Women Empowerment Summit: తిరుపతిలో రేపటి నుంచి జాతీయ మహిళా సాధికార సదస్సు
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:26 AM
జాతీయ మహిళా సాధికార సదస్సుకు తిరుపతి ముస్తాబైంది. తిరుచానూరు సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో 14, 15 తేదీల్లో జరగనున్న సదస్సుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేసింది.
లోక్‌సభ స్పీకర్, గవర్నర్, సీఎం హాజరు
తిరుపతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జాతీయ మహిళా సాధికార సదస్సుకు తిరుపతి ముస్తాబైంది. తిరుచానూరు సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో 14, 15 తేదీల్లో జరగనున్న సదస్సుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు చొరవతో తిరుపతిలో ఈ సదస్సు నిర్వహించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మహిళల సాధికారత అంశమే ప్రధాన లక్ష్యంగా.. రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాలపై సదస్సులో చర్చించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల ప్రారంభ సదస్సుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వీరి ప్రసంగం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహిళా రాజకీయ ప్రాతినిథ్యంపై చర్చించనున్నారు. మఽధ్యాహ్నం భోజన అనంతరం ‘ఆర్థిక సాధికారత-పెరుగుతున్న అవకాశాలు’పై ప్యానల్ చర్చ ఉంటుంది. సాయంత్రం 5గంటలకు ‘నాయకత్వం, చట్టాల్లో మహిళల పాత్ర’పై వక్తలు ప్రసంగించనున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం చంద్రగిరి కోట వద్ద అతిథులు బస చేయనున్నారు. రెండో రోజైన సోమవారం జరిగే సదస్సులో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య భద్రత, తల్లి ఆరోగ్యంపై చర్చ, పాలనావ్యవస్థల్లో మహిళ పాత్ర.. విజేతల కథలు’పై ప్రజెంటేషన్ ఉంటుంది. దేశం నలుమూలల నుంచి 250 మందికిపైగా మహిళా ప్రతినిధులు తరలిరానున్నారు. ముగింపు సమావేశానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. అతిథులు తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది.
రేపు సీఎం చంద్రబాబు రాక
సీఎం చంద్రబాబు ఆదివారం విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో తిరుపతికి చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు శ్రీకన్వెన్షన్ సెంటర్‌లో విట్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు విశ్వనాథం మనవరాలి వివాహానికి హాజరవుతారు. అనంతరం జాతీయ మహిళ సాధికారత సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం.. తన ప్రసంగం అనంతరం తిరుగుప్రయాణం కానున్నట్టు సమాచారం.