Share News

ట్రా‘ఫికర్‌’!

ABN , Publish Date - Oct 06 , 2025 | 01:19 AM

జాతీయ రహదారులశాఖ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నందిగామ వద్ద బైపాస్‌ పనులు నిలిచిపోవడంతో గుంతలమయంగా తయారైన సర్వీసు రోడ్డులోనే ప్రయాణికులు అవస్థలు పడుతూ ముందుకు సాగుతున్నారు. ఆదివారం వాహనాల రద్దీ పెరగడంతో రెండు, మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

 ట్రా‘ఫికర్‌’!

- నందిగామ వద్ద బైపాస్‌లో నిలిచిపోయిన ట్రాఫిక్‌

- వాహనదారుల కష్టాలు వర్ణణాతీతం

- తొమ్మిది నెలల క్రితం బైపాస్‌ విస్తరణ పనులకు బ్రేక్‌

- సర్వీసు రోడ్డే దిక్కు.. గుంతలమయంగా కావడంతో తరచూ ప్రమాదాలు

- పట్టించుకోని జాతీయ రహదారులశాఖ అధికారులు

జాతీయ రహదారులశాఖ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నందిగామ వద్ద బైపాస్‌ పనులు నిలిచిపోవడంతో గుంతలమయంగా తయారైన సర్వీసు రోడ్డులోనే ప్రయాణికులు అవస్థలు పడుతూ ముందుకు సాగుతున్నారు. ఆదివారం వాహనాల రద్దీ పెరగడంతో రెండు, మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

(ఆంధ్రజ్యోతి, నందిగామ):

నందిగామ పట్టణంలోని వైజంక్షన్‌ వద్ద బైపాస్‌ రోడ్డు విస్తరణ పనులు సుమారు తొమ్మిది నెలల కిందట ఆకస్మికంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి వాహనాలు అన్నీ సర్వీసు రోడ్డులోనే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. ఇటీవల జరిగిన వేర్వేరు బైక్‌ ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అయినా సదరు కాంట్రాక్టర్‌ గుంతలు మాత్రం పూడ్చటంలేదు. గుంతల వద్ద వాహనాలు నిదానంగా వెళ్లడంతో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ప్రధాన కాంట్రాక్టర్‌, సబ్‌ కాంట్రాక్టర్‌ మధ్య ఏర్పడిన ఆర్థిక వివాదాలతోనే రోడ్డు పనులు ముందుకు సాగడంలేదని తెలిసింది. వేలాది వాహనాలతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వాహనాలు సైతం ఇదే రోడ్డుపై ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నాయి. అయినా ఈ రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి వేలాది వాహనాలు విజయవాడ వైపు వచ్చాయి. ఆ సమయంలో గుంతల వల్ల ట్రాఫిక్‌ స్తంభించింది. గంటల తరబడి ట్రాఫిక్‌లో నిరీక్షించలేక ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ కనీసం స్పందించలేదు. ప్రయాణిలు వారం వ్యవధిలో తిరిగి ఇటువైపుగానే ప్రయాణిస్తారన్న విషయం తెలిసి కూడా సంబంధిత అధికారులు కనీస మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఆదివారం వాహనదారులు అదే ప్రదేశంలో మరో మారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎవరైనా ఫిర్యాదు చేయాలని భావించినా హైవే అథారిటీ అధికారులు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి.

సౌకర్యాలు లేకపోయినా తప్పని టోల్‌ బాదుడు

రోడ్డు ప్రయాణంలో ఎక్కడ అసౌకర్యం కలిగినా, టోల్‌ ప్లాజాల వద్ద ఆలస్యం అయినా టోల్‌ చెల్లించే అవసరం లేదని జాతీయ రహదారుల సంస్థ ప్రకటనలు చేస్తుంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అయినా కూడా కీసర, చిల్లకల్లు టోల్‌ప్లాజాలు దర్జాగా టోల్‌ వసూలు చేస్తున్నాయి. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పని తమది కాదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ ప్లాజాల నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో ప్లాజాల నిర్వాహకులు వాహనదారులపై రెచ్చిపోతున్నారు. జాతీయ రహదారుల సంస్థ నిర్దేశించిన నిబంధనలు కీసర, చిల్లకల్లు టోల్‌ప్లాజాలకు వర్తిస్తాయా లేదా అన్న విషయంపై ఆ శాఖ అధికారులు బహిరంగ ప్రకటన చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాతే టోల్‌ వసూళ్లు చేయాలని, అంత వరకూ టోల్‌ వసూళ్లు నిలిపివేయాలని వాహనదారులు కోరుతున్నారు.

స్థానిక అధికారులకు ఫిర్యాదులు

జాతీయ రహదారులశాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తమ ఇబ్బందులను స్థానిక అధికారులకు చెప్పుకుంటున్నారు. రోడ్లు బాగా లేకపోయినా టోల్‌ వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. గత ఏడాది మనేటి వరద ప్రభావంతో రోజుల తరబడి రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. వరద తగ్గిన తర్వాత వాటికి టోల్‌ చెల్లించవద్దని అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. ఈ మేరకు కీసర టోల్‌ప్లాజా నిర్వాహకులను కూడా కలెక్టర్‌ ఫోన్‌ ద్వారా ఆదేశించారు. కానీ టోల్‌ప్లాజా నిర్వాహకులు దర్జాగా టోల్‌ వసూలు చేశారు. వరదలో కొట్టుకుపోయి పొలాల్లో ఉన్న వాహనాలను వెలికితీయించాల్సిన టోల్‌ప్లాజా నిర్వాహకులు ఆపని చేయకపోయినా అధికారులు ఏమీ చేయలేక పోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనచోదకులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 01:19 AM