Devotees Protests: తిరుమలలో శ్రీవాణి భక్తుల నిరసన
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:59 AM
శ్రీవాణి ట్రస్టు టికెట్లు జారీ చేయాల్సిందేనంటూ శనివారం తిరుమలలో భక్తులు నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్డుపై బైఠాయించి టికెట్లు ఇవ్వాలని డిమాండ్
తిరుమల, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): శ్రీవాణి ట్రస్టు టికెట్లు జారీ చేయాల్సిందేనంటూ శనివారం తిరుమలలో భక్తులు నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవాణి టికెట్ల కోసం కూడా భారీగా భక్తులు తిరుమలలోని అన్నమయ్య భవనం వద్దకు చేరుకున్నారు. రోజూ ఉదయం శ్రీవాణి టికెట్లు కేటాయించి సాయంత్రానికి దర్శనం చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రద్దీ అధికమైన క్రమంలో రాత్రి 11.30 గంటలకే టోకెన్లు జారీ ప్రారంభించి శనివారం వేకువజామున 2 గంటల వరకు టికెట్లు జారీ చేశారు. ఈ క్రమంలో 2.30 గంటల తర్వాత వచ్చిన భక్తులకు 800 టికెట్ల కోటా పూర్తయిందని, తిరిగి ఆదివారం రావాలంటూ సిబ్బంది సూచించారు. దీంతో ముందుగా టికెట్లు ఎలా కేటాయిస్తారని, తాము పిల్లలతో రోడ్లపై ఉన్నామంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల కోటా పెంపు సాధ్యం కాదని, అందరు సర్వదర్శనానికి వెళ్లాలంటూ భద్రతా సిబ్బంది సూచించడంతో కొంతమంది భక్తులు అన్నమయ్య భవనం ముందున్న రోడ్డుపై బైఠాయించి టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. విజిలెన్స్, పోలీసు అధికారులు బలవంతంగా వారిని పంపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సీఐ శ్రీరాముడు ఏదైనా ఫిర్యాదులుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భక్తులకు సూచించారు. అంతకుముందు టికెట్ల కోసం కౌంటర్ వద్దకు వెళ్లే క్రమంలో శ్రీవాణి భక్తుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.