Share News

Ghat Road Accident: ఘాట్‌లో ఘోరం

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:35 AM

మూడు రోజుల పాటు ఆనందంగా సాగిన తీర్థయాత్ర చివరకు వారికి విషాదయాత్రనే మిగిల్చింది.

Ghat Road Accident: ఘాట్‌లో ఘోరం

  • లోయలో పడ్డ టూరిస్టు బస్సు

  • 9 మంది దుర్మరణం

  • 21 మందికి గాయాలు

  • చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌లో ఘటన

  • మృతులంతా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులే

  • పంచారామం పుణ్యక్షేత్రాల సందర్శనకు 37 మంది

  • మూడు రోజులు సాఫీగా సాగిన తీర్థయాత్ర

  • భద్రాచలం చేరడానికి అరకు మీదుగా ప్రయాణం

  • తెల్లవారుజామున అదుపు తప్పి లోయలోకి బస్సు

  • చీకటి.. పొగమంచు.. ఆపై డ్రైవర్‌ అతి వేగమే శాపం!

  • ఘాట్‌రోడ్లలో రాత్రి ప్రయాణాలు నిషేధిస్తూ ఆదేశాలు

  • తీర్థయాత్ర విషాదాంతం

చింతూరు, చిత్తూరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మూడు రోజుల పాటు ఆనందంగా సాగిన తీర్థయాత్ర చివరకు వారికి విషాదయాత్రనే మిగిల్చింది. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించడానికి బయలుదేరిన వారి ట్రావెల్స్‌ బస్సు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి ఘాట్‌ రోడ్డులో పైరోడ్డుకు కింద రోడ్డుకు మధ్య ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, పదిమంది తీవ్రంగాను, మరో 11మంది స్పల్పంగా గాయపడ్డారు. ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఘాట్‌ రోడ్డు కావడం..విపరీతంగా పొగ మంచు కురుస్తుండడంతోపాటు డ్రైవర్‌ అతివేగమే శాపంగా మారిందని బాధితులు చెబుతున్నారు.


మూడురోజుల క్రితం..

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 32 మంది పంచారామం పుణ్యక్షేత్రాలను సందర్శించాలని అనుకు న్నారు. వీరికి యాత్రను ఏర్పాటుచేసిన టూరిస్టు ఆర్గనైజర్‌ వజ్రమణి, వంట మనుషులు ఇద్దరితోపాటు డ్రైవర్లు మధు, ప్రసాద్‌లతో కలిపి మొత్తంగా 37మందితో ఈ నెల తొమ్మిదో తేదీన ట్రావెల్స్‌ బస్సు బయలుదేరింది. ఉభయగోదావరి జిల్లాల మీదుగా గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీకి వారు చేరుకున్నారు. అక్కడినుంచి తిరుగు ప్రయాణమై, రాత్రి ఎనిమిది గంటల సమయంలో కాకినాడ జిల్లా జగ్గంపేట చేరారు. అక్కడినుంచి గోకవరం, రంపచోడవరం మీదుగా మారేడుమిల్లి చేరుకున్నారు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. ఘాట్‌ రోడ్డు మీదుగా తెలంగాణ రాష్ట్రం భద్రాచలంవారి బస్సు చేరుకోవాల్సి ఉంది. అక్కడ పుణ్యస్నానం ఆచరించి శుక్రవారం ఉదయాన్నే సీతారాములను దర్శించుకోవాలనుకున్నారు.


ఘాట్‌ను మరో అరగంటలో దాటతారనగా..

ట్రావెల్స్‌ బస్సు ప్రయాణం మారేడుమిల్లి నుంచి దాదాపు 24 కిలోమీటర్ల మేర ఘాట్‌ రోడ్డులో బాగానే సాగింది. మరో అరగంట ప్రయాణించి ఆరు కిలోమీటర్ల దూరం దాటితే మైదాన ప్రాంత రహదారికి చేరుకుంటారు. అక్కడి నుంచి 71 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే వయా చింతూరు మీదుగా భద్రాచలం చేరుకుంటారు. అయితే, చింతూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఘాట్‌ మలుపు వద్ద ఎత్తయిన గుట్టను ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. గుట్టకు కొట్టుకున్న వెంటనే అదుపు తప్పిన బస్సు లోయ వైపు ఉన్న మట్టి దిబ్బను ఢీకొట్టి పైరోడ్డుకు కింద రోడ్‌కు మధ్య ఉన్న దాదాపు 30 అడుగుల లోయలో చిక్కుకుంది. దీంతో యాత్రికులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ నిద్రమత్తులో ఒకరిపై ఒకరు కుప్పలుగా పడిపోయారు. తెల్లవారుజాము కావడం.. మంచు ఎక్కువగా కురుస్తుండడంతో అటుగా చాలాసేపటికి వరకు ఎవరూ వెళ్లలేదు. ఉదయం 5-5.30 గంటల సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తులు విషయం తెలుసుకుని వెంటనే 108కు ఫోన్‌ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


