Vadarevu Beach: ఈతకెళ్లి మృత్యు ఒడికి
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:12 AM
వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. ఉత్సాహంగా సముద్రంలో మునుగుతూ కేరింతలు కొడుతున్నారు.
బాపట్ల జిల్లా వాడరేవు తీరంలో విషాదం
అలల తాకిడికి కొట్టుకుపోయి ముగ్గురు మృతి
మృతులు అమరావతి ‘విట్’ విద్యార్థులు
అక్కడే మరో ఘటనలో ఇంకో ఇద్దరు గల్లంతు
చీరాల, అక్టోబరు12(ఆంధ్రజ్యోతి): వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. ఉత్సాహంగా సముద్రంలో మునుగుతూ కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన రాకాసి అల వారి ఆనందాన్ని మింగేసి.. మృత్యుఒడికి చేర్చింది. వేర్వేరుగా జరిగిన రెండు ఘటనల్లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించగా.. మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరప్రాంతంలో ఆదివారం ఈ పెనువిషాదం చోటుచేసుకుంది. అమరావతిలోని విట్ కళాశాలకు చెందిన బి.సాయి మణిదీప్ (20), వంగల శ్రీసాకేత్ (20), పెంటెల జీవన్ సాత్విక్ (20) మరో నలుగురు మిత్రులతో కలిసి ఆదివారం బస్సులో వాడరేవు తీరానికి వచ్చారు. సాయంత్రం వరకు సరదాగా గడిపారు. మణిదీప్ సముద్రంలో ఈతకొట్టే క్రమంలో లోతుకు వెళుతుండగా.. అప్పటికే పలుమార్లు కేకలు వేసిన శ్రీసాకేత్, సాత్విక్.. మణిదీ్‌పను వెనక్కు తెచ్చేందుకు వెళ్లారు. ఆ సమయంలో అలల తాకిడికి మణిదీప్ కొట్టుకుపోతుండగా కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు మిత్రులు కూడా గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపట్లోనే అక్కడికి సమీపంలోని ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. మరణించిన ముగ్గురూ హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు వేటపాలెం మండలం వడ్డె సంఘం గ్రామానికి చెందిన కుంచన షారోన్ (18) రాజమండ్రిలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన కోట గౌతమ్ (16) చీరాలలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ కలిసి ఆదివారం వాడరేవు తీరానికి వచ్చారు. సరదాగా సముద్రంలోకి దిగి అలల తాకిడికి గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.