Tirupparankundram Rock Pillar: దీప స్తంభమా? సర్వే రాయా?
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:09 AM
తమిళుల ఆరాధ్య దైవం మురుగప్పెరుమాన్ (సుబ్రహ్మణ్యస్వామి) కొలువై ఉన్న ఆరు దివ్యక్షేత్రాల్లో మొదటిది తిరుప్పరంకుండ్రం.
‘తిరుప్పరంకుండ్రం’ ఆలయ రాతి స్తంభం కేంద్రంగా తమిళనాడులో రేగిన వివాదం
అక్కడ కార్తీక దీపం వెలిగించేందుకు పలు హిందూ సంస్థల ప్రయత్నాలు
అది సర్వే రాయి అంటున్న రాష్ట్ర ప్రభుత్వం
శతాబ్దాలుగా మతసామరస్యం వర్ధిల్లుతున్న ప్రాంతంలో చర్చకు దారితీసిన రగడ
దర్గా వద్ద ‘జంతుబలి’తో వివాదం ప్రారంభం
(చెన్నై - ఆంధ్రజ్యోతి)
తమిళుల ఆరాధ్య దైవం మురుగప్పెరుమాన్ (సుబ్రహ్మణ్యస్వామి) కొలువై ఉన్న ఆరు దివ్యక్షేత్రాల్లో మొదటిది తిరుప్పరంకుండ్రం. ఈ పర్వతాలయం మదురై నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ‘పరంకుండ్రు’ అని పిలిచేవారని తమిళ ‘సంగ’ సాహిత్యం పేర్కొంటోంది. ఈ శైవాలయాన్ని పాండ్యరాజులు క్రీ.శ. 10వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరించారు. ఈ పర్వతం ఎత్తు 300 మీటర్లు. ఇక్కడ 2 వేల ఏళ్ల క్రితం జైనులు ఆశ్రమాలు ఏర్పరచుకొన్నట్లు శాసనాలు, శిల్పాలు చెబుతున్నాయి. సర్వతంపై, సమీపాల్లో పలు ఆలయాలతో పాటు పర్వతం మధ్యలో ఓ దర్గా ఉంది. ఈ పర్వతం అనాది నుంచి మత సామరస్యాన్ని చాటుతోంది.
వివాదం ఎక్కడ ప్రారంభమైంది?
అక్కడున్న ఓ రాతి స్తంభంపై వివాదం గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైంది. విరుదునగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దర్గాలో మొక్కుబడి బలి ఇచ్చేందుకు కొండపైకి ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకొని, దర్గా భక్తుల హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ జనవరి 5న రాస్తారోకో చేపట్టింది. అదే సమయంలో ‘కందర్ మలై’ని ‘సికందర్‌మలై’గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో పోలీసుల వైఖరికి నిరసనగా జనవరి 8న దర్గాలో మాంసాహార విందు ఇచ్చి తీరుతామంటూ ఎస్‌డీపీఐ ప్రకటించింది. దర్గా వద్ద జంతుబలిని నిషేధించాలని హిందూ సంస్థల నేతలు, దర్గా ఉన్న 50 సెంట్ల భూమి వక్ఫ్ బోర్డుకు చెందినందున అక్కడ వంట చేసుకోవడంలో తప్పు లేదని ముస్లిం నేతలు ప్రకటనలు చేశారు. ఆ తర్వాత కొందరు ముస్లింలు బిర్యానీ తింటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో మరింత వివాదం రేపింది.
న్యాయస్థానాల్లో భారీగా పిటిషన్లు
వివాదంపై హిందూ మక్కల్ కట్చి, హిందూ మున్నని వంటి సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దర్గాకు దారి తీసే ప్రాంతమైన నెల్లితోపు వద్ద ముస్లింల ప్రార్థనలను నిషేధించాలని, కొండపై జంతుబలిని నిషేధించాలని కొంత మంది కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎస్.శ్రీమతి, జస్టిస్ నిషా భాను ధర్మాసనం భిన్న తీర్పులు ఇచ్చింది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో జంతుబలి చేపట్టాలన్నా, నమాజ్ చేసుకోవాలన్నా సివిల్ కోర్టు అనుమతి తప్పనిసరి అని జస్టిస్ శ్రీమతి పేర్కొన్నారు. జస్టిస్ నిషాభాను మాత్రం పిటిషన్లను కొట్టివేశారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఆర్.విజయకుమార్ తీర్పు కీలకంగా మారింది. కొండపైకి అనుమతి లేకుండా జంతువులను తీసుకెళ్లడం, బలి ఇవ్వడాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దర్గా నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జూన్ 22న మదురైలో మఠాధిపతులు, జీయర్లు, శివాచార్యులు, బీజేపీ నేతలు ‘మురుగన్ సదస్సు’ నిర్వహించారు. ‘హిందూ తమిళర్ పేరవై’ నేత రామరవికుమార్ రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతించాలని కోరుతూ గత నెల హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్ స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశాలిచ్చారు. మరోవైపు తిరుప్పరంకుండ్రం మరో అయోధ్యగా మారనుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాగా, దీపస్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతించాలంటూ శనివారం 50 మంది ఇక్కడ నిరాహారదీక్ష చేపట్టారు.
దర్గాకు సమీపంలో రాతి స్తంభం
తిరుప్పరంకుండ్రం గర్భాలయానికి పైభాగాన ఉన్న ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏటా కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారు. 75 ఏళ్ల నుంచి ఇక్కడే దీపం వెలిగిస్తున్నట్లు రికార్డులున్నాయి. ఆ ఆలయం నుండి 200 అడుగుల ఎత్తులో 14వ శతాబ్దం నాటి దర్గా ఉంది. అక్కడి నుండి 200 అడుగుల దూరంలో ఒక రాతి స్తంభం ఉంది. దాన్నే ఆలయ ‘దీపస్తంభం’గా భావిస్తున్న హిందూ సంస్థలు.. దానిపై కార్తీక మహా దీపాన్ని వెలిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే 1802లో ఆంగ్లేయులు ‘గ్రేట్ ట్రిగోనామెట్రిక్ సర్వే’ జరిపినప్పుడు ఈ స్తంభం ఏర్పాటు చేసినట్లు పురావస్తుశాఖ రికార్డులు చెబుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఆంగ్లేయులు మదురై నగర మ్యాప్‌ను రూపొందించడానికి ఈ సర్వే రాయి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని ఉండొచ్చని పురావస్తుశాఖ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.