Minister Satya kumar: సంప్రదాయ వైద్యం శాస్త్రీయం కాదన్నది అపోహే
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:23 AM
భారతీయ సంప్రదాయ వైద్య రీతులు శాస్త్రీయం కావన్నది అపోహ మాత్రమేనని మంత్రి సత్యకుమార్ అన్నారు.
సాంకేతికత, సంప్రదాయాలు కలసి సాగాలి.. జగన్‌కు విజ్ఞాన దృక్పథం లేదు
అందుకే యోగా వృథా అంటున్నారు
భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో మంత్రి సత్యకుమార్
తిరుపతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): భారతీయ సంప్రదాయ వైద్య రీతులు శాస్త్రీయం కావన్నది అపోహ మాత్రమేనని మంత్రి సత్యకుమార్ అన్నారు. శనివారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం రెండవ రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సంప్రదాయ వైద్య విధానాలు’ అన్న అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ‘ప్రాచీన కాలంలో మునులు, రుషులు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని మేళవించి రూపొందించిన ఆయుర్వేద, సిద్ధ తదితర వైద్య రీతులు ఎంతో విలువైనవి. ఈ ప్రాచీన, సంప్రదాయ వైద్య విధానాలు అద్భుత వారసత్వ సంపద. 2,500ఏళ్ల కిందటే సుశ్రుతుడు 1,200 రకాల వ్యాధులను గుర్తించారు. 120 రకాల శస్త్రచికిత్సల్లో వాడే పరికరాలను (సర్జికల్ టూల్స్) తయారు చేశారు. వెయ్యేళ్ల క్రితమే చరకుడు జీర్ణ వ్యవస్థను అధ్యయనం చేసి జీర్ణ ప్రక్రియను, దానికి సోకే వ్యాధులను, చికిత్సా పద్ధతులను పేర్కొన్నారు. దేశ గ్రామీణ జనాభాలో 60 నుంచి 70 శాతం ఇప్పటికీ సంప్రదాయ, ప్రాచీన వైద్య చికిత్సలపైనే ఆధారపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థే ప్రకటించింది. గత పదేళ్లలో రాష్ట్ర ఆయుష్ వైద్య విభాగానికి కేంద్రం నుంచి రూ.119 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. అదే ప్రస్తుత ప్రభుత్వంలో 18నెలల వ్యవధిలోనే రూ.250కోట్లు వచ్చాయి. సంప్రదాయాలు, టెక్నాలజీ... రెండూ కలసి పనిచేయాలి. రాష్ట్ర వైద్యశాఖ వార్షిక బడ్జెట్ రూ.30 వేల కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేద, హోమియో, యునానీ, సిద్ధ తదితర ప్రాచీన వైద్య చికిత్సలపై దృష్టి కేంద్రీకరించింది. ఏళ్ల తరబడి ఆయుష్ శాఖలో పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. తమ ప్రభుత్వం ఏకంగా 400 వైద్యుల పోస్టులు భర్తీ చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 5ఆయుర్వేద ఆస్పత్రులు, 3 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవలే ఆయుర్వేద పీజీ వైద్యులు శల్యతంత్రం విభాగంలో 53 రకాల సర్జరీలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది’ అని సత్యకుమార్ పేర్కొన్నారు.
అనేక అంశాలపై విస్తృత చర్చలు
భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో రెండవ రోజు అనేక అంశాలపై నిపుణులు విస్తృతంగా చర్చించారు. తమ ఉపన్యాసాలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్ అంశాలపై జరిగిన చర్చకు పెద్దఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. లెక్కలు, సైన్స్ అంశాల మీద నిర్వహించిన మ్యాథ్స్ స్కిట్, క్విజ్, డ్రాయింగ్ పోటీల్లో ఆసక్తిగా పాల్గొన్నారు. ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఆర్థిక రంగాలపై చర్చలు జరిగాయి. న్యూటన్, స్టీఫెన్ హాకింగ్స్ మొదలు పాణిని, ఆర్యభట్ట వరకు చేసిన ప్రతిపాదనలను ప్రస్తావించారు. ఇక ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన డ్రోన్ అంబులెన్స్ సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. రెండవ రోజు జిల్లావ్యాప్తంగా అనేక విద్యా సంస్థల నుంచి వేలాది మంది విద్యార్థులు విజ్ఞాన సమ్మేళనానికి పోటెత్తారు.
ఆయుర్వేద వైద్యులపై ఐఎంఏ ఆరోపణలు అవాస్తవం
మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వేముల భానుప్రకాశ్
ఆయుర్వేద వైద్యులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపణలు చేయడాన్ని ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వేముల భానుప్రకాశ్ ఖండించారు. ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాస్త్రీయ సూత్రాలు, వైద్యవిద్య నియంత్రణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఐఎంఏ ప్రతినిధులు ఆరోపణలు చేయడం సరికాదు. ఇటువంటి ఆరోపణలు చేయడం పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు, కేంద్రప్రభుత్వ నోటిఫికేషన్లు, వైద్య నియంత్రణ సంస్థల అధికారాలను కించపరిచినట్టేనన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ నిబంధనల ప్రకారం థియరీ, క్లినికల్ ట్రైనింగ్, లైవ్ సర్టికల్ ఎక్స్‌పోజర్, ఇంటర్న్‌షిప్ లేకుండా ఎలాంటి పీజీడిగ్రీ మంజూరు చేయదన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆయుర్వేద వైద్యులు 58 శస్త్రచికిత్సలు చట్టబద్దంగా, ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారన్నారు. ఐఎంఏ ప్రతినిధులు వాస్తవాలు అంగీకరించి వివాదాలు సృష్టించకుండా ప్రజా ఆరోగ్య ప్రయోజనాలకు సహకారించాలని భానుప్రకాష్ కోరారు.