IAS Officer Scandal: ఓ ఐఏఎస్ దుర్మార్గం
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:47 AM
ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి! హైదరాబాద్‌లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అందులోనూ అనుమానాలు, గొడవలు! అది కాస్తా ఘర్షణకు దారి తీసింది.
హైదరాబాద్‌లో వివాహేతర సంబంధం
అనుమానంతో ఆమెను కొట్టిన అధికారి!
తీవ్రంగా గాయపడి ఆ మహిళ మృతి
పోలీసు కేసు కాకుండా గోల్‌మాల్
ఏమీ ఎరగనట్లుగా విజయవాడకు వచ్చి విధులు
అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి! హైదరాబాద్‌లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అందులోనూ అనుమానాలు, గొడవలు! అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఆ మహిళను కొట్టడం, తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె మరణించింది. అయితే... ఆయన తన పలుకుబడినంతా ఉపయోగించి... పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవీ ఆ వివరాలు... ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకప్పుడు సౌమ్యుడు, మంచివాడే! ఇప్పటికీ పైకి చూడటానికి అలాగే కనిపిస్తారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆయన గతంలో ఒక ముఖ్యమంత్రి పేషీలో కూడా పని చేశారు. జగన్ హయాంలో ఒక కీలకమైన శాఖకు ఆయన అధిపతిగా వ్యవహరించారు. అప్పట్లో జగన్ చెప్పినట్టల్లా చేశారు. దీంతో ఆ అధికారికీ తేరగా, భారీగా డబ్బులు వచ్చి పడ్డాయి. డబ్బుతోపాటు కొన్ని అవలక్షణాలూ వంటబట్టాయి. దీంతో... ఐదు పదుల వయసు దాటిన ఆ ఐఏఎస్ అధికారి పక్కదారి పట్టారు. సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ... హైదరాబాద్‌లో మరో మహిళతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. వీలైనంత ఎక్కువగా హైదరాబాద్‌లోనే మకాం! కొద్దికాలం ఇదంతా బాగానే నడిచింది. అయితే... ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అది కొంత తీవ్రమైన సమస్యే అయినప్పటికీ... ఖరీదైన చికిత్స చేయించుకోవడంతో కోలుకున్నారు. అయితే... తనకు ఆరోగ్యం బాగలేని సమయంలో ఆ మహిళ తనను కాదని, మరొకరితో సన్నిహితంగా ఉంటోందని ఆయనకు అనుమానం వచ్చింది.
ఒక్కసారి అనుమానం వచ్చిన తర్వాత ఆగదు కదా! అది గొడవలకు దారి తీసింది. గత శుక్రవారం ఈ సీనియర్ ఐఏఎస్‌కు, ఆ మహిళకు మధ్య మాటామాటా పెరిగింది. ఘర్షణ స్థాయికి చేరింది. కోపం ఆపుకోలేని ఆ అధికారి... శక్తినంతా కూడగట్టుకుని ఆ మహిళను బలంగా కొట్టారు. తల గోడకు తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో సదరు ఐఏఎ్‌సలో వణుకు మొదలైంది. సమీపంలోనే ఉన్న ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే...ఆమె మరణించింది.ఆమె మృతికి అసలు కారణం చెప్పకుండా... ‘ప్రమాదవశాత్తూ కిందపడటం వల్ల తగిలిన గాయం’ (ఫాలెన్ డౌన్) అని ఆస్పత్రి రికార్డుల్లో రాయించారు. తన పలుకుబడి మొత్తంగా ఉపయోగించి... అసలు విషయం బయటికి రాకుండా, పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకున్నారు. అక్కడేమీ జరగనట్లుగా విజయవాడ వచ్చేసి... తన పని తాను చేసుకుంటున్నారు. కానీ... ఆయన వ్యవహారాలు కొందరు ఐఏఎస్‌లకు ఇప్పటికే తెలుసు. నిజం దాచినంత మాత్రాన దాగదు కదా! హైదరాబాద్‌లో జరిగిన దారుణం గురించి ఆయన సన్నిహితులు కొందరికి తెలిసిపోయిందని సమాచారం!