పర్యాటక రచ్చ!
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:29 AM
పర్యాటకశాఖ ఆస్తుల పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. విజయవాడ డివిజన్‌లోని యూనిట్లకు ఇటీవల టెండర్లు ఆహ్వానిస్తే ప్రముఖ సంస్థలు ముఖం చాటేశాయి. ఎటువంటి అర్హతలు లేని ఒకే ఒక్క సంస్థ మాత్రం బిడ్‌ను దాఖలు చేసింది. ఈ విషయం రహస్యంగా ఉంచడంతో చర్చకు దారితీసింది. దీనిపై ఉన్నతాధికారులను సీఎంవో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో చైర్మన్ ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్యదర్శి అజయ్ జైన్ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి వ్యవహారాలను చైర్మన్ బాలాజీ పీ4 చైర్మన్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన టెండర్లు, బిడ్లను పరిశీలించాలని సీఎంవోను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
- టూరిజం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంపై భిన్నస్వరాలు
- విజయవాడ డివిజన్ యూనిట్ల పీపీపీకి ఇటీవల టెండర్ల ఆహ్వానం
- బిడ్ వేసేందుకు ముందుకురాని ప్రముఖ సంస్థలు
- అర్హతలు లేని ఒకే ఒక్క ప్రైవేటు సంస్థ బిడ్ దాఖలు
- ఈ విషయం రహస్యంగా ఉంచడంతో చర్చ
- దీనిపై ఉన్నతాధికారులను ప్రశ్నించిన సీఎంవో
- చైర్మన్ పీపీపీని అడ్డుకుంటున్నారని సీఎంకు సెక్రటరీ అజయ్ జైన్ ఫిర్యాదు
- ఇక్కడి వ్యవహారాలను పీ4 చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన బాలాజీ
- సీఎం వద్దకు విషయం.. టెండర్లు, బిడ్లను పరిశీలించాలని సీఎంవోకు ఆదేశం
పర్యాటకశాఖ ఆస్తుల పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. విజయవాడ డివిజన్‌లోని యూనిట్లకు ఇటీవల టెండర్లు ఆహ్వానిస్తే ప్రముఖ సంస్థలు ముఖం చాటేశాయి. ఎటువంటి అర్హతలు లేని ఒకే ఒక్క సంస్థ మాత్రం బిడ్‌ను దాఖలు చేసింది. ఈ విషయం రహస్యంగా ఉంచడంతో చర్చకు దారితీసింది. దీనిపై ఉన్నతాధికారులను సీఎంవో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో చైర్మన్ ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్యదర్శి అజయ్ జైన్ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి వ్యవహారాలను చైర్మన్ బాలాజీ పీ4 చైర్మన్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన టెండర్లు, బిడ్లను పరిశీలించాలని సీఎంవోను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ డివిజన్ పరిధిలోని పర్యాటక ఆస్తులను పీపీపీ (పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు)కి ఇవ్వాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో టెండర్లు దక్కించుకునేందుకు అర్హత కలిగిన సంస్థలు ఒక్కటి కూడా ముందుకు రావటంలేదని తెలిసింది. హరిత బెర్మ్‌పార్క్, భవానీ ఐల్యాండ్ , బాపట్ల సూర్యలంక బీచ్ రిసార్ట్స్, నాగార్జున సాగర్ రిసార్ట్స్‌ల క్లస్టర్‌కు పడిన ఒకే ఒక్క బిడ్ కూడా అర్హతలు లేని సంస్థ వేసిందన్న సంగతి వెలుగు చూసింది. ఇతర రాష్ర్టాల్లో పనిచేసిన అనుభవం కూడా లేని సంస్థ బిడ్‌ను వేసినట్టు సమాచారం. ఈ సంస్థకు తగిన ఆర్థిక పరిస్థితి కూడా లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవరు టెండర్లు వేశారన్నది కూడా ఏపీటీడీసీ అధికారులు రహస్యంగా ఉంచారు. ఈ బిడ్‌ల వ్యవహారం వివాదాస్పదం కావటంతో తాజాగా సీఎంవో కార్యాలయం ఆరా తీయటంతో అర్హతలు లేని సంస్థ బిడ్లు వేసినట్టుగా తెలిసింది. దీనిపై సీఎంవో కార్యాలయం పర్యాటక శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై ఏం చేయాలో తెలియక పర్యాటక శాఖ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నగరంలోని మినర్వా, లెమన్ ట్రీ, స్టెర్లింగ్స్ అనే సంస్థలను బిడ్లు వేయాల్సిందిగా ఓ ఉన్నతాధికారి వారికి ఫోన్లు చేసి బతిమిలాడుతున్నట్టు సమాచారం. సీఎంవో కార్యాలయానికి వెళ్లే వరకు కూడా ఈ వ్యవహారాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఏపీటీడీసీ చైర్మన్‌పై సీఎంకు ఫిర్యాదు :
ఏపీటీడీసీ చైర్మన్ బాలాజీపై రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక కార్యదర్శి అజయ్ జైన్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పర్యాటక యూనిట్ల పీపీపీకి సంబంధించి ఔత్సాహిక సంస్థలను రానీయకుండా ఆయన అడ్డుకుంటున్నారని ఆరోపించినట్టు తెలిసింది.
కుటుంబరావును కలిసిన బాలాజీ
తనపై సీఎం చంద్రబాబుకు అజయ్ జైన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ రాష్ట్ర ప్రభుత్వ పీ4 చైర్మన్ కుటుంబరావును కలిసినట్టు తెలిసింది. పర్యాటక యూనిట్లను అజయ్ జైన్ బలవంతంగా పీపీపీ చేయాలని చూస్తున్నారని చెప్పినట్టు సమాచారం. లాభదాయకంగా మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉన్న పర్యాటక యూనిట్లను పీపీపీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, బలవంతంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన కుటుంబరావు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని బాలాజీకి చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత సీఎంతో ఆయన మాట్లాడినట్టు తెలిసింది. స్పందించిన చంద్రబాబు అసలేం జరుగుతుందో ఆరా తీయమని సీఎంవో కార్యాలయ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు టెండర్లను ఎలా పిలిచారు? నిబంధనలు ఏమిటి? బిడ్లు వేసిన సంస్థలు, వాటి అర్హతల పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారని సమాచారం. టెండర్ల విధానం బాగానే ఉన్నా.. బిడ్లు వేసిన సంస్థలు అర్హతలు కలిగినవి కాదని గుర్తించి వాటి గురించి ప్రశ్నించినట్టు తెలిసింది.
లాభయదాయక యూనిట్ల పీపీపీని వ్యతిరేకిస్తున్న చైర్మన్, ఎండీ!
పర్యాటక యూనిట్ల పీపీపీపై రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్ చూపిస్తున్న అత్యుత్సాహం ఏపీటీడీసీలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందని తెలిసింది. కొత్తగా అభివృద్ధి చేయాలనుకున్న వాటిని పీపీపీ కిందకు తీసుకు రావాలి కానీ, లాభదాయక యూనిట్లను పీపీపీకి అప్పగించాల్సిన అవసరం ఏముందని అభిప్రాయపడుతున్నారని సమాచారం. లాభయదాయక యూనిట్ల పీపీపీని ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, చైర్మన్ బాలాజీలు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది.