Maipadu Beach: ఆయుష్షు తీసిన అలలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 07:00 AM
సెలవు రోజు సరదాగా సముద్రం వద్ద గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు అలల ధాటికి గల్లంతయ్యారు.
మృతదేహాలను వెలికితీసిన పోలీసులు .. మైపాడు బీచ్‌లో ఘటన
ఇందుకూరుపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): సెలవు రోజు సరదాగా సముద్రం వద్ద గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు అలల ధాటికి గల్లంతయ్యారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. నెల్లూరురూరల్ మండలం నారాయణరెడ్డిపేటకు చెందిన పఠాన్ మహమ్మద్ తాజీమ్ (17), నెల్లూరు నగరం కోటమిట్టకు చెందిన పఠాన్ హుమయూన్(17), సమీద్ (17) ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ముగ్గురూ మైపాడు బీచ్‌కు వెళ్లారు. అక్కడ నీటిలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా అలలు రావడంతో గల్లంతు అయ్యారు. అక్కడ ఉన్న వారు చూసి కేకలు వేయడంతో మెరైన్ పోలీసులు రంగంలోకి దిగి గాలించారు. కాసేపటికి ఆ ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.