Minister Ramprasad Reddy: స్త్రీశక్తి భారం కాదు.. బాధ్యత
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:08 AM
స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించే మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు త్వరలో స్మార్ట్ కార్డులను అందజేయనున్నట్టు రవాణా మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు.
మహిళలకు ఉచిత ప్రయాణ స్మార్ట్ కార్డులు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
విశాఖపట్నం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించే మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు త్వరలో స్మార్ట్ కార్డులను అందజేయనున్నట్టు రవాణా మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో మీడియాతో మాట్లాడా రు. సూపర్ సిక్స్ పథకాలన్నింటి కంటే ‘స్త్రీశక్తి’ పథకం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారన్నారు. పథకం ప్రారంభించిన తర్వాత 14 రోజుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా 8,500 బస్సుల్లో 2.3 కోట్ల మంది ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వం రూ.95 కోట్లు భరించిందన్నారు. స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదని, బాధ్యతని అన్నారు. బస్సులో ప్రయాణించినప్పుడు ప్రతిసారీ ఆధార్ కార్డును చూపించడం కాకుండా స్మార్ట్ కార్ట్ చూపిస్తే మరింత సులభతరమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీకి కొత్తగా 750 ఎలక్ర్టిక్ బస్సులు రాబోతున్నాయని, 6-7 నెలల్లో మరో 1,500 నుం చి 2 వేల ఎలక్ర్టిక్ బస్సులను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. పల్లెవెలుగు బస్సుల్లో ఏసీ సదుపాయం కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా తమ ప్రభుత్వం మేలు చేస్తోందని, నైట్ అలవెన్స్ కింద గతంలో రూ.80 ఇస్తే దానిని రూ.150కు పెంచామన్నారు. ఉద్యోగులకు ప్రమాద బీమా కింద గతంలో జీతం నుంచి రూ.2 వేలు మినహాయించేవారని, తమ ప్రభుత్వం ఉచిత బీమాతోపాటు ప్రమాదంలో మరణిస్తే ఇచ్చే రూ.20 లక్షల పరిహారాన్ని రూ.కోటికి పెంచామని వివరించారు. 6,500 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పించామని, ఆన్‌కాల్ డ్రైవర్ల వేతనాన్ని రూ.800 నుం చి రూ.వెయ్యికి పెంచామని, పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తిచేశామని చెప్పారు. ఉచిత బస్సు కారణంగా ఉపాధికి దెబ్బ పడిని ఆటో డ్రైవర్ల ను ఆదుకునేందుకు త్వరలోనే కొత్త పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.