏ జమ.. ‘సమగ్రశిక్ష’ ఉత్తర్వులు జారీ

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పాఠశాల దూరంగా ఉందనే కారణంతో ఎవరూ చదువు మానేయకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ట్రావెలింగ్‌ అలవెన్స్‌ (టీఏ) ఇచ్చే కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ అమలు చేయనుంది. గతంలో ఏడాది మొత్తానికీ కలిపి ఒకేసారి నగదు ఇచ్చే విధానం ఉంది. అది కూడా అర్హులందరికీ అందేది కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 79,860 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించి వారికి టీఏ ఇచ్చేందుకు సిద్ధమైంది. విద్యాహక్కు చట్టం కింద బడులు దూరంగా ఉండే విద్యార్థుల కోసం కేంద్ర విద్యాశాఖ రూ.47.91 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. అందులో వెల్లడించిన మార్గదర్శకాలు, విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు టీఏ పొందడానికి అర్హులు. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటరు, ప్రాథమికోన్నత పాఠశాలలు 3 కిలోమీటర్లు, సెకండరీ పాఠశాలలు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న విద్యార్థులకు టీఏ వర్తిస్తుంది. విద్యార్థులు బస్సులు, మినీ బస్సులు, ఆటోలు, సైకిళ్లు లాంటివి వినియోగించాలి. ప్రైవేటు పాఠశాలల్లో చదివేవారికి ఈ పథకం వర్తించదు. ఇప్పటికే ఈ నిబంధనల ప్రకారం దూరంలో ఉన్న విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. ఆ విద్యార్థుల వివరాలను లీప్‌ యాప్‌లో నమోదుచేస్తారు. ఎంఈవోల పరిశీలన అనంతరం సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు వివరాలను ధృవీకరించి ఆగస్టు 10 నాటికి తుది జాబితాకు ఆమోదం తెలుపుతారు.


నెలకు రూ.600 చొప్పున ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1800 టీఏ సొమ్ము జమ అవుతుంది. సంవత్సరంలో బడులు తెరిచి ఉంచే 10 నెలల పాటు టీఏ ఇస్తారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కూడా చదువుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎస్పీడీ ఉత్తర్వుల్లో తెలిపారు.

టీఏ పాఠశాలలకు ఇవ్వాలి: ఏపీటీఎఫ్‌

విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసే టీఏను పాఠశాలలకు ఇవ్వాలని ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు ప్రసాద్‌ కోరారు. కొన్ని బడుల్లో ఉపాధ్యాయులే రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి విద్యార్థులను పాఠశాలలకు తీసుకొస్తున్నారని, టీఏ తల్లుల ఖాతాలకు వెళ్తే టీచర్లపై భారం పడుతుందని పేర్కొన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 04:04 AM