Kakinada: పంటి నొప్పి అని వెళ్తే ప్రాణమే పోయింది
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:39 AM
పిప్పి పళ్ల నొప్పి భరించలేక ఆస్పత్రికి వచ్చిన మహిళ... దంత వైద్యురాలి నిర్వాకంతో ఏకంగా ప్రాణాన్నే కోల్పోవాల్సి వచ్చింది. కాకినాడ జిల్లా రూరల్ మండలం రమణయ్యపేట శివారు గైగోలుపాడుకు చెందిన...
వివాహితకు ఒకేసారి 6 పిప్పి పళ్లు తొలగింపు
తీవ్ర రక్తస్రావంతో బ్రెయిన్ డెడ్
కాకినాడ జిల్లా సర్పవరంలో ఘటన
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పిప్పి పళ్ల నొప్పి భరించలేక ఆస్పత్రికి వచ్చిన మహిళ... దంత వైద్యురాలి నిర్వాకంతో ఏకంగా ప్రాణాన్నే కోల్పోవాల్సి వచ్చింది. కాకినాడ జిల్లా రూరల్ మండలం రమణయ్యపేట శివారు గైగోలుపాడుకు చెందిన మేడిశెట్టి దుర్గాభవానీ (38) పిప్పి పన్ను నొప్పితో గత నెల 30వ తేదీ రాత్రి సర్పవరం జంక్షన్‌లోని గోదావరి డెంటల్ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యురాలు సంధ్యారాణి ఆరు పళ్లకు ఇంజెక్షన్లు ఇచ్చి, వాటిని ఒకేసారి తొలగించారు. అక్కడ కాటన్ పెట్టి అదేరోజు రాత్రి ఇంటికి పంపేశారు. ఇంటికెళ్లిన తర్వాత పళ్ల నుంచి రక్తం కారడం, వాంతులు అవ్వడంతో వైద్యురాలికి పలుమార్లు ఫోన్ చేశారు. ఆమె స్పందించకపోవడంతో దుర్గాభవానీని అర్ధరాత్రి సమయంలో స్థానిక ట్రస్ట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ మూడు రోజులు చికిత్స పొందిన దుర్గాభవానీ మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో డాక్టర్లు పలు వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు బోన్‌మ్యారో క్యాన్సర్ ఉందని, మెదడులో తీవ్ర రక్తస్రావమైందని గుర్తించారు. ఆ తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. అయితే సోమవారం రాత్రి కూడా తనతో మాట్లాడిన భార్యకు మంగళవారం ఉదయానికల్లా సీరియస్ అయి ప్రాణాలు కోల్పోయిందని చెప్పడంపై ఆమె భర్త వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్యాన్సర్ ఉన్న సంగతి తమకు తెలీదని.. అయినా ఒక్కరోజులోనే బ్రెయిన్ డెడ్ ఎలా అవుతుందో చెప్పాలని వైద్యులను నిలదీశాడు. తన భార్య చనిపోవడానికి కారణమైన దంత వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ట్రస్ట్ ఆస్పత్రి వైద్యులపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.