AP CM Chandrababu: పర్యాటకానికి తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:19 AM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూ కేటాయింపుల్లో పర్యాటక శాఖకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
కంపెనీలకు భూ కేటాయింపులపై సీఎం దిశానిర్దేశం
భూ కేటాయింపుల్లో కలెక్టర్లు చొరవ తీసుకోవాలి
విజయవాడ, విశాఖలో భూ వివాదాలపై ట్రైబ్యునల్
ఏర్పాటు చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూ కేటాయింపుల్లో పర్యాటక శాఖకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. టూరిజం తర్వాత ఐటీ కంపెనీలకు భూములు ఇవ్వాలన్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలకు భూముల కేటాయింపు అంశంపై కలెక్టర్ల సదస్సులో సీఎం సమీక్షించారు. ఏపీఐఐసీలో ఏ మేరకు భూమి అందుబాటులో ఉందనే అంశం చర్చకు వచ్చినప్పుడు.. ఏపీఐఐసీకి చెందిన సుమారు 82 వేల ఎకరాలు 22ఏ పరిధిలోకి వెళ్లాయని అధికారులు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుంటే ఆ భూములను 22ఏ పరిధి నుంచి తప్పించేందుకు క్యాబినెట్ సమావేశానికి తీసుకురావాలని సూచించారు. ఆయా జిల్లాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘‘గడిచిన 18 నెలల్లో రూ. 8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీలో ఆమోదం తెలిపాం. వీటికి సంబంధించిన ప్రాజెక్టుల్లో కొన్ని సివిల్ పనులు కూడా మొదలయ్యాయి. భూ కేటాయింపులకు సంబంధించిన అంశాల్లో కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. విజయవాడ, విశాఖపట్నంలోని భూ వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయండి. ర్యాంప్ పథకంలో ఎంఎస్ఎంఈల వృద్ధిని నమోదు చేయండి. ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యాన్ని సాధించేందుకు ఎంఎస్ఎంఈలతో సమావేశాలు ఏర్పాటు చేయండి. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి చేయండి. అసైన్డ్ భూములకు కూడా రూ. 31 వేలు లీజు చెల్లించండి.
నెడ్‌క్యాప్ ద్వారా ఈ భూములు లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో మంచి విద్యాసంస్థలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. హోటళ్లు, టూరిజం ప్రాజెక్టులు పెద్దఎత్తున చేపట్టేలా చర్యలు తీసుకోండి’ అని చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ టూరిజం అభివృద్ధికి రూపొందించిన ప్రణాళిలకపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖలో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు వండర్‌లా, తిరుపతిలో ఇమాజికా వరల్డ్ థీమ్ పార్క్ ఏర్పాటుకు ముందకువచ్చాయని తెలిపారు. వండర్‌లా విశాఖలో 50 ఎకరాలు, ఇమాజికా వరల్డ్‌కు తిరుపతిలో 20 ఎకరాలు అవసరమన్నారు. టూరిజం ప్రాజెక్టులకు భూ కేటాయింపులపై ఎదురవుతున్న సమస్యల గురించి ప్రస్తావించారు. టూరిజం కోసం ఇచ్చిన భూములను తిరిగి ఇతర శాఖలకు కేటాయించిన సందర్భాలు ఉన్నాయన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భూ కేటాయింపుల్లో టూరిజానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మొదట బస, తర్వాత పని అన్నట్లు భూ కేటాయింపులు ఉండాలని సూచించారు. హోటళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం గేమ్‌ఛేంజర్ అవుతుందన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వాలి
ఫుడ్ ప్రాసెసింగ్‌లో కనీసం రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈరంగంలో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమైతే.. 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయని, ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా డ్వాక్రా గ్రూపులను ప్రోత్సహించాలని కలెక్టర్లను ఆదేశించారు. తాను దావోస్‌కు వెళ్లే ముందే విశాఖ సదస్సుకు సంబంధించిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ప్రక్రియ మొదలు కావాలన్నారు. 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈ ప్రాజెక్టులను ప్రారంభించేలా మంత్రులు, కలెక్టర్లు కలిసి కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు భూములిచ్చేవారు కూడా సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సేవల రంగం కూడా మరింత అభివృద్ధి చెందాలన్నారు. గిగ్ వర్కర్ల కోసం సదుపాయాలు కల్పించేలా కలెక్టర్లు కృషి చేయాలని కోరారు. నైపుణ్యాలను పెంపొందించి యువతకు ఉద్యోగాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారకానికి మచిలీపట్నంలో రెండెకరాల భూమిని కేటాయించాలని సీఎం ఆదేశించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు సమీపంలో టౌన్‌షిప్ అభివృద్ధి చేయాలన్నారు. కాగా, పెట్టుబడుల ప్రతిపాదనలపై పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో సంపద సృష్టితోపాటు నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు నెల రోజుల్లో శంకుస్థాపనలు చేయాలని కలెక్టర్లను కోరారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ. 13.26 లక్షల కోట్ల విలువైన 538 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో ఆయా ప్రాజెక్టులను గ్రౌండ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.