Road Accident: ఘోర ప్రమాదం
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:17 AM
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు బైపా్‌సలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలినడకన వెళ్తున్న భవానీ మాలధారులను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు...
నడిచి వస్తున్న భవానీ మాలధారులను ఢీకొన్న కారు
అక్కడికక్కడే ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
మృతులు అనకాపల్లి జిల్లావాసులు
నల్లజర్ల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు బైపా్‌సలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలినడకన వెళ్తున్న భవానీ మాలధారులను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు భవానీమాలధారులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లజర్ల పోలీసులు తెలిపిన వివరాలు... అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడు గ్రామానికి చెందిన పక్కుర్తి శివ (35), పక్కుర్తి శ్రీను (22), శేశీలు, కోనా గోవిందు ఈనెల 24వ తేదీ ఉదయం తమ స్వగ్రామం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి కాలినడకన బయల్దేరారు. ఆదివారం ఉదయానికి నల్లజర్ల మండలం పుల్లలపాడు బైపాస్ వద్దకు వీరు చేరుకున్న వీరిని విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన కారు ఢీకొట్టింది.కారు కిందపడి శివ, గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న బోదెలో పడి శ్రీను అక్కడికక్కడే మృతిచెందారు.ఈ ఘటనలో పక్కుర్తి శేశీలుకు రెండు కాళ్లు విరిగిపోవడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరితోపాటు ఉన్న గోవింద్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కురుస్తున్న మంచుకు తోడు, అతివేగం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.