AP CM Chandrababu: ముందు అవగాహన...తర్వాతే చలానా వసూళ్లు
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:55 AM
ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించండి. ఆ తరువాతే నిబంధనలు ఉల్లంఘించినవారి నుంచి చలానాలు వసూలు చేయండి’ అని పోలీసు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టండి
తక్షణమే రహదారుల మరమ్మతులు చేపట్టండి
ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించండి. ఆ తరువాతే నిబంధనలు ఉల్లంఘించినవారి నుంచి చలానాలు వసూలు చేయండి’ అని పోలీసు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్‌టీజీఎస్) సమీక్షను నిర్వహించారు. ‘రవాణ, పోలీస్ యంత్రాంగం రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి ఫోకస్ పెట్టాలి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారికి పూర్తి అవగాహన కల్పించాలి. చలానాల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దు. నిబంధనలు ఉల్లఘిస్తున్నారంటూ ముందస్తుగా హెచ్చరికలతో కూడిన మెసేజ్‌లను పంపాలి. వాటిద్వారా ట్రాఫిక్ పోలీసుల దృష్టి తమపై ఉందన్న అభిప్రాయం వాహనదారుల్లో పెరుగుతుంది. మెసేజ్‌లను పంపుతున్నా ఆ వాహనదారుడిలో మార్పు రాకపోతే అప్పడు ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేయాలి’ అని సీఎం స్పష్టం చేశారు. భారీ ఎత్తున చలానాలు వేయాలన్న అధికారుల ప్రతిపాదనలను ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు. ఇటీవల కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంపై సీఎం మాట్లాడుతూ... ‘ఈ ప్రమాదాలపై అధ్యయనం చేయాలి. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలి. దేవాలయాలు, జనసమ్మర్ద ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు నివారణా చర్యలు తీసుకోవాలి. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి’ అని స్పష్టం చేశారు. గుంతల రోడ్డు కనిపించకూడదని రహదారుల శాఖను సీఎం ఆదేశించారు. ‘రోడ్లు బాగాలేవన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది. రహదారుల మరమ్మతులు యుద్ధప్రాతిపాదికన చేపట్టాలి.
ఇదే విధంగా డ్రైనేజీల నిర్వహణ కూడా చేపట్టాలి. వీటి నిర్వహణ సరిగా లేకపోవడంతో మురుగునీటి కాలువల నుంచి నీరు రోడ్డపైకి వచ్చేస్తుంది. మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్వహణ లోపం లేకుండా చూసుకోవాలి. డ్రైనేజీలు, నీటి నిర్వహణ, ఉద్యోగ, ఉపాధికల్పన, పంటలకు మద్దతు ధర నా ప్రధాన్యాలు. ప్రభుత్వ ప్రాధామ్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వం అందించే పౌర సేవల్లో అవినీతి మాట వినిపించకూడదు’ అని సీఎం స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్, రేషన్, దీపం సిలెండర్లు అమలు తీరుపై సీఎం సమీక్షించారు. గతంతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ సేవల్లో మెరుగైన మార్పు కనిపిస్తోందన్నారు. సమావేశంలో మంత్రి పార్థసారథి, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.