Share News

Minister Kollu Pardhasaradhi: కల్తీ మద్యంపై పారదర్శక విచారణ

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:05 AM

కల్తీ మద్యం, మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు...

Minister Kollu Pardhasaradhi: కల్తీ మద్యంపై పారదర్శక విచారణ

  • నిందితులు ఏ పార్టీ వారైనా కఠిన చర్యలకు సిద్ధం

  • మద్యం కుంభకోణాలపై వైసీపీ అసత్య ప్రచారాలు

  • రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు: మంత్రి పార్థసారథి

విజయవాడ సిటీ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): కల్తీ మద్యం, మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నిందితులు ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకొనేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. విజయవాడలోని కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మద్యం కుంభకోణంతో ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేయడంతో పాటు, కల్తీ మద్యంతో వారి ఆరోగ్యాన్ని వైసీపీ నాయకులు పాడు చేశారని విమర్శించారు. ఈ కుంభకోణాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని చెప్పారు. తమ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు చేయని వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని గంజాయి వనంగా మార్చేశారని ఆరోపించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వారి వైఖరిలో మార్పలేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్న అధికారులను వైసీపీ నాయకులు భయపెడుతున్నారని, చట్టబద్ధంగా పని చేసేవారికి కూటమి ప్రభుత్వం నిత్యం అండగానే ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్‌ కనుసన్నల్లోనే ములకలచెరువులో రెండేళ్లుగా కల్తీ మద్యం తయారు చేస్తున్నామని నిందితుడు జనార్దన్‌ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కల్తీ మద్యం వ్యవహారంలో కొందరు టీడీపీ నాయకులు ఉన్నట్లు తేలిందని, వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. కల్తీ మద్యాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిలో భాగంగానే బార్‌ కోడ్‌, హోలోగ్రామ్‌ వంటి వాటితో పాటు ఎవరైనా స్వయంగా తనిఖీ చేసుకునేందుకు యాప్‌ను రూపొందించామని వివరించారు. దీన్ని జగన్‌ పత్రిక వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 19 , 2025 | 03:05 AM