Tirumala: రేపు వైకుంఠద్వార దర్శనాల ఈ-డిప్ కోటా విడుదల
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:50 AM
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలను తొలి మూడు రోజులకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ప్రక్రియ ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
డిసెంబరు 1 వరకు రిజిస్ర్టేషన్‌కు అవకాశం
తొలి మూడు రోజులూ ఉచిత దర్శనాలే
తిరుమల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలను తొలి మూడు రోజులకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ప్రక్రియ ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబరు 30, 31, జనవరి 1 తేదీల్లో వైకుంఠద్వార దర్శనాలను పూర్తి ఉచితంగా సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రోజుల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి సహా అన్ని ప్రత్యేక దర్శనాలనూ రద్దు చేశారు. టికెట్ల కోసం ఈ మూడు రోజులకు ఈసారి ఆన్‌లైన్‌లోనే తమ పేర్లను భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 27 గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ మొదలవుతుంది. డిసెంబరు 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులకు డిసెంబరు 2 మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు కేటాయిస్తారు.
ఆన్‌లైన్‌లో నమోదు ఇలా..
ఈ-డిప్ ద్వారా కేటాయించే టోకెన్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు వాట్సా్‌పలోని ఏపీ గవర్నమెంట్ బాట్‌లో కూడా రిజిస్ర్టేషన్ చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. 955023 00009 నెంబరుకు భక్తులు గోవిందా లేదా హాయ్ అని మెసెజ్ చేయాలి. ఎంచుకున్న భాషలో టీటీడీ టెంపుల్ సర్వీస్‌ను ఎంపిక చేస్తే వైకుంఠ ద్వార దర్శనం(డిప్) ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చు. తర్వాత 30, 31, 1వ తేదీల్లో కావాల్సిన తేదీని ఎంపిక చేసుకుని సబ్మిట్ చేయాలి.
మిగిలిన ఏడు రోజులూ నేరుగా దర్శనాలు
జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు. ఇవి గాకుండా ఈ రోజుల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 15 వేల చొప్పున డిసెంబరు 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతలకు రోజుకు వెయ్యి చొప్పున టికెట్లను విడుదల చేస్తారు.