Totapuri Farmers: తోతాపురి కిలో రూ.ఐదే
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:45 AM
తోతాపురి రకం మామిడి కాయలకు కిలోకు రూ.4 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో కలిపి కిలో రూ.12 మద్దతు ధర రైతులకు అందాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఆదేశించినా దక్కని మద్దతు ధర
రూ.12 ఇవ్వలేమంటున్న ఫ్యాక్టరీలు
పెరిగిన దిగుబడి, తగ్గిన డిమాండే కారణం
ఇప్పటికే ఫ్యాక్టరీల్లో మగ్గుతున్న 40 వేల టన్నుల పల్ప్
చిత్తూరు, జూన్ 19(ఆంధ్రజ్యోతి): తోతాపురి రకం మామిడి కాయలకు కిలోకు రూ.4 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో కలిపి కిలో రూ.12 మద్దతు ధర రైతులకు అందాలని స్పష్టం చేసింది. అయినా ఫ్యాక్టరీ యాజమాన్యాలు కిలో రూ.5కు మించి కొనడం లేదు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా రైతులకు మద్దతు ధర ఇప్పించలేకపోతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులోని కృష్ణగిరిలో కిలో రూ.4కే కాయలు లభిస్తున్నప్పుడు ఇక్కడ రూ.8 ఎందుకివ్వాలని ఫ్యాక్టరీలు ప్రశ్నిస్తున్నాయి. ‘మా అవసరాన్ని బట్టి కాయలు కొంటాం. కచ్చితంగా ఈ ధరకే కొనాలంటే ఎలా?’ అని అంటున్నాయి. చాలా ఫ్యాక్టరీలు కిలోకు రూ.5 మాత్రమే ఇస్తున్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు రూ.నాలుగే ఇస్తున్నాయి. ర్యాంపులు, మండీల్లో కిలోకు రూ.నాలుగే ఇస్తూ.. అందులోనూ కమీషన్ లాగేస్తున్నారు. దీంతో రైతులు ర్యాంపులకు వెళ్లడం లేదు. ఫ్యాక్టరీల ఎదుట ట్రాక్టర్ల లోడ్లతో రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఫ్యాక్టరీలు కూడా రోజుకు వందకు మించి టోకెన్లు ఇవ్వడం లేదు.
మద్దతు ధర అమలుకు యంత్రాంగం కృషి
ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్దతు ధర అమలు చేసేందుకు కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఫ్యాక్టరీల వద్ద అధికారుల బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. సబ్సిడీ రూ.4 అందించేందుకు రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. కలెక్టర్ స్వయంగా రోజుకు నాలుగు ఫ్యాక్టరీలు పరిశీలిస్తున్నారు. మాట వినని తవణంపల్లె మండలంలోని ఓ ఫ్యాక్టరీని మూసేయించారు. మరో మూడు ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నోటీసులు ఇప్పించారు. అధికారులు ఎంత కృషి చేసినా కిలోకు రూ.5కు మించి ఇవ్వలేమని ఫ్యాక్టరీలు తెగేసి చెప్తున్నాయి. ఒకట్రెండు మాత్రం రూ.6 ఇస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాల్లో రూ.నాలుగే!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 50 వేల హెక్టార్లలో తోతాపురి రకం మామిడి సాగవుతోంది. ఈ ఏడాది 5.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా వేస్తున్నారు. అందులో 4.8లక్షల టన్నుల దిగుబడి చిత్తూరు కొత్త జిల్లా నుంచే ఉంది. జిల్లాతోపాటు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ దిగుబడి అధికంగా వచ్చింది. దీంతో పొరుగు రాష్ట్రాల్లో కిలో రూ.4కే ఫ్యాక్టరీలు కొంటున్నాయి.
తగ్గిన డిమాండ్
ఉమ్మడి జిల్లాలో 41 పల్ప్ ఫ్యాక్టరీలుండగా.. 35 ఫ్యాక్టరీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. 28 ఫ్యాక్టరీలు మామిడి కొనుగోళ్లు ప్రారంభించాయి. అలాగే 39 ర్యాంపుల్లో.. 21చోట్ల కొనుగోళ్లు ప్రారంభించాయి. ప్రస్తుతం మామిడి ఉత్పత్తుల వినియోగం బాగా తగ్గిపోవంతో ఫ్యాక్టరీలు తయారుచేస్తున్న పల్ప్ ఎగుమతి కావడం లేదు. 2023, 2024 సంవత్సరాల్లో తయారుచేసిన పల్ప్ జిల్లాలోని ఫ్యాక్టరీల్లో సుమారు 40వేల టన్నుల వరకూ ఉండిపోయింది.
2018లోనూ ఇదే పరిస్థితి
సీఎం చంద్రబాబుకు జిల్లా పరిస్థితులపై, మామిడి రైతుల కష్టాలపై పూర్తి అవగాహన ఉంది. 2018లోనూ దిగుబడి అధికంగా వచ్చి ధర విషయంలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అప్పుడు రైతులకు రూ.2.5 సబ్సిడీ ఇచ్చిన ఆయన, ఇప్పుడు రూ.4 సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించారు.
ఐదేళ్లూ.. పట్టించుకోని వైసీపీ
2019లో వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. 2020, 21లో కరోనా కారణంగా మామిడి ఎగుమతులు లేవు. 2022లో దిగుబడి సరిగా లేదు. 2023లో దిగుబడి బాగున్నా, ఫ్యాక్టరీలు సిండికేట్‌గా మారి రైతులకు మద్దతు ధర ఇవ్వలేదు. ఈ రకంగా వైసీపీ ఐదేళ్ల పాలనలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కేంద్రంతో మాట్లాడి ఈ ప్రాంతంలో మామిడి బోర్డు ఏర్పాటుచేస్తే చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.