Ganesh Immersion: నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:44 AM
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వాహనాలు ఢీకొని 8 మంది దుర్మరణం పాలవగా, సముద్రంలో మునిగి ఓ యువతి చనిపోయింది.
వేర్వేరు జిల్లాల్లో 9 మంది దుర్మరణం
నరసాపురంలో ట్రాక్టర్ ఢీకొని నలుగురు..
పాడేరులో స్కార్పియో ఢీకొని ఇద్దరు..
నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతలో ఒకరు..
నరసాపురం, కావలి రూరల్, పాడేరు రూరల్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వాహనాలు ఢీకొని 8 మంది దుర్మరణం పాలవగా, సముద్రంలో మునిగి ఓ యువతి చనిపోయింది. వివరాలివీ.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళు పంచాయతీ పరిధి ఈవనవారి మెరకలో 15 అడుగుల గణనాఽథుడి విగ్రహాన్ని నరసాపురం వశిష్ఠ గోదావరిలో నిమజ్జనం చేసేందుకు సాయంత్రం 5 గంటల సమయంలో ఊరేగింపు చేపట్టారు. అయితే, అక్కడి సిమెంటు రహదారి మార్జిన్ సక్రమంగా లేకపోవడంతో పాటు డ్యాన్సులు చేస్తున్న యువకుల అత్యుత్సాహంతో వినాయకుడి విగ్రహం ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది. ఈ ఘటనలో యివన సూర్యనారాయణ (58), తిరుమల నర్సింహమూర్తి (35), గురుజు మురళి (38), కడియం దినేశ్ (9) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలై పాలకొల్లు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయామ్, అడిషనల్ ఎస్పీ భీమారావు ఘటనా స్థలానికి చేరుకుని సంఘట ప్రమాదంపై ఆరా తీశారు. అలాగే, అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరు సమీప చింతలవీధి ప్రధాన రహదారిపై ఊరేగింపుగా వెళ్తున్నవారిపై స్కార్పియో కారు వేగంగా దూసుకువచ్చి ఢీకొంది. ఈ
ప్రమాదంలో చింతలవీధికి చెందిన కొర్రా సీతారామ్ (61), గంట కొండబాబు (35) అక్కడికక్కడే మృతిచెందగా, కొర్రా విశ్వ, వంతాల దాలిమ్మలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమం గా ఉంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే, నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాలెం సముద్రతీరంలో సాయంత్రం వినాయక నిమజ్జన సమయంలో పులి నాగలక్ష్మి(16) సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందింది. అలాగే, శ్రీసత్యసాయి జల్లా పెద్దిరెడ్డిపల్లి ఊరేగింపులో ట్రాక్టర్ ఢీకొని మారుతి (30) అనే వ్యక్తి మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు.
విగ్రహం ఉన్న ట్రాక్టర్ ఎక్కుదామనుకుంటే..
కొండాపురం మండలం రామాంజీపురానికి చెందిన వెంగయ్య తన కుమారుడు ప్రసాద్‌తో కలిసి మోటారుబైక్‌పై కావలి తుమ్మలపెంట తీరంలో జరిగే నిమజ్జనానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో కావలి సమీపంలో బైక్‌ను ఆపి.. ‘నువ్వు బైక్‌లో వెళ్లి పో.. నేను వెనుక విగ్రహం వస్తున్న ట్రాక్టర్‌లో వస్తా’నని చెప్పి కుమారుడ్ని పంపించాడు. అనంతరం ట్రాక్టర్‌ను ఆపే క్రమంలో వెంగయ్యను ట్రాక్టర్ ఢీకొంది. ఆయన కాలికి తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.