Family Tragedy: ఈ ఆనందం ఇదే ఆఖరు
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:54 AM
వారిద్దరూ మిత్రులు. నెల్లూరు జిల్లాలోని రెండు ప్రాంతాలకు చెందిన వారే అయినా.. ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని కుటుంబ సమేతంగా బెంగళూరుకు వలస వెళ్లారు.
స్నేహితుల కుటుంబాల్లో ‘చిచ్చు’
ఒక కుటుంబం ఆహుతి.. మరొకరు క్షేమం
దుత్తలూరు/ఉదయగిరి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): వారిద్దరూ మిత్రులు. నెల్లూరు జిల్లాలోని రెండు ప్రాంతాలకు చెందిన వారే అయినా.. ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని కుటుంబ సమేతంగా బెంగళూరుకు వలస వెళ్లారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న సమయంలో స్నేహితులయ్యారు. బాధలు, సంతోషాలను పంచుకుంటూ రెండు కుటుంబాలవారు ఎంతో అన్యోనంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దీపావళిని సంతోషంగా జరుపుకొనేందుకు హైదరాబాద్‌లోని మిత్రుడి సోదరి ఇంటికి ఉమ్మడిగా వెళ్లారు. వేడుకలు ముగించుకుని తిరిగి బెంగళూరుకు వస్తుండగా కావేరీ బస్సు ప్రమాదంలో మిత్రులలోని ఓ కుటుంబం మరణించగా.. మరో కుటుంబం మృత్యుంజయులుగా బయటపడింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన నెలకుర్తి రమేశ్, వింజమూరు మండలం గోళ్లవారిపాళెం గ్రామానికి చెందిన గోళ్ల రమేశ్ బెంగళూరులోని హిందూస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ పరిశ్రమలో మార్కెటింగ్ డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్నారు. దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు రెండు కుటుంబాలు కలిసి హైదరాబాదులోని నెలకుర్తి రమేశ్ అక్క నివాసానికి వెళ్లారు. అక్కడ దీపావళిని జరుపుకొన్నారు. అనంతరం కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు హైదరాబాదు నుంచి ఆ రెండు కుటుంబాలు బస్సులో బయలుదేరాయి. బస్సు కర్నూలుకు సమీపంలో ప్రమాదం సంభవించి దగ్ధమవడంతో గాఢ నిద్రలో ఉన్న గోళ్ల రమేశ్ కుటుంబం అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో కుమారుడు గోళ్ల రమేశ్(31), కోడలు అనూష(27), మనుమలు శశాంత్(7), మాన్విత(4) ప్రాణాలు కోల్పోవడంతో రమేశ్ తల్లిదండ్రులు గోళ్ల మాలకొండయ్య, సుశీల కన్నీరుమున్నీరయ్యారు.
బస్సు కుదుపులతో మేల్కొన్నా: నెలకుర్తి రమేశ్
నిద్రలో ఉన్న తనకు బస్సు కుదుపులతో మెలకువ వచ్చిందని నెలకుర్తి రమేశ్ తెలిపారు. బస్సు ప్రమాద సంఘటనను ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన వివరించారు. ‘‘బస్సులో అంతా గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురైంది. నేను నిద్రలో నుంచి తేరుకున్నా. బస్సు డ్రైవర్ మోటార్‌బైక్‌ను ఢీకొట్టి సుమారు 200 మీటర్ల వరకు ఈడ్చుకొని వెళ్లాడు. ఆ సమయంలో మోటార్‌బైక్ బస్సు కిందనే ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే నేను కూర్చున్న సీటు పక్కనే ఉన్న అద్దాన్ని పగలకొట్టి నా భార్య శ్రీలక్ష్మి, కుమారుడు అభిరామ్, కుమార్తె జశ్వితలను కిందకు తోసి నేను కూడా దూకేశా. అనంతరం మరికొందరు అందులో నుంచే బయటకు వచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. నాకు, తన కుటుంబానికి ఆప్తుడైన గోళ్ల రమేశ్ కుటుంబాన్ని కోల్పోవడం బాధాకరం.’’ అని అన్నారు.