Modern Fishing Techniques: ఉప్పాడ మత్స్యకారులకు ముగిసిన శిక్షణ
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:12 AM
ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా అధ్యయనం...
కేరళ, తమిళనాడుల్లో వారం రోజులు నిర్వహణ
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేరళ, తమిళనాడుల్లో అవలంభిస్తున్న అధునాతన పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఈనెల 8న రెండు బృందాలుగా వెళ్లిన 60 మందికి స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించడం ఎలా అనే అంశంపై శిక్షణ ఇప్పించారు. అధునాతన కేజ్ కల్చర్, రిఫ్‌కల్చర్, మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటు, హార్బర్ల సందర్శన, హేచరీల్లో చేపల గుడ్లు పొదిగించడం, వలల తయారీ తదితరాలపై సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సంస్థలతో వీరికి శిక్షణ ఇప్పించారు. తమిళనాడు వెళ్లిన బృందానికి చెన్నై సమీపంలోని మండపం వద్ద మెరైన్ నిపుణులు కృత్రిమ, సహజ పద్ధతుల్లో సాగు చేస్తున్న కేజీకల్చర్, రిఫ్‌కల్చర్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు. సముద్ర వనరుల దీర్ఘకాలిక సంరక్షణకు తీసుకోవాల్సిన శాస్త్రీయ విధానాలను తెలియజేశారు. విల్లుపురంలోని గోల్డెన్ మెరైన హార్వెస్ట్ హేచరీలో మత్స్య సంపద సృష్టిలో నూతన సాంకేతికతలను వివరించారు. చెన్నై సమీపం మెరీనా బీచ్‌లో ఆధునిక మౌలిక వసతులతో నిర్మించిన చేపల మార్కెట్‌లో చేపల నిల్వ, గ్రేడింగ్, వ్యర్థాల నిర్వహణ గురించి వివరించారు. కేరళలో పర్యటించిన బృందానికి అక్కడి ఎన్‌ఐపీహెచ్‌టీలో వేటలో సాంకేతికత మేళవింపు, స్థిరమైన ఆదాయార్జన అంశాలపై శిక్షణ ఇచ్చారు. మునంబంలోని మోడల్ షిఫింగ్ హార్బర్‌లో ఆధునిక పద్ధతుల్లో వలల తయారీ, నాణ్యత, మార్కెటింగ్ విధానాలపై అవగాహన కల్పించారు. రకరకాల చేప పిల్లల హేచరీలకు వీరిని తీసుకెళ్లి చేపల గుడ్లు పొదిగించడంపై శిక్షణ ఇచ్చారు.