Prakasam District: ఆశపెట్టి.. 1.16 కోట్లు కొల్లగొట్టి..
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:12 AM
ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ వ్యాపారికి సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది. తాను ట్రేడింగ్ యాప్‌లో గోల్డ్‌బాక్స్ బిజినెస్ చేస్తానని...
ట్రేడింగ్ యాప్‌లో అధిక ఆదాయం ఆశ చూపి సొమ్ము కాజేసిన కిలేడీ
కనిగిరి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ వ్యాపారికి సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది. తాను ట్రేడింగ్ యాప్‌లో ‘గోల్డ్‌బాక్స్’ బిజినెస్ చేస్తానని, పెట్టిన పెట్టుబడికి మంచి ఆదాయం వస్తోందని నమ్మించింది. మీరూ చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశపెట్టింది. ట్రయల్ కింద రూ.లక్ష పెడితే.. 2రోజులకే రూ.3 లక్షలు ఖాతాలో జమచేసింది. నిజమేనని నమ్మిన ఆ వ్యాపారి విడతల వారీగా రూ.1.16 కోట్లు ఆమె చెప్పిన ఖాతాల్లో వేశారు. ఆ మొత్తం కొట్టేసిన ఆ మహిళ.. మాయమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి వ్యాపారి అత్యాశకు పోయి మొదటిసారి రూ.లక్ష ఆ యువతి చెప్పిన అకౌంట్‌కు వేశారు. అవి రెండు రోజులకు రూ.3 లక్షలు అయ్యాయని చెప్పి.. ఆ మొత్తాన్ని తిరిగి వ్యాపారి అకౌంట్‌కు పంపించింది. నమ్మకం కుదరడంతో ఆ వ్యాపారి 45 రోజులుగా ఆమె చెప్పిన ఏడు ఖాతాల్లో రూ.1.16 కోట్ల వరకూ నగదు జమచేశాడు. ఆ తర్వాత ఆ యువతి సోషల్ మీడియా నుంచి మాయమైంది. మోసపోయినట్టు గమనించిన వ్యాపారి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మొదటి లావాదేవీ జరిగిన ఖాతాను సీజ్ చేశారు.