Suspension: అమరావతిపై వ్యతిరేక పోస్టులు.. జీఎస్‌టీ అధికారిపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:10 AM
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఫేక్ ప్రచారం చేసిన తిరుపతి జీఎ్‌సటీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.సుభాష్ చంద్రబోస్‌పై సస్పెన్షన్ వేటుపడింది
ఆయన వివరణను తిరస్కరించిన ప్రభుత్వం
అమరావతి, తిరుపతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఫేక్ ప్రచారం చేసిన తిరుపతి జీఎ్‌సటీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.సుభాష్ చంద్రబోస్‌పై సస్పెన్షన్ వేటుపడింది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ గత నెల 19న ఆయన తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడమే కాకుండా.. ‘అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోలా?’ ‘ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం’.. అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు జోడించారు. ఈ పోస్టులు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆగస్టు 21న వివరణ కోరుతూ ప్రభుత్వం ఆయనకు మెమో జారీ చేసింది.
నా ఫేస్‌బుక్.. నా ఇష్టం..
ఈ నెల 3న బోస్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ‘నా ఫేస్‌బుక్ ఖాతా నా వ్యక్తిగతం. నేను ప్రభుత్వ ఉద్యోగినని ఆ ఖాతాలో ఎక్కడా పేర్కొనలేదు. అది నాది కాదని చెప్పొచ్చు. కానీ అలా చెప్పను. నేను ప్రభుత్వంపై ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టలేదు. పొరుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, చెన్నై, నగరాలు వర్షాలకు తరచూ మునిగిపోతున్నాయి. అలాగే, ఏపీ రాజధాని అమరావతి కూడా ముంపునకు గురైందన్నాను’ అని సమర్థించుకున్నారు. ‘ప్రధాని మోదీ కూడా తన ప్రభుత్వంపై విమర్శలు స్వాగతిస్తున్నారు. విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా పేర్కొంది’ అని వాదించారు. ఆయన వివరణను ప్రభుత్వం తిరస్కరించింది. ‘ఆ అధికారి ఆ వ్యంగ్య పోస్టులు తానే పెట్టినట్లు చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని వ్యక్తిగతమైనవిగా పరిగణించలేం. ఎందుకంటే ప్రజలందరికీ వాటిని చూసే అవకాశం ఉంటుంది.
ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిగా ఆయన వ్యాఖ్యలు ప్రజలను ప్రభావితం చేయగలవు’ అని పేర్కొంది. నిర్మాణాత్మక విమర్శలకు, కువిమర్శలకు తేడా ఉంటుందంటూ ఆయన వివరణను తోసిపుచ్చింది. ఏపీసీఎస్, సీసీఏ 1991, ఏపీ సివిల్ సర్వీసె్‌స(కండక్ట్) రూల్స్-1964 ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేస్తునట్లు ప్రకటించింది. ఈమేరకు వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై బోస్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని.. ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ.. తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. వాస్తవానికి సామాజిక స్పృహతో సామాజిక చైతన్యం కోసం సోషల్ మీడియాలో ఆలోచన రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం బోస్‌కు అలవాటని సమాచారం. అయితే అది హద్దులు దాటి తాను అధికారినన్న సంగతి మరచిపోయి ప్రభుత్వంపైనే వ్యతిరేక పోస్టులు పెట్టి సస్పెన్షన్‌కు గురయ్యారు.