Share News

Lorry Accident: పత్తికొండలో లారీ బీభత్సం

ABN , Publish Date - Oct 01 , 2025 | 04:34 AM

రేషన్‌ బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఇంజన్‌ ఆగిపోవడంతో వెనక్కి వెళ్లిన లారీ.. ఓ ఆటోను తొక్కేసి.. ముగ్గురి ప్రాణాలు తీసింది.

Lorry Accident: పత్తికొండలో లారీ బీభత్సం

  • ఇంజన్‌ ఆగి.. వెనక్కి వెళ్లి.. ఆటోను తొక్కేసిన బియ్యం లారీ

  • ఆటోలో ఉన్న ముగ్గురు దుర్మరణం

  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

పత్తికొండ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఇంజన్‌ ఆగిపోవడంతో వెనక్కి వెళ్లిన లారీ.. ఓ ఆటోను తొక్కేసి.. ముగ్గురి ప్రాణాలు తీసింది. కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదోని సివిల్‌ సప్లైస్‌ గొడౌన్‌ నుంచి రేషన్‌ బియ్యం లోడుతో ఓ లారీ మంగళవారం పత్తికొండ చేరుకుంది. అప్పటికే పలుమార్లు ఇంజన్‌ ఇబ్బంది పెట్టినా.. డ్రైవర్‌ మొండిగా ముందుకే వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే గుత్తి రోడ్డులోకి లారీ చేరుకుంది. పంచాయతీరాజ్‌ కార్యాలయం దాటాక ఎత్తుగా ఉండే ప్రాంతంలో ఇంజన్‌ ఆగిపోయింది. దీంతో పలు వాహనాలను తాకుతూ దాదాపు వంద మీటర్ల దూరం వెనక్కి వెళ్లింది. సాయిబాబా ఆలయం గేటు వద్ద ప్రయాణికులతో నిలిచి ఉన్న ఆటోను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జుకాగా, ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు తుగ్గలి మండలం ముక్కెళ్లకు చెందిన తల్లీకూతుళ్లు భూమిక(25) శ్రీనితిక (5), అదే గ్రామానికి చెందిన శిరీష (25)గా గుర్తించారు. భూమిక తల్లి, అక్క, ఆమె రెండేళ్ల కుమారుడు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దసరా పండక్కి దుస్తులు కొనేందుకు వచ్చి ప్రమాదం బారిన పడ్డారని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పత్తికొండ సీఐ జయన్న చెప్పారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పరారయ్యాడు.

Updated Date - Oct 01 , 2025 | 04:35 AM