Education Collaboration: రాష్ట్రానికి టోక్యో వర్సిటీ బృందం
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:05 AM
ప్రపంచ ప్రఖ్యాత టోక్యో యూనివర్సిటీని రాష్ర్టానికి తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం ఆ విశ్వవిద్యాలయం బృందం విజయవాడ వచ్చింది.
భారత్‌లో క్యాంపస్ ఏర్పాటుకు ప్రయత్నాలు.. నేడు అమరావతికి
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత టోక్యో యూనివర్సిటీని రాష్ర్టానికి తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం ఆ విశ్వవిద్యాలయం బృందం విజయవాడ వచ్చింది. ఉన్నత విద్య, ఐటీ, సీఆర్‌డీఏ శాఖల అధికారులు వారితో ప్రాథమికంగా చర్చించారు. తమ అవసరాలను బృందం స్థానిక అధికారులకు వివరించింది. అమరావతిలో ఉన్న అవకాశాలను రాష్ట్ర అధికారులు ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. మంగళవారం అమరావతిలో ఆ బృందానికి భూమిని చూపించనున్నారు. ఇక్కడ కల్పించబోయే మౌలిక సదుపాయాలను అధికారులు వివరిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబుతో ఆ బృందం భేటీ అవుతుంది. ఈ చర్చల ఆధారంగా క్యాంపస్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ వర్సిటీ ప్రాంగణాన్ని ఎలాగైనా రాష్ర్టానికి తీసుకురావాలని అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టోక్యో వర్సిటీకి జపాన్‌లో తప్ప ప్రపంచంలో ఎక్కడా క్యాంప్‌సలు లేవు. మొదటిసారి ఇతర దేశాల్లో ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆ దేశం నిర్ణయించింది. అందులో భాగంగా భారత్‌లో వర్సిటీ బృందాలు పర్యటిస్తున్నాయి. మన దేశంలో అమరావతి, చెన్నై నగరాలను, గుజరాత్ రాష్ర్టాన్ని పరిశీలిస్తున్నారు. మన దేశంలోని యూనివర్సిటీల తరహాలో ఎక్కువ భూములు కూడా అవసరం లేదని టోక్యో వర్సిటీ ప్రతినిధులు చెప్పినట్లు తెలిసింది. 50 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన పెట్టారని సమాచారం. కాగా టోక్యో విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయిలో 25వ ర్యాంకులో కొనసాగుతోంది. టోక్యో వర్సిటీ క్యాంపస్ రాష్ర్టానికి వస్తే అది సువర్ణావకాశమే అవుతుంది.