AP Police Training: క్విక్ మార్చ్.. పుష్ అప్..
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:26 AM
అటెన్షన్.. క్విక్ మార్చ్.. పుష్ అప్.. వార్మ్ అప్..’’ రాష్ట్రంలోని పోలీసు శిక్షణా కేంద్రాల్లో సోమవారం గట్టిగా వినిపించిన మాటలివి..! పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,751 మందికి అధునాతన..
5,751 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం
అధునాతన పోలీసింగ్, హ్యూమన్ టచ్‌కు ప్రాధాన్యం
ఏఐ, సైబర్, డిజిటల్ టెక్నాలజీపై జేఎన్‌టీయూతో ఒప్పందం
పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి నిపుణులతో ఆన్‌లైన్ క్లాసులు
అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘అటెన్షన్.. క్విక్ మార్చ్.. పుష్ అప్.. వార్మ్ అప్..’’ రాష్ట్రంలోని పోలీసు శిక్షణా కేంద్రాల్లో సోమవారం గట్టిగా వినిపించిన మాటలివి..! పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,751 మందికి అధునాతన టెక్నాలజీతో కూడిన ట్రైనింగ్‌ను పోలీసు శాఖ ప్రారంభించింది. ఒంగోలు పీటీసీలో హోంమంత్రి అనిత, ఇతర ప్రాంతాల్లో ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారుతున్న నేరాల తీరుతెన్నులకు అనుగుణంగా పోలీసుల్లో శారీరక దృఢత్వంతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు పోలీసుశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,751 మందిని సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టే సైబర్ కమాండోల్లా తీర్చి దిద్దబోతోంది. పోలీస్ ట్రైనింగ్ విభాగం డీఐజీ బి. సత్యయేసు బాబు రాష్ట్రవ్యాప్తంగా 21 కేంద్రాల్లో ఏకకాలంలో ట్రైనింగ్ ప్రారంభించేలా సమన్వయం చేశారు. విజయనగరం, ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కళాశాలలో మహిళా అభ్యర్థులకు.. అనంతపురం, తిరుపతి పీటీసీలతో పాటు ఇతర జిల్లాల్లోని డీటీసీల్లో సివిల్ పోలీసు కానిస్టేబుళ్లకు.. ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు బీటీసీల్లో సోమవారం ఉదయం శిక్షణ ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా సైబర్ నేరాలు, ఫోరెన్సిక్, క్రిమినాలజీ వంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు నేర్పిస్తూనే శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసి చట్టాల అమలుపై అవగాహన కల్పిస్తారు. మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలోని టెక్ టవర్‌లో ఒక ప్రత్యేక స్టుడియో ఏర్పాటు చేసి, ట్రైనింగ్ సెంటర్లలో ప్రత్యేకంగా స్ర్కీన్లు ఏర్పాటు చేసి క్లాసులు చెబుతామని ట్రైనింగ్ విభాగం డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు.
ఏఐ పోలీసింగ్ వైపు .: డీజీపీ హరీశ్ గుప్తా
‘కాలంతో పాటు నేరాల్లోనూ సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయ్. వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి పోలీసును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏఐ వైపు ఏపీ పోలీసింగ్‌ను తీసుకెళ్లబోతున్నాం..’ అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. పోలీసులంటే లాఠీ చేతిలో పట్టుకుని డ్యూటీ చేయడమే కాదు.. డేటా ఆధారంగా నేరాలను అరికట్టడం, వెలికితీయడం అని కొత్తగా పోలీసు శాఖలోకి చేరిన ట్రైనీలకు చెప్పబోతున్నామని అన్నారు. అందుకోసం కాకినాడ, అనంతపురం జేఎన్‌టీయూలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ట్రైనీ కానిస్టేబుల్లో 810మంది బీటెక్, ఎంటెక్ చదివిన వారున్నారని, వారిని సైబర్ కమాండోలుగా సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.
రౌడీ మూకలను కట్టడి చేస్తాం: హోంమంత్రి అనిత
ఒంగోలు క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని, తాము కక్షసాఽధింపులకు పాల్పడితే వైసీపీ నేతలు రోడ్ల మీద తిరిగే వారు కాదని హోంమంత్రి అనిత అన్నారు. సోమవారం ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాలలో కొత్తగా ఎంపికైన మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, చిన్నపిల్లలతో రప్పా, రప్పా.. అంటూ ఫ్లెక్సీలు పెట్టించి.. మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేయిస్తూ నేరప్రవృత్తిని పెంచుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీల ఆటకట్టించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మంత్రి డొలా, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.