పర్యాటకం భ్రమే!
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:38 AM
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. దశాబ్దాలుగా బీచ్‌ను అభివృద్ధి చేస్తామని పాలకులు, అధికారులు చెప్పడమే తప్ప చేసింది శూన్యం. కనీస సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన మసులాబీచ్ ఫెస్టివల్ తర్వాత ఇక్కడి పరిస్థితులు మారతాయని భావించారు. ఈ వేడుక ముగిసిన అనంతరం మళ్లీ యథాస్థితికి బీచ్ వచ్చింది. అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణకు నోచుకోవడంలేదు. దీంతో పర్యాటకం అంతా భ్రమేనంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- మంగినపూడి బీచ్‌లో కనీస సౌకర్యాలు కరువు
- పర్యాటకులు లేక వెలవెలబోతున్న బీచ్ పరిసరాలు
- దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రముఖ పర్యాటక ప్రాంతం
- మసులా బీచ్ ఫెస్టివల్ తర్వాత కూడా మారని పరిస్థితి
- స్టార్ హోటల్స్ నిర్మాణానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చినా భూ కేటాయింపుల్లో జాప్యం
- అధికారుల తీరుపై వ్యక్తమవుతున్న విమర్శలు
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. దశాబ్దాలుగా బీచ్‌ను అభివృద్ధి చేస్తామని పాలకులు, అధికారులు చెప్పడమే తప్ప చేసింది శూన్యం. కనీస సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన మసులాబీచ్ ఫెస్టివల్ తర్వాత ఇక్కడి పరిస్థితులు మారతాయని భావించారు. ఈ వేడుక ముగిసిన అనంతరం మళ్లీ యథాస్థితికి బీచ్ వచ్చింది. అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణకు నోచుకోవడంలేదు. దీంతో పర్యాటకం అంతా భ్రమేనంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుదామని వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. సముద్రపు అలలు ఎగసిపడుతున్న తీరును కూర్చుని ఆశ్వాదించేందుకు ఒక్క కుర్చీ కూడా ఇక్కడ కనిపించదు. ఆకలి వేస్తే తినేందుకు సరైన ఆహార పదార్థాలు సైతం లభించవు. సముద్ర స్నానం చేసిన తర్వాత మహిళలు దుస్తులు మార్చుకునేందుకు కనీస ఏర్పాట్లు కూడా లేవు. దీంతో సముద్ర స్నానాలకు అత్యంత సురక్షితమైన ప్రాంతంగా ఉన్నా కూడా పర్యాటకులు లేక వెలవెలబోతోంది. ఏడాదిన్నర క్రితం పర్యాటకులకు నీడ కల్పించేందుకు బీచ్‌లో విశాఖపట్నం నుంచి తీసుకువచ్చిన 300లకుపైగా కొబ్బరి చెట్లను నాటారు. వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. ఎండిన చెట్లను తొలగించే పనులు కూడా చేయకుండా పర్యాటకశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు దగ్గరలో మంగినపూడి బీచ్ ఉంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు బీచ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరుతున్నారు.
పర్యాటకశాఖ పట్టించుకునేనా!
బందరు పోర్టు అభివృద్ధి చెందితే వ్యాపారులు, ఇతరత్రా సంస్థల వారు ఇక్కడకు రావడం ఖాయం. వివిధ పనులపై వచ్చేవారికి ఆహ్లాదాన్ని పంచేందుకు స్టార్ హోటల్స్ యజమానులు మంగినపూడి బీచ్ సమీపంలో త్రీస్ఠార్, ఫైవ్‌స్టార్ హోటల్స్ నిర్మాణం చేస్తామనే ప్రతిపాదనలతో ముందుకు వచ్చారు. తమకు భూములు కేటాయిస్తే రూ.150 కోట్ల పెట్టుబడితో ఇక్కడ స్టార్ హోటల్స్ నిర్మిస్తామని ప్రతిపాదనలు కూడా పెట్టారు. వన్‌స్టార్, ఒబెరాయ్ వంటి సంస్థలు ముందుకు వచ్చి 100 ఎకరాల భూమిని కేటాయించాలని కోరాయి. ఈ ప్రతిపాదనలపై రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులు పలుమార్లు కలెక్టర్‌తో సమావేశాలు కూడా నిర్వహించారు. మంగినపూడి బీచ్ ఎదురుగా 80 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. 20 సంవత్సరాల క్రితం రీసార్ట్‌ల నిర్మాణానికి ఈ భూమిని కేటాయించారు. భూమిని తీసుకున్న రీసార్ట్‌ల నిర్వాహకులు పెద్ద ఎత్తున భవనాలు నిర్మించి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా, నామమాత్రంగా రెండు, మూడు భవనాలు నిర్మించి మమ అనిపించారు. ఈ రీసార్ట్‌ల్లో పర్యాటకులను ఆకర్షించే విధంగా సౌకర్యాలు లేకపోగా, వేరే కార్యకలాపాలకు ఆవాసంగా మారాయి. దీంతో అటు వైపునకు వెళ్లాలంటేనే పర్యాటకులు జంకుతున్నారు. దీంతో ఈ రీసార్ట్‌లు నామమాత్రంగానే ఉండి పోయాయి. ఏడాదిన్నర క్రితం ఒబెరాయ్, వన్‌స్టార్ వంటి సంస్థల ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని బీచ్ ఎదురుగా ఉన్న 80 ఎకరాలతో పాటు సత్రవపాలెంలోని ప్రభుత్వ భూములను అధికారులు సర్వే చేయించారు. ఇక్కడ హోటల్స్ నిర్మాణానికి భూములు కేటాయించే ప్రతిపాదనలు తయారు చేసినా, ప్రభుత్వ ఆమోదం కోసం పంపకుండా జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపితే, కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించిన అనంతరం కేబినెట్ సమావేశంలో భూముల కేటాయింపునకు ఆమోదం తెలపాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆలోచన బాగున్నా..
ఈ ఏడాది జూలైలో నిర్వహించిన మసులాబీచ్ ఫెస్టివల్ సందర్భంగా మచిలీపట్నం వచ్చిన అర్జ్జున అవార్డు గ్రహీతలు, వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులతో మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ చైర్మన్ రవినాయుడు, కలెక్టర్ బాలాజీ మాట్లాడారు. మంగినపూడి బీచ్, గిలకలదిండి హార్బర్ తదితర ప్రాంతాల్లో బీచ్ కబడ్డీ పోటీలు, జలక్రీడలు, కయాకింగ్ పోటీల నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్రీడాకారులకు కోచింగ్ ఇచ్చేందుకు ఎలాంటి సౌకార్యలు కల్పించాలి, అందుకు అవసరమైన భూమి, నిధుల కేటాయింపు తదితర అంశాలపై కూడా మాట్లాడారు. మచిలీపట్నంలో బీచ్ కబడ్డీ, ఇతర క్రీడలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై పూర్తిస్థాయి నివేదికను తయారు చేసి ఇస్తామని క్రీడా నిపుణులు అప్పట్లో తెలిపారు. ముందుగా మంగినపూడి బీచ్‌ను పర్యాటకులకు ఆహ్లాదం పంచేలా అభివృద్ధి చేస్తే వివిధ క్రీడలను ఇక్కడ నిర్వహించేందుకు అవకాశాలు మెరుగవుతాయని పర్యాటకులు అంటున్నారు.