మృతుల్లో ఎనిమిది మంది చిత్తూరు వాసులే

ఘాట్‌ ప్రమాదంలో మరణించి తొమ్మిదిమందిలో ఎనిమిదిమంది చిత్తూరు జిల్లా వాసులే ఉన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సునంద. శివశంకర రెడ్డి దంపతులు ఈ ప్రమాదంలో మరణించారు. సునంద తల్లి గాయాలతో బయటపడ్డారు. ఇతర మృతులు... ఎస్వీ నాగేశ్వరరావు(68), మరాఠి వీధి, చిత్తూరు, శ్రీకళాదేవి(60), గిరింపేట, చిత్తూరు, దొరబాబు(37) తవణంపల్లె మండలం, చిత్తూరు, శ్యామల(67) - గిరింపేట, కావేరి కృష్ణ(70) మిట్టూరు, చిత్తూరు, కృష్ణకుమారి (52) పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లా చిత్తూరు, శైలజా రాణి (65) తిరుచానూరు, తిరుపతి జిల్లా. కలిసి ప్రయాణం చేసిన దంపతుల్లో ఎస్వీ నాగేశ్వరరావు మరణించగా, అమ్ములుభాయ్‌ గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన దొరబాబు వంటమనిషిగా బస్సులో ప్రయాణించారు. శైలజారాణి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి కాగా, ప్రస్తుతం తిరుచానూరులో ఉంటున్నారు. కాగా, మృతదేహాలను తెచ్చేందుకు ఎనిమిది అంబులెన్సులను, అధికారులను ఘటనా స్థలానికి పంపినట్లు చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఘాట్‌రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. మంత్రులు వంగలపూడి అనిత, రాంప్రసాద్‌రెడ్డి, సంధ్యారాణి, చింతూరు ఏరియా ఆస్పత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు, క్షతగాత్రులు ఒక్కొక్కరికీ రూ.రెండు లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. ఘాట్‌ రోడ్లపై చలికాలం తగ్గే వరకు రాత్రి 10గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణాలను నిలిపివేస్తామని మంత్రి అనిత ప్రకటించారు.


అతివేగం.. నిర్లక్ష్యం.. అనుభవ రాహిత్యం..

ట్రావెల్‌ బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. వారిలో ఒకరు ప్రసాద్‌ కాగా రెండో డ్రైవర్‌ మధు. మధు జూనియర్‌. ఘాట్‌లో అనుభవం ఉన్న డ్రైవర్‌ మాత్రమే బండి నడపాలి. కానీ, సీనియర్‌ డ్రైవర్‌ ప్రసాద్‌ చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌ రోడ్‌లో జూనియర్‌ మధుకు బండిని అప్పగించి నిద్రకు ఉపక్రమించాడు. అనుభవ రాహిత్యంతోపాటు నిర్లక్ష్యంతో మధు బండిని అతివేగంగా నడిపాడని కొందరు క్షతగాత్రులు తెలిపారు. గేర్‌ న్యూట్రల్‌ చేయడంతో వేగం పెరిగి చివరకు అదుపుతప్పి ప్రమాదానికి గురయి ఉండవచ్చునని కూడా చెబుతున్నారు. బ్రేక్‌ ఫెయిల్‌ అయిందని ఇంకొందరు అంటున్నారు. ఘాట్‌లో మంచు పెద్దఎత్తున కురవడంతో రహదారి పూర్తిగా కానరాలేదన్న వాదన కూడా ఉంది. డైవర్‌ మధును, యాత్ర నిర్వాహకుడు వజ్రమణిని పోలీసులు విచారిస్తున్నారు.

డ్రైవర్‌ అతివేగమే ప్రాణాలు తీసింది : క్షతగాత్రుడు

‘‘మేం నాలుగేళ్లగా పుణ్యక్షేత్రాల సందర్శనకు చిత్తూరు నుంచి వెళుతున్నాం. గురువారం అరకు చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకుని భద్రాచలానికి రాత్రి బయలుదేరాం. చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌ రోడ్‌లో డ్రైవరు అతి వేగంగా బండి నడిపాడు. మా బస్సు లోయలో పడగానే, చక్రాలు పైకి లేచి సీట్లు రోడ్డుకు గుచ్చుకున్నాయి. ఆ కుదుపులకు ఒకరిపై ఒకరం పడ్డాం. అతి కష్టం మీద నా భార్యను గుర్తించగలిగా. తలంతా తీవ్రగాయాలు. రక్తం ఓడుతోంది. అమెను అతికష్టం మీద ఆస్పత్రికి తరలించగలిగాం. నాలుగేళ్లుగా మా ఇంట్లో అద్దెకుంటున్న శైలజారాణి మా కళ్లెదుటే చనిపోవడం బాధ కలిగింది.’’

- రామస్వామి, తిరుచానూర్లు

Updated Date - Dec 13 , 2025 | 04:36 AM