MLA Kolikapudi Srinivasa Rao: చెప్పు తెగేవరకూ కొడతా
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:37 AM
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.శనివారం ఎ.కొండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో...
కృష్ణా జలాల సరఫరాపై పోస్టులు పెట్టినవారిపై ఆగ్రహం
ఆదివాసీ దినోత్సవంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు
ఎ.కొండూరు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.శనివారం ఎ.కొండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ,మండలంలోని కిడ్నీ ప్రభావిత గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేయడంలేదంటే చెప్పు తెగే వరకు కొడతా. నీటి సరఫరా ఒక యాప్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. నీటి సరఫరా జరగడంలేదనే వారిని చెప్పు తెగే వరకు కొడతా అన్నారు.గిరిజనుల కోసం కేటాయించిన 320 వ్యక్తిగత మరుగు దొడ్లు కట్టకుండా, కట్టించినట్టు పేర్కొని బిల్లులు తీసుకొన్నారు. కేంద్ర, రాష్ట్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మీ పేరుతో దోపిడి చేస్తున్న వారి పక్కన తిరగడానికి మీకు (గిరిజనులకు) సిగ్గు ఉండాలి’ అని ఎమ్మెల్యే అన్నారు.
ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకోవాలి: సీపీఎం
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ‘చెప్పు తెగేవరకూ కొడతా’ అని మాట్లాడటం దుర్మార్గమైన చర్య అని సీపీఎం మండలి కార్యదర్శి పానెం ఆనందరావు అన్నారు. చీమలపాడులో ఆయన మాట్లాడారు.‘ఈ నెల 6న సీపీఎం గిరిజన తండాల్లో పర్యటించింది.ఆ సందర్భంగా అక్కడ ప్రజలు వారం రోజులుగా నీరు రావడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని 7న అధికార్ల దృష్టికి తీసుకొని వెళ్లాం.ఇబ్రహీంపట్నం సంపు వద్ద నుంచి కుదపకు నీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. సమస్యను పూర్తిగా తెలుసుకోకుండా ఎమ్మెల్యే విచక్షణ కోల్పోయి మాట్లాడటం తగదు.గతంలో కూడ ఆయన అనేకసార్లు దురుసు ప్రవర్తన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైన ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవాలి’ అని ఆనందరావు అన్నారు.