No Helmet, No Petrol: బడుల్లో బోధనేతర పనులు బంనో హెల్మెట్.. నో పెట్రోల్..
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:19 AM
హెల్మెట్ ధరించడం ప్రతి ద్విచక్ర వాహనదారుడి బాధ్యత అని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. హెల్మెట్ లేకుంటే బంకుల్లో ....
తిరుపతిలో కలెక్టర్, ఎస్పీ అవగాహన ర్యాలీ
మంచి ఆలోచనంటూ ప్రశంసించిన సీఎం
తిరుపతి (నేరవిభాగం), అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): హెల్మెట్ ధరించడం ప్రతి ద్విచక్ర వాహనదారుడి బాధ్యత అని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. హెల్మెట్ లేకుంటే బంకుల్లో పెట్రోలు నింపరని స్పష్టం చేశారు. ప్రజలకు హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తూ కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా రిజర్వు పోలీసు గ్రౌండు నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. ఎస్పీ హెల్మెట్ ధరించి స్వయంగా వాహనం నడపగా.. కలెక్టర్ వెనక కూర్చున్నారు. కుటుంబ భవిష్యత్తు కోసం హెల్మెట్ ధరించాలని కలెక్టర్ సూచించారు. హెల్మెట్ ధరించడం పోలీసుల కోసం కాదని, అది మీ ప్రాణాల రక్షణ కోసమేనని ఎస్పీ స్పష్టం చేశారు.
మంచి ఆలోచన: సీఎం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ చేపట్టిన చర్యలు హర్షణీయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధనను తీసుకురావడం మంచి ఆలోచన అని అభిప్రాయపడ్డారు. కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మంచి సందేశాన్ని ఇచ్చారన్నారు